త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay | డీఎంకే పాలనపై శ్వేతపత్రం విడుదల చేస్తాం.. ప్రకటించిన సీఎం విజయ్..!

P

National | Published On May 10, 2026, 3.29 pm IST

Vijay | డీఎంకే పాలనపై శ్వేతపత్రం విడుదల చేస్తాం.. ప్రకటించిన సీఎం విజయ్..!
Advertisement

Vijay | తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీనటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత జోసెఫ్ విజయ్ ఆదివారం అభిమానుల కరతాళధ్వనుల మధ్య ప్రమాణస్వీకారం చేశారు. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా విజయ్ పలు కీలక హామీలపై సంతకాలు చేశారు. గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయడానికీ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకూ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అయితే, ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ చేసిన అత్యంత కీలక ప్రకటన డీఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2021 నుంచి 2026 మధ్యకాలానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ‘డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు మోపింది. గత ప్రభుత్వం ఎంత అప్పు చేసి వెళ్లిందో ప్రజలకు తెలియజేస్తాం. ఆ భారం ఇప్పుడు మా ప్రభుత్వంపై పడింది’ అని విజయ్ వ్యాఖ్యానించారు.

పారదర్శక పాలన అందిస్తాం

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విజయ్.. పారదర్శక పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ‘ప్రజలు మాకు మద్దతు ఇస్తే మా వాగ్ధానాలంటినీ నెరవేర్చేందుకు లేకుండా పని చేస్తాను’ అని ప్రకటించారు. దాంతో సభలో హర్షధ్వానాలు వినిపించాయి. ఇక ఏఐఏడీఎంకేపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన విజయ్.. తాము తెరవెనుక రాజకీయాలు చేయబోమని, పూర్తిగా పారదర్శకంగా పాలన సాగిస్తామని పేర్కొన్నారు. విద్య, ఆహారభద్రత, వైద్య సేవలు, మహిళల భద్రత తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్య అంశాలని తెలిపారు. అయితే, వాటి అమలుకు సంబంధించిన పూర్తి కార్యాచరణను మాత్రం వెల్లడించలేదు. విజయ్ తొలి ప్రసంగంలోనే ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న అనుమానాలను ప్రస్తావించారు. ప్రభుత్వంలో ఒక్కటే అధికార కేంద్రం ఉంటుందని, తానే పరిపాలనలో తుది నిర్ణయాధికారిగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. 234 సభ్యుల తమిళనాడు అసెంబ్లీలో ఆయన ప్రభుత్వానికి కేవలం 120 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉండడం, చిన్న పార్టీల సహకారంతో ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

విమర్శకులూ మనవాళ్లే

రాజకీయ ప్రత్యర్థులపై కూడా విజయ్ మృదువైన ధోరణి ప్రదర్శించారు. తనను విమర్శించిన వారిని కూడా అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములను చేస్తానన్నారు. ‘నన్ను విమర్శించిన వారు. అవమానించిన వారు కూడా నా ప్రజలే’ అని పేర్కొన్నారు. తన అభిమానుల్లో ఎక్కువ మంది యువతే ఉన్నారన్న విజయ్.. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రెండేళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరు లేకపోతే నేను లేను. మా కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లందరికీ అందరికీ ధన్యవాదాలు’ అని విజయ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement