త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddaramaiah | డీకే శివ‌కుమార్ సీఎం అయ్యేనా..? ఢిల్లీ నుంచి పిలుపు వ‌స్తే వెళ్తాన‌న్న సిద్ధారామ‌య్య‌..!

Siddaramaiah | గ‌త కొంత‌కాలంగా క‌ర్నాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పుల‌పై ఊహాగానాలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీఎం సిద్ధ‌రామ‌య్య ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ప్రశ్నించగా ఆ నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటుందని స్పష్టం చేశారు.

P

National | Published On May 5, 2026, 3.20 pm IST

Siddaramaiah | డీకే శివ‌కుమార్ సీఎం అయ్యేనా..? ఢిల్లీ నుంచి పిలుపు వ‌స్తే వెళ్తాన‌న్న సిద్ధారామ‌య్య‌..!
Advertisement

Siddaramaiah | గ‌త కొంత‌కాలంగా క‌ర్నాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పుల‌పై ఊహాగానాలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీఎం సిద్ధ‌రామ‌య్య ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ప్రశ్నించగా ఆ నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. తాను పిలిస్తే ఢిల్లీకి వెళ్తానని పేర్కొన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలన్న అనుచరుల డిమాండ్‌పై ఆయ‌న స్పందిస్తూ అందులో త‌ప్పేమీ లేద‌న్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత చర్చలు జరుగుతున్న తరుణంలో సీఎం కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సుదీర్ఘ‌కాలం పాల‌న‌ను ప్ర‌స్తావించారు. 15 ఏళ్ల పాలన తర్వాత వ్యతిరేకత పెరగడం సహజమన్నారు. అలాగే ఓటరు జాబితా నుంచి 90ల‌క్ష‌ల మంది పేర్లు తొల‌గించ‌డం సైతం ఓ కార‌ణంగా పేర్కొన్నారు. తమిళనాడు ఫలితాల విషయంలో యువత మార్పు కోరుకుంద‌ని, దాంతో నటుడు విజయ్ గెలుపు సాధ్యమైంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా.. క‌ర్నాట‌క‌లో మ‌ళ్లీ నాయ‌క‌త్వ మార్పుపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రభుత్వం 2025 నవంబర్ నాటికి రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మ‌ళ్లీ జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య రెండున్నరేళ్ల చొప్పున అధికారాన్ని పంచుకునేలా ఒప్పందం జరిగిందనే అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. సిద్ధరామయ్య పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తి కాగా.. శివకుమార్ అనుచరులు ఆయనను ముఖ్యమంత్రిని చేయాల‌ని బ‌హిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే, హైకమాండ్ జోక్యంతో పరిస్థితి తాత్కాలికంగా ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. శివ‌కుమార్ ఇటీవ‌ల మ‌ళ్లీ ఢిల్లీకి వెళ్ల‌డంతో మళ్లీ నాయకత్వ మార్పుపై వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే, తుది నిర్ణయం హైకమాండ్‌దేనని, అది ఇద్దరికీ ఆమోదయోగ్యమేనని శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఈ అంశంపై స్పందించారు. నాయకత్వ మార్పుకు సంబంధించి ఎలాంటి తేదీ నిర్ణయించలేదని తెలిపారు. ఈ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క‌లిసి అధినాయ‌క‌త్వం సమ‌ష్టిగా నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement