Ex-Agniveers | మాజీ అగ్నివీరుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టుల్లో వీళ్లకు ప్రత్యేకంగా 50 శాతం రిజర్వేషన్ కోటా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎక్స్ అగ్నివీర్స్కి బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్థాయి పోస్టుల్లో 10 శాతం మాత్రమే కోటా ఉంది. ఆ రిజర్వేషన్ కోటాను ఇప్పుడు 50 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కి సంబంధించిన జనరల్ డ్యూటీ క్యాడర్ రిక్రూట్మెంట్ రూల్స్ 2015 ను తాజాగా సవరించిన కేంద్రం కొత్త రిక్రూట్మెంట్ రూల్స్ 2025 ను తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ స్థాయి పోస్టుల్లో సగం పోస్టులను మాజీ అగ్నివీరులకే కేటాయించనున్నారు. Ex-Agniveers |ఇతర కేంద్ర పారామిలిటరీ బలగాల్లోనూ రిజర్వేషన్లు బీఎస్ఎఫ్ మాత్రమే కాదు.. ఇతర కేంద్ర పారా మిలిటరీ బలగాలు అయిన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలలో కూడా ఇదే తరహాలో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంది. అగ్నిపథ్ స్కీమ్ కింద నాలుగేళ్ల పాటు సర్వీసు పూర్తయ్యాక బయటికి వచ్చే యూత్‌కి భారత్ కోసం పనిచేసే సైనికుడిగా అవకాశం ఇచ్చేలా కేంద్రం ఈ ప్రణాళిక రచిస్తోంది. అగ్నిపథ్ సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లకు బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదు. ఎందుకంటే వీళ్లు సైన్యంలో అప్పటికే శిక్షణ పొంది ఉంటారు కాబట్టి రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే చాలు.