త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Water Crisis | దేశంలో ముంచుకొస్తున్న నీటి సంక్షోభం.. ప్రాజెక్టుల్లో తగ్గిన నిల్వలు

P

National | Published On May 3, 2026, 12.33 pm IST

Water Crisis | దేశంలో ముంచుకొస్తున్న నీటి సంక్షోభం.. ప్రాజెక్టుల్లో తగ్గిన నిల్వలు
Advertisement
  • 40శాతం కంటే దిగువకు పడిపోయిన నీటి నిల్వలు
  • నదీ పరీవాహకాల్లోనూ తగ్గిన నీటిమట్టం
  • 166 జలాశయాల్లో తగ్గిన నిల్వలు
  • సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నివేదిక

Water Crisis | వేసవిలో ఎండలు దంచికొడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. తెలంగాణతో పాటు విదర్భలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. వేసవిలో దేశవ్యాప్తంగా నీటి సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. వేసవి వేడి క్రమంగా పెరుగుతున్న వేళ.. జలవనరులపై ఒత్తిడి తీవ్రంగా పెరిగి ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాలు పరిస్థితి ఎంత విషమంగా మారిందో స్పష్టం చేస్తున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ వీక్లీ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 166 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో 40 శాతం కంటే దిగువకు పడిపోయాయి. నిలువలు భారీగా పడిపోవడం ఆందోళనకరంగా మారింది. ఇదే సమయంలో అనేక కీలక నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా నీటి మట్టాలు పడిపోవడం ఇబ్బందికరంగా మారుతోంది.

సెంట్రల్ వాటర్ కమిషన్ బులెటిన్ ప్రకారం.. ఈ 166 జలాశయాల్లో ప్రస్తుతం మొత్తం లైవ్ స్టోరేజ్ 71.082 బిలియన్ క్యూబిక్ మీటర్లు (BCM) మాత్రమే. మొత్తం సామర్థ్యం 183.565 బీఎంసీతో పోలిస్తే ఇది కేవలం 38.72 శాతం మాత్రమే. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌ మే 9న 44.71శాతంగా ఉన్న నీటి నిల్వలు కేవలం.. మూడువారాల్లోనే భారీగా పడిపోయాయి. జలాశయాలు దేశంలోని మొత్తం అంచనా నీటి నిల్వ సామర్థ్యం 257.812 బీసీఎంలో సుమారు 71.20 శాతం వాటాను కలిగి ఉండటం పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టం చేస్తోంది. వీటిలో 20 జలాశయాలు జలవిద్యుత్ ఉత్పత్తితో అనుసంధానం కాగా.. వాటి సామర్థ్యం 35.299 బీసీఎంగా ఉంది.

రివర్‌ బేసిన్‌లోనూ అదే పరిస్థితి..

దేశంలోని ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ ప్రారంభంతో పోలిస్తే జీవనది గంగా బేసిన్‌లోనూ నీటి లెవల్స్‌ 53.8 శాతం నుంచి సుమారు 50.01 శాతానికి పడిపోయింది. గోదావరి బేసిన్‌లో 47.58 శాతం నుంచి 40.69 శాతానికి, నర్మదా బేసిన్‌లో 46.09 శాతం నుంచి 38.82 శాతానికి తగ్గింది. ఇప్పటికే ఇబ్బందికరంగా ఉన్న కృష్ణా బేసిన్‌లో మాత్రం 22.55 శాతంగా ఉంది. ప్రస్తుతం కావేరి నదిలో 35.74 శాతం, మహానదిలో 43.51 శాతానికి నీటి నిల్వలు పడిపోయాయి. తాపీ బేసిన్ మాత్రం సమతుల్యంగానే నీటి నిల్వలు ఉన్నాయని సెంట్రల్‌ వాటర్‌ కమిషనర్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

జలాశయాల్లో అత్యల్ప స్థాయికి నీటి మట్టాలు

దేశవ్యాప్తంగా అనేక ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అసోంలోని ఖాండాంగ్ జలాశయంలో నీటి నిలువలు సుమారు 21.16 శాతానికి పడిపోయాయి. జార్ఖండ్‌లోని చందన్ డ్యామ్‌ మొత్తం అడుగంటిపోయింది. కర్నాటక తత్తహళ్లా జలాయశంలో 24.63 శాతానికి తగ్గింది. కేరళలో పెరియార్ రిజర్వాయర్‌లో 29.21 శాతానికి చేరింది. తమిళనాడులో వైగై జలాశయం 15.17 శాతానికి పడిపోవడం గమనార్హం. అలాగే, కరయ్యార్ 49.89 శాతం, అలియార్ 48.89 రిజర్వాయర్లలో శాతంగా ఉన్నాయి.

166 జలాశయాల్లో భారీ లోటు

మొత్తం 166 జలాశయాల్లో 22 జలాశయాలు సాధారణ స్థాయితో పోల్చితే 80 శాతం కంటే తక్కువ నీటి నిల్వలతో ఉండటం పరిస్థితి ఎంత తీవ్రమైందో చూపిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జలాశయాల్లో గత ఏడాదితో పోల్చితే నిల్వలు తగ్గాయి. గోవాలో ఒకే ప్రధాన జలాశయం మాత్రమే ఉన్నప్పటికీ.. అక్కడ కూడా 12 శాతం కంటే ఎక్కువ తగ్గుదల నమోదవడం స్థానిక నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావాన్ని సూచిస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి రంగాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా నీటి వినియోగంపై నియంత్రణ, సమర్థవంతమైన నిర్వహణ అత్యవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement