త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | లీకేజీలో పెద్ద‌ల ప్ర‌మేయం ఉంది.. ఆరోప‌ణ‌లున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వ‌డంపై కేజ్రీవాల్ ప్ర‌శ్న‌లు

Arvind Kejriwal | దేశంలో తరచూ వెలుగుచూస్తున్న పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల వెనుక వేల కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోందని, ఇందులో ప‌లువురు కీల‌క పెద్ద‌ల ప్ర‌మేయం ఉంద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ నేష‌న‌ల్ క‌న్వీన‌ర్‌, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పేపర్ లీక్‌లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమ‌ర్శించారు.

P

National | Published On Jun 5, 2026, 9.35 pm IST

Arvind Kejriwal | లీకేజీలో పెద్ద‌ల ప్ర‌మేయం ఉంది.. ఆరోప‌ణ‌లున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వ‌డంపై కేజ్రీవాల్ ప్ర‌శ్న‌లు
Advertisement

Arvind Kejriwal | దేశంలో తరచూ వెలుగుచూస్తున్న పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల వెనుక వేల కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోందని, ఇందులో ప‌లువురు కీల‌క పెద్ద‌ల ప్ర‌మేయం ఉంద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ నేష‌న‌ల్ క‌న్వీన‌ర్‌, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పేపర్ లీక్‌లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమ‌ర్శించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియో సందేశాన్ని ఆయ‌న రిలీజ్ చేశారు. ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌తి రెండు మూడేళ్ల‌కోసారి ఒకసారి దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు లభించడం లేదని ఆయన ప్రశ్నించారు. “పేపర్ లీక్ అనేది వేల కోట్ల రూపాయల వ్యాపారం. ఇందులో చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. అందుకే ఈ వ్యవహారం ఆగడం లేదు. పదే పదే ప్రశ్నాపత్రాలు బయటకు వస్తున్నా బాధ్యులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?” అని ఆయన నిలదీశారు.

ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా ప్రశ్నాపత్రాల లీకేజీ జరగలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. “ఢిల్లీలో పదేళ్లపాటు ప్రభుత్వం నడిపాం. ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. పంజాబ్‌లో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ఘటన జరగలేదు” అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఎంట్రెన్స్‌, రిక్రూట్‌మెంట్ నియామక పరీక్షల్లో మాత్రం పదేపదే వివాదాలు తలెత్తుతున్నాయని ఆయన విమర్శించారు. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదని, సంకల్పం లోపించడమే అసలు కారణమని ఆరోపించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టుల అంశాన్ని కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. తెలంగాణలో పరీక్షల నిర్వహణకు సంబంధించి గతంలో వివాదాల్లో చిక్కుకున్న ఓ సంస్థకు, ఆరోపణలు వచ్చినప్పటికీ జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం కమిటీలు ఏర్పాటు చేయడానికే పరిమితమవుతున్నారని విమర్శించారు. “కమిటీలు వేయడం తప్ప అసలు నిందితులపై చర్యలు కనిపించడం లేదు. అంటే మొత్తం కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి” అని అన్నారు.

నీట్ (NEET) పరీక్ష చుట్టూ నెలకొన్న వివాదాన్ని కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకునేందుకు ప్రకటిస్తున్న చర్యలు సరిపోవని అభిప్రాయపడ్డారు. ప్రశ్నాపత్రాల తయారీ దశలోనే లీక్ జరుగుతుంటే, కేవలం రవాణా విధానాల్లో మార్పులు చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరకదని పేర్కొన్నారు. లీక్‌లకు పాల్పడుతున్న వారిని కాపాడుతున్నార‌ని, వచ్చే ఏడాది కూడా పేపర్లు లీక్ చేసి మళ్లీ వేల కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతోనే వారిపై చర్యలు తీసుకోవడం లేదనే అనుమానం క‌లుగుతోంద‌న్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు కలిసి స్వరం వినిపించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ వ్యవస్థను సరిచేయాలని ప్రజలు బలంగా డిమాండ్ చేస్తేనే మార్పు వస్తుంద‌ని, లేకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతమవుతూనే ఉంటాయ‌న్నారు. దేశవ్యాప్తంగా పోటీ, నియామక పరీక్షలకు సంబంధించిన పలు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 

Advertisement
Advertisement