త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget | బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ఈ సారైనా న్యాయం జ‌రిగేనా..!

Union Budget | మ‌రికొన్ని గంట‌ల్లో 2026-27 వార్షిక బ‌డ్జెట్‌ను (Union Budget) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman) లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. నిరంత‌రాయంగా అత్య‌ధిక‌కాలం ఆర్థిక మంత్రిగా ప‌నిచేస్తూ, వ‌రుస‌గా అత్య‌ధిక బ‌డ్జెట్‌లు ప్ర‌సంగం చేయ‌నున్న వ్య‌క్తిగా, మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించ‌నున్న నిర్మ‌ల‌మ్మ‌.. ఈ సారైనా త‌మ‌పై వ‌రాలు కురిపిస్తారా అని తెలంగాణ ప్ర‌జ‌లు ఆస‌క్తిగా చూస్తున్నారు.

G

News | Published On Feb 1, 2026, 7.25 am IST

Union Budget | బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ఈ సారైనా న్యాయం జ‌రిగేనా..!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మ‌రికొన్ని గంట‌ల్లో 2026-27 వార్షిక బ‌డ్జెట్‌ను (Union Budget) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman) లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. నిరంత‌రాయంగా అత్య‌ధిక‌కాలం ఆర్థిక మంత్రిగా ప‌నిచేస్తూ, వ‌రుస‌గా అత్య‌ధిక బ‌డ్జెట్‌లు ప్ర‌సంగం చేయ‌నున్న వ్య‌క్తిగా, మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించ‌నున్న నిర్మ‌ల‌మ్మ‌.. ఈ సారైనా త‌మ‌పై వ‌రాలు కురిపిస్తారా అని తెలంగాణ ప్ర‌జ‌లు ఆస‌క్తిగా చూస్తున్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి కేంద్రంలోని ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం స‌వ‌తి త‌ల్లిలా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న‌ది. దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి బ‌డ్జెట్‌లో అర‌కొర కేటాయింపుల‌తో (Budget Allocations) అన్యాయం చేస్తున్న‌ది. జీడీపీకి (స్థూల దేశీయోత్పత్తి) 5 శాతం సమకూరుస్తున్న తెలంగాణ‌పై త‌న వ్య‌తిరేక‌త‌ను చాటుకుంటూ వ‌స్తున్న‌ది. రైల్వే కేటాయింపుల్లోనూ వివ‌క్ష‌ను కొన‌సాగిస్తున్న‌ది.

దేశవ్యాప్తంగా 69 వేల కిలోమీట‌ర్ల‌కుపైగా రైల్వే నెట్‌వర్క్‌ (Railway Connectivity) విస్తీర్ణం ఉండ‌గా, తెలంగాణలో 2,014.61 కిలోమీటర్లు మాత్రమే. ఇది దేశ రైల్వే నెట్‌వర్క్‌లో 3 శాతమే కావ‌డం కేంద్రం అనుస‌రిస్తున్న వ్య‌తిరేక‌ధోర‌ణికి ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. ఉమ్మ‌డి ఏపీలో నాటి పాల‌కులు త‌మ ప్రాంతానికే రైల్వే లైన్లు, నిధుల‌ను ఎక్కువ‌గా అభివృద్ధి చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్ప‌డి పుష్క‌ర కాలం కావ‌స్తున్నా కొత్త‌గా వ‌చ్చిన రైల్వే లైన్లు లేవు, కాన‌రావు కూడా. 2016-17లో మంజూరైన మనోహరాబాద్‌-కొత్తపల్లి ప్రాజెక్టు (పుష్క‌ర కాల‌మైనా ఇంకా కొన‌సాగుతూనే ఉంది), చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ మిన‌హా పెద్ద‌గా చెప్పుకునేందుకు ఏవీ లేవు. రాష్ట్రంలో నెల‌కొన్న‌ రైల్వే మౌలిక సదుపాయాల లోటును పూడ్చేందుకు కేంద్ర బడ్జెట్‌లో సరిపడా నిధులను కేటాయిస్తున్న పరిస్థితులూ కనిపించడం లేదు.

కొత్త ప్రాజెక్టులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించిన త‌ర్వాత వాటి మంజూరులో రైల్వే శాఖ ఏండ్ల‌ తరబడి జాప్యం చేస్తూ వ‌స్తున్న‌ది. గుడ్డిలో మెళ్ల‌లో అనుమ‌తులు సాధించిన‌ప్ప‌టికీ టెండర్లు పిలిచేందుకూ ఏండ్లు పడుతుండ‌టం తెలంగాణ ప‌ట్ల‌ బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను తెలియ‌జేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ ఎంపీలే త‌మ‌కూ ప్ర‌తినిధులుగా ఉంటుంద‌ని భావించిన ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఎన్న‌డూలేనివిధంగా బీజేపీకి ఎనిమిది మందిని గెలిపించారు. వారిలో ఇద్ద‌రు కేంద్ర మంత్రులుగా కూడా అయ్యారు. అయినా గ‌త బ‌డ్జెట్‌లో రైల్వేల కోసం రాష్ట్రానికి ద‌క్కింది రూ.5,336 కోట్లే కావ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలో ప్రస్తుతం 6 కొత్త లైన్లు, 14 డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు రూ.23 వేల కోట్లు నిధులు కావాలి. సర్వే దశలో ఉన్నటువంటి ప్రతిపాదిత ప్రాజెక్టుల విలువ రూ.49 వేల కోట్లకుపైనే. అయితే 2025-26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5,336 కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే దశాబ్దాలుగా కొనసాగుతున్న లోటును భర్తీ చేయాలంటే మాత్రం నిధుల కేటాయింపు భారీగా పెరగాల్సిన అవసరం ఉంది.

Advertisement
Advertisement