త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal Tamil Nadu Elections 2026 | బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్.. పోటెత్తిన ఓటర్లు.. చెన్నైలో క్యూలైన్లలో కోలీవుడ్ తారలు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్‌లో దాదాపు 90 శాతం, తమిళనాడులో 82 శాతానికి పైగా భారీ పోలింగ్ నమోదైంది. తమిళనాడులో రజినీకాంత్, విజయ్, అజిత్ తదితర సినీ ప్రముఖులు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

J

National | Published On Apr 23, 2026, 6.33 pm IST

West Bengal Tamil Nadu Elections 2026 | బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్.. పోటెత్తిన ఓటర్లు.. చెన్నైలో క్యూలైన్లలో కోలీవుడ్ తారలు

సంక్షిప్త సారాంశం

2026 పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రికార్డు స్థాయిలో కొనసాగింది. బెంగాల్‌లో తొలి విడతలో 152 స్థానాలకు, తమిళనాడులో ఒకే విడతలో మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బెంగాల్‌లో భవానీపూర్ (మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి), నందిగ్రామ్ లాంటి హై-ప్రొఫైల్ స్థానాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు, తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే-బీజేపీ, దళపతి విజయ్ (TVK) పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. సినీ తారలు ఓటు వేయడానికి క్యూలైన్లలో నిలబడటం విశేషం.

Advertisement
  • సాయంత్రం 5 వరకు అత్యధికంగా 89.92 శాతం పోలింగ్
  • తమిళనాడులో 82.24 శాతం పోలింగ్

West Bengal Tamil Nadu Elections 2026 | త్రినేత్ర.న్యూస్ : దేశంలోనే రెండు కీలక రాష్ట్రాలు.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు గాను తొలి విడతలో 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. నందిగ్రామ్, డార్జిలింగ్, సిలిగురి, జల్పాయ్‌గురి, కూచ్ బెహార్ వంటి కీలక ప్రాంతాల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. రెండో విడత ఏప్రిల్ 29న జరగనుంది. ఓటర్ల జాబితా సవరణ వివాదాల నడుమ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

మరోవైపు, తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, నటుడు దళపతి విజయ్ కు చెందిన 'తమిళగ వెట్రి కళగం' మధ్య రసవత్తర త్రిముఖ పోరు నెలకొంది. 'ద్రావిడ మోడల్' పాలన, సంక్షేమ పథకాల చుట్టూ డీఎంకే ప్రచారం చేయగా.. కుటుంబ పాలనను అంతమొందించి, అవినీతి రహిత సుపరిపాలన అందిస్తామని అన్నాడీఎంకే-బీజేపీ కూటమి హామీ ఇచ్చింది.

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం

ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు.

పశ్చిమ బెంగాల్: సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా 89.92 శాతం పోలింగ్ నమోదైంది.

తమిళనాడు: సాయంత్రం 5 గంటల వరకు 82.24 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

క్యూలైన్లలో కోలీవుడ్ తారలు.. సందడిగా తమిళనాడు పోలింగ్

తమిళనాడు ఎన్నికల్లో సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సెలబ్రిటీలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి సామాన్యులతో పాటు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. TVK అధినేత, నటుడు విజయ్ తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, కార్తీ, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్, శింబు ఓటు వేశారు. హీరోయిన్లు త్రిష, శృతి హాసన్, కీర్తి సురేష్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, ఆయన సతీమణి ప్రీతి నారాయణ్ చెన్నైలో ఓటు వేశారు.

TN Election | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు – ఓటేసిన సెలిబ్రిటీలు - Image 5

TN Election | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు – ఓటేసిన సెలిబ్రిటీలు - Image 7

TN Election | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు – ఓటేసిన సెలిబ్రిటీలు - Image 1

TN Election | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు – ఓటేసిన సెలిబ్రిటీలు - Image 2

TN Election | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు – ఓటేసిన సెలిబ్రిటీలు - Image 3

తమిళనాడులో కీలక నియోజకవర్గాలు

ఎడప్పాడి : మాజీ సీఎం కె.పళనిస్వామికి ఇది కంచుకోట. 2011 నుండి ఆయన ఇక్కడ గెలుస్తున్నారు. ఈసారి ఆయనకు డీఎంకే నుంచి కాశీ, టీవీకే నుంచి ఎం. అరుణ్‌కుమార్‌ గట్టి పోటీ ఇస్తున్నారు.

కొలత్తూరు : సీఎం ఎంకే స్టాలిన్ వరుసగా మూడుసార్లు గెలిచిన హై-ప్రొఫైల్ స్థానం ఇది. ఈసారి స్టాలిన్‌పై అన్నాడీఎంకే తరపున పి.సంతానకృష్ణన్, టీవీకే నుంచి వీఎస్ బాబు బరిలో ఉన్నారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని డీఎంకే 'వార్ రూమ్' నుంచి పోలింగ్ సరళిని స్వయంగా పర్యవేక్షించారు. "ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయం లాంటి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు మీ ఓటును ఆయుధంగా వాడండి" అని ఆయన సోషల్ మీడియా ద్వారా స్టాలిన్ పిలుపునిచ్చారు.

పశ్చిమ బెంగాల్: ఉత్కంఠ రేపుతున్న రసవత్తర పోరు

భవానీపూర్ (మమత వర్సెస్ సువేందు - ది రీమ్యాచ్): 2021 నందిగ్రామ్ ఎన్నికల తర్వాత సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మరోసారి భవానీపూర్ వేదికగా తలపడుతున్నారు. ఇది టీఎంసీకి బలమైన కంచుకోట.

నందిగ్రామ్: 2021లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి (బీజేపీ), ఇప్పుడు ఇక్కడ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఆయనపై టీఎంసీ నుంచి ఒకప్పటి ఆయన అనుచరుడు పవిత్ర కర్ పోటీ చేస్తున్నారు.

TN Election | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు – ఓటేసిన సెలిబ్రిటీలు - Image 15

భాంగర్: తరచూ టీఎంసీ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ మధ్య రాజకీయ ఘర్షణలు జరిగే ఈ సున్నితమైన స్థానంపై అందరి దృష్టి ఉంది. 2021లో ఇక్కడ గెలిచిన ఏకైక బీజేపీయేతర ప్రతిపక్ష ఎమ్మెల్యే నవ్సాద్ సిద్దిఖీ మళ్లీ బరిలో ఉన్నారు.

మాల్తీపూర్: బెంగాల్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, రాష్ట్రంలో మతం ఆధారిత రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి మౌసమ్ నూర్ ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే కారుపై దాడి: ఆసన్‌సోల్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ కారుపై తొలి విడత పోలింగ్ సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

Advertisement
Advertisement