త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Cloud AI Hub Vizag | విశాఖ‌లో గూగుల్ క్లౌడ్ ఏఐ హ‌బ్‌కు శంకుస్థాప‌న‌..

Google Cloud AI Hub Vizag | విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్‌కు మంగ‌ళ‌వారం శంకుస్థాపన చేశారు. రూ.1.35 లక్షల కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ రంగంలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దనుంది. కార్య‌క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బాబుతో పాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ పాల్గొన్నారు.

P

National | Published On Apr 28, 2026, 4.13 pm IST

Google Cloud AI Hub Vizag | విశాఖ‌లో గూగుల్ క్లౌడ్ ఏఐ హ‌బ్‌కు శంకుస్థాప‌న‌..
Advertisement

Google Cloud AI Hub Vizag | ఏపీ విశాఖ‌ప‌ట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్‌కు మంగళవారం సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ శంకుస్థాప‌న చేశారు. సుమారు రూ.1.35ల‌క్ష‌ల కోట్ల వ్య‌యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండ‌గా.. రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇప్ప‌టి నుంచి ‘వైజాగ్’లో ‘జీ’ అంటే గూగుల్” అని పేర్కొన్నారు. ఇది కేవలం శంకుస్థాప‌న కార్యక్రమం మాత్రమే కాకుండా.. రాష్ట్ర అభివృద్ధికి కొత్త చరిత్ర ప్రారంభ‌మ‌ని పేర్కొన్నారు.

2ల‌క్ష‌ల మందికి ఉపాధి అవ‌కాశాలు..

ఈ భారీ గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి రానుండగా, ఇది రాష్ట్రానికి ఒక పెద్ద రికార్డుగా నిలవనుంది. నిర్మాణ దశలోనే సుమారు 25 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వ‌స్తాయ‌ని అంచ‌నా. ప్రాజెక్ట్ పూర్త‌య్యాక ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ల‌భించే అవ‌కాశం ఉంది. కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లోనూ టెక్ కంపెనీల‌కు భార‌త్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు. మేధో సంపత్తి హక్కులకు గౌరవం, డేటా భద్రత వంటి అంశాల్లో భారత్‌పై గ్లోబల్ కంపెనీల్లో విశ్వాసం పెరుగుతోంద‌న్నారు.

దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంట‌ర్ల‌లో ఒక‌టిగా..

ఈ ప్రాజెక్ట్ గిగావాట్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనుంది. ఆధునిక క్లౌడ్ సదుపాయాలు, భారీ స్థాయి డేటా నిల్వ సామర్థ్యంతో ఇది పనిచేయనుంది. విశాఖ సమీపంలోని తార్లువాడ, అడవివరం, రాంబిల్లి గ్రామాల పరిధిలో సుమారు 600 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ను మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మొత్తం 6.5 గిగావాట్ సామర్థ్యంతో డిజిటల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

Advertisement
Advertisement