త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | అభివృద్ధి ప‌థంలో భార‌త్ దూసుకెళ్తోంది : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

PM Modi | ప్రపంచం ప్రస్తుతం కరోనా మహమ్మారి, యుద్ధాలు, ఇంధన సంక్షోభం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో రూ.18,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వ‌హించారు.

P

National | Published On Jun 5, 2026, 10.05 pm IST

PM Modi | అభివృద్ధి ప‌థంలో భార‌త్ దూసుకెళ్తోంది : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
Advertisement

PM Modi | ప్రపంచం ప్రస్తుతం కరోనా మహమ్మారి, యుద్ధాలు, ఇంధన సంక్షోభం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో రూ.18,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వ‌హించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత దశాబ్దం ప్రపంచానికి అత్యంత క్లిష్టమైన కాలంగా మారిందని మోదీ పేర్కొన్నారు. కరోనా ప్రభావం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేశాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత ప్రజల కృషితో దేశం స్థిరత్వాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిని కొనసాగించగలిగిందని చెప్పారు.

ప్రపంచం క్రమంగా హరిత భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోందని, భారత్ కూడా గ్రీన్ గ్రోత్ ల‌క్ష్యంతో ముందుకు సాగుతోందని మోదీ వెల్లడించారు. స్వచ్ఛ ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దేశాన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ దేశ భవిష్యత్తుకు కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. ఇతరులపై ఆధారపడే దేశాలు సంపూర్ణ అభివృద్ధిని సాధించలేవని, స్వయం సమృద్ధి ద్వారానే ఆర్థిక బలం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విమర్శించే వారిపై కూడా ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయ లాభాల కోసం అస్థిరతను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

హిమాచల్ ప్రదేశ్, హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఆరోపించారు. దేశ అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మోదీ మరోసారి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల విస్తరణ, ఆర్థిక పురోగతి కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇటీవల ఐదు దేశాల పర్యటన సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్ రాజకీయ, ఆర్థిక ప్రగతిపై ఆసక్తి చూపిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఎన్‌డీఏ సాధించిన విజయాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి, స్వయం సమృద్ధి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతే భారత లక్ష్యమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశం మరింత కీలక పాత్ర పోషించే దిశగా ముందుకు సాగుతోందని మోదీ అన్నారు.

Advertisement
Advertisement