త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toll Tax | వాహనదారులకు కేంద్రం షాక్‌.. టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు మంగళం..!

Toll Tax | దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 నుంచి నగదు స్వీకరణ నిలిపివేయాలని ఎన్‌హెచ్‌ఏఐ (National Highways Authority of India) పరిశీలిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం వెల్లడించింది.

P

National | Published On Feb 20, 2026, 8.35 pm IST

Toll Tax | వాహనదారులకు కేంద్రం షాక్‌.. టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు మంగళం..!
Advertisement

Toll Tax | దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 నుంచి నగదు స్వీకరణ నిలిపివేయాలని ఎన్‌హెచ్‌ఏఐ (National Highways Authority of India) పరిశీలిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి డిజిటల్‌ టోల్‌ వసూలు వ్యవస్థను అమలు చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యం. టోల్‌ చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడం, పారదర్శకతను పెంచడం, వ్యవస్థను మరింత విశ్వసనీయంగా మార్చడం ఉద్దేశమని అధికారులు తెలిపారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారి టోల్‌ ప్లాజాల వద్ద చెల్లింపులు పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే స్వీకరించబడతాయి.

టోల్‌ రుసుము కేవలం ఫాస్టాగ్‌ (FASTag), యూపీఐ (UPI) ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ (Ministry of Road Transport and Highways) ప్రకారం.. ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు విధానాన్ని మరింత బలోపేతం చేయడం, టోల్‌ ప్లాజాల పనితీరును సమర్థవంతంగా మార్చడం కోసం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనదారుల ప్రయాణం మరింత సులభతరం కానుంది. టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ తగ్గి, లేన్‌ సామర్థ్యం పెరుగుతుంది. టోల్‌ లావాదేవీలు ఏకరీతిగా, పారదర్శకంగా మారడంతో పాటు ట్రాఫిక్‌ నిర్వహణ మెరుగవుతుంది. ఆలస్యం జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్‌ లేకుండా నగదు చెల్లింపు చేసే వాహనాలపై నిర్ణయించిన టోల్‌ కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు.

అలాగే యూపీఐ ద్వారా చెల్లింపు చేసే వారికి వాహన వర్గాన్ని బట్టి 1.25 రెట్లు టోల్‌ చార్జి విధిస్తున్నారు. దేశంలో ఫాస్టాగ్‌ వినియోగం ఇప్పటికే 98 శాతానికి పైగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత ఫాస్టాగ్‌ల ద్వారా అధిక శాతం టోల్‌ లావాదేవీలు ఎలక్ట్రానిక్‌ విధానంలోనే సాగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఎన్‌హెచ్‌ఏఐ జాతీయ రహదారి టోల్‌ ప్లాజాల వద్ద యూపీఐ చెల్లింపు సదుపాయాన్ని కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 1,150కు పైగా టోల్‌ ప్లాజాల్లో పూర్తిస్థాయి డిజిటల్‌ చెల్లింపు విధానం అమల్లోకి వస్తే కార్యకలాపాల సామర్థ్యం మరింత పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు విశేష స్పందన లభించింది. ఇప్పటివరకు 50 లక్షలకుపైగా వాహనదారులు ఈ పాస్‌ను వినియోగిస్తున్నారు. ఆరు నెలల్లోనే 26.55 కోట్లకుపైగా లావాదేవీలు నమోదయ్యాయి. ఒకేసారి చెల్లింపుతో ఏడాది పాటు నిర్దిష్ట టోల్‌ చెల్లింపుల వరకు మళ్లీ రీచార్జ్‌ చేయాల్సిన అవసరం లేకుండా ఈ సదుపాయం కల్పించారు.

Advertisement
Advertisement