త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Ramachandar Rao | మూసీ ప్ర‌క్షాళ‌న ఓకే.. కానీ పేద‌ల ఇండ్లు కూల్చకుండా చేయాలి

BJP Chief Ramachandar Rao | గాంధీ సరోవర్ (Gandhi Sarovar) ప్రాజెక్ట్ పై సందేహాలున్నాయ‌ని.. పేదల ఇండ్లు కూల్చి విగ్రహాలు లేదా ప్రాజెక్టులు నిర్మించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (BJP Chief Ramachandar Rao) స్ప‌ష్టం చేశారు. ‘మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు’ అంశంపై బీజేపీ (BJP) తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చర్చా కార్యక్రమం నిర్వ‌హించారు.

S

News | Published On Mar 22, 2026, 3.55 pm IST

BJP Ramachandar Rao | మూసీ ప్ర‌క్షాళ‌న ఓకే.. కానీ పేద‌ల ఇండ్లు కూల్చకుండా చేయాలి
Advertisement

- ఇండ్లు కూల్చి విగ్ర‌హాలు నిర్మిస్తే స‌హించం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

త్రినేత్ర‌.న్యూస్‌: గాంధీ సరోవర్ (Gandhi Sarovar) ప్రాజెక్ట్ పై సందేహాలున్నాయ‌ని.. పేదల ఇండ్లు కూల్చి విగ్రహాలు లేదా ప్రాజెక్టులు నిర్మించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (BJP Chief Ramachandar Rao) స్ప‌ష్టం చేశారు. ‘మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు’ అంశంపై బీజేపీ (BJP) తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైద‌రాబాద్‌లో చర్చా కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీని, హైదరాబాద్‌ను పాలించినప్పుడు మూసీ ప్రక్షాళన (Musi Purification) ఎందుకు చేయలేదని ప్ర‌శ్నించారు. ఇప్పుడు అకస్మాత్తుగా అభివృద్ధి పేరుతో ప్రాజెక్టులు తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని నిల‌దీశారు.

మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, టూరిజం అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని.. నది శుభ్రంగా ఉండి, నీరు స్వచ్ఛంగా ఉండాలని కోరారు. కానీ అభివృద్ధి పేరుతో అవినీతి చేయ‌డాన్ని తాము ఒప్పుకోమ‌ని తేల్చిచెప్పారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అవినీతి జరిగితే ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ పేరుతో అదే పునరావృతం అవుతుందని విమ‌ర్శించారు. ప్ర‌జాధనాన్ని వృథా చేసే హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నారు. మూసీ నది శుద్ధి అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదని ఇది మన భవిష్యత్తుకు పెట్టుబడి అని ఉద్ఘాటించారు. ఆరోగ్యానికి, రైతుల జీవనానికి, తెలంగాణ అభివృద్ధికి అత్యవసరమ‌ని పేర్కొన్నారు.

మూసీ అంటే కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదు. ఇది వికార్‌బాద్ జిల్లా నుంచి ప్రారంభమై, నల్గొండ, సూర్యాపేట జిల్లాల గుండా ప్రవహించి చివరికి కృష్ణా నదిలో కలుస్తుంది. దాదాపు 240 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ నది పక్కన వేలాది మంది రైతులు పంటలు పండిస్తున్నారు. కానీ పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఈ నది నీటితో పండుతున్న పంటలు కూడా విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. ఇది రైతుల ఆరోగ్యానికి, వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు. మూసీ శుద్ధి అంటే మొత్తం దక్షిణ తెలంగాణకు సంబంధించిన అవసరం అని ఆయ‌న వెల్ల‌డించారు.

అంబేద్క‌ర్ ఆలోచ‌న‌తోనే న‌దుల అనుసంధానం..

మనం తాగే ప్రతి నీటి బొట్టులో ఒక నది కథ ఉంటుంది. కానీ మనకు జీవాన్ని ఇచ్చే ఆ నదులను ఎంత గౌరవిస్తున్నామ‌నే ప్రశ్నను అంద‌రం ఆలోచించాలి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వాతంత్య్రానికి ముందు వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానం (River Linking) గురించి దూరదృష్టితో ఆలోచించారు.
ఆయన ఆలోచనల ఆధారంగానే సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి కీలక సంస్థలు ఏర్పడ్డాయి. భారతదేశంలో నీటి నిర్వహణలో ఆయన పాత్ర ఎంతో గొప్పది.

గంగాన‌దికి ఇర‌వై వేల కోట్లే..

పెన్షన్లు ఇవ్వడానికి, రైతు భరోసా అమలు చేయడానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తుందని ప్ర‌శ్నించారు. ఈ అప్పుల భారం చివరికి తెలంగాణ ప్రజలపైనే పడుతుందని వాపోయారు. అటల్ బిహారీ వాజపేయి స్ఫూర్తితో గుజరాత్‌లో నర్మదా–సబర్మతి అనుసంధానం చేసి, సబర్మతి నదిని పునరుద్ధరించారని తెలిపారు. అక్కడ కూడా ఇండ్లు కూల్చార‌ని.. కానీ కూల్చే ముందే బాధితుల‌కు పున‌రావాసం క‌ల్పించిన‌ట్లు గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “నమామి గంగే” ప్రాజెక్ట్ ద్వారా వేల కిలోమీటర్ల గంగా నదిని శుద్ధి చేయడానికి సుమారు రూ.20,000 కోట్ల వ్యయం చేశారన్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెబుతుండ‌డం అనుమానంగా ఉంద‌ని చెప్పారు.

ముందు కూల్చి, తర్వాత ఇస్తాం అనేది అన్యాయం..

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మొదట రూ.5,000 కోట్లుగా చెప్పి, త‌ర్వాత‌ రూ.7,000 కోట్లకు పెంచ‌డంపై అనుమానం ఉంద‌న్నారు. “ముందు కూల్చి, తర్వాత ఇస్తాం” అనే విధానం పూర్తిగా అన్యాయమ‌న్నారు. 10 వేల ఇండ్లు కూల్చుతామని చెప్పి, అసెంబ్లీలో 1,400 ఇండ్లు మాత్రమే అని ఓ కాంగ్రెస్ మంత్రి అన్న‌ట్లు గుర్తు చేశారు. అమెరికాలో చికాగో నగరంలో ఉన్న సరస్సులు, ఇంగ్లాండ్‌లో మాంచెస్టర్ ప్రాంతంలోని నదులు, న్యూయార్క్–న్యూజెర్సీ మధ్య ప్రవహించే నదులు, లండన్‌లో థేమ్స్ నది, పారిస్‌లో సీన్ నదులను చ‌క్కగా అభివృద్ధి చేశార‌న్నారు. అక్కడ బఫర్ జోన్ పేరుతో ప్రజలను బహిష్కరించలేద‌న్నారు.

రైతుల జీవ‌నోపాధికి క‌ష్టం..

తెలంగాణ‌లో 12 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఒకే నదికి ఒకే విధానం ఉండాలి. ఒకచోట ఒకలా, మరోచోట మరోలా ఎందుకు? నార్సింగి ప్రాంతంలో పెద్ద నిర్మాణాలకు బఫర్ జోన్ వర్తించకపోతే, మధు పార్కు రిడ్జ్ సాధారణ ప్రజల ఇళ్లకు ఎందుకు వర్తిస్తోంది? అని ప్ర‌శ్నించారు. ఈ ప్రాజెక్ట్ పేరుతో వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దాదాపు 3,000 ఎకరాల భూమి స్వాధీనం చేసుకునే పరిస్థితి వస్తే రైతుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో పండించే కూరగాయలే హైదరాబాద్ నగరానికి సరఫరా అవుతున్నాయ‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement