త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rebel TMC MPs | టీఎంసీలో భారీ చీలిక: ‘మాదే అసలైన పార్టీ’ అంటూ స్పీకర్‌ను కలిసిన రెబల్ ఎంపీలు.. కౌంటర్ ఇచ్చిన అభిషేక్ బెనర్జీ!

తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో అసమ్మతి సెగలు రేగాయి. తామే 'అసలైన టీఎంసీ' అంటూ 22 మంది రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలవడం రాజకీయంగా సంచలనంగా మారింది.

J

National | Published On Jun 14, 2026, 8.24 pm IST

Rebel TMC MPs | టీఎంసీలో భారీ చీలిక: ‘మాదే అసలైన పార్టీ’ అంటూ స్పీకర్‌ను కలిసిన రెబల్ ఎంపీలు.. కౌంటర్ ఇచ్చిన అభిషేక్ బెనర్జీ!
Advertisement
  • లోక్‌సభలో తమకు ప్రత్యేక బ్లాక్ కేటాయించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరిన టీఎంసీ రెబల్ ఎంపీలు
  • తమ క్యాంపులో ఇప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నారని, ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని చెబుతున్న అసమ్మతి వర్గం
  • రెబల్ ఎంపీల డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్పీకర్‌కు అధికారిక లేఖ రాసిన పార్టీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ
  • పార్టీ నియమావళికి వ్యతిరేకంగా వెళ్లిన పలువురు ఎంపీలను కీలక పదవుల నుంచి తప్పించి, సంస్థాగత ప్రక్షాళన చేపట్టిన అధిష్ఠానం

Rebel TMC MPs | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ (TMC) లో తీవ్ర సంక్షోభం నెలకొంది. పార్టీకి చెందిన సుమారు 22 మంది అసమ్మతి (Rebel) ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, సభలో తమకు ప్రత్యేక సీటింగ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. తామే 'అసలైన టీఎంసీ' అని వారు ప్రకటించుకోవడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రెబల్స్ వ్యూహం.. పార్టీ ప్రక్షాళన

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన ఈ అసమ్మతి ఎంపీల బృందం, ఎన్డీయే (NDA) కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెబల్ ఎంపీల గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న కాకోలి ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ.. తమ బలం 20 నుంచి 22 కు చేరిందని, పార్టీలో నిరంకుశత్వం నశించాలని ఆమె వ్యాఖ్యానించారు. ఈ లిస్టులో సుదీప్ బందోపాధ్యాయ, రచనా బెనర్జీ, సాయోనీ ఘోష్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

దీంతో అప్రమత్తమైన టీఎంసీ అధిష్ఠానం, అసమ్మతి నేతలను కీలక పదవుల నుంచి తప్పిస్తూ సంస్థాగత మార్పులు చేపట్టింది. సాయోనీ ఘోష్ స్థానంలో యువజన విభాగం అధ్యక్షుడిగా అర్నబ్ బెనర్జీని నియమించగా.. మహిళా విభాగం పగ్గాలను ఆలీఫా అహ్మద్‌కు అప్పగించింది.

రెబల్స్‌కు గుర్తింపు ఇవ్వొద్దు: స్పీకర్‌కు అభిషేక్ బెనర్జీ లేఖ

రెబల్ ఎంపీల తీరుపై టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారిక లేఖ రాశారు. ఈ వివాదంపై ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఏఐటీసీ (AITC) అనేది ఒకే ఒక అవిభాజ్య రాజకీయ పార్టీ అని స్పష్టం చేశారు. ఎవరైనా కొందరు సభ్యులు తమంతట తాముగా విడిపోయి, పార్టీలో ఒక సమాంతర వర్గాన్ని లేదా ఫ్యాక్షన్‌ను ఏర్పాటు చేసి సభలో స్వతంత్ర గుర్తింపు కోరడానికి వీల్లేదని అభిషేక్ బెనర్జీ ఆ లేఖలో పేర్కొన్నారు. సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, 10వ షెడ్యూల్ కింద పార్టీని చీల్చడం (split) అనే వాదన చెల్లదని ఆయన ఉదహరించారు. చట్ట ప్రకారం ఎంపీల వర్గానికి గుర్తింపు ఇవ్వడం సాధ్యం కాదని, కాబట్టి రెబల్ ఎంపీలకు సభలో ఎలాంటి గుర్తింపు లేదా హోదా ఇవ్వొద్దని ఆయన స్పీకర్‌ను అభ్యర్థించారు.

ఎంపీల అనర్హత తప్పదా?

టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ కూడా ఈ పరిణామాలపై మండిపడ్డారు. పార్టీ మాతృసంస్థ వేరొక పార్టీలో విలీనం కానంత వరకు, చట్టసభల్లో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (Anti-defection law) అంగీకరించదని ఆమె స్పష్టం చేశారు. "రాజ్యాంగం ప్రకారం ఇది చట్టవిరుద్ధం. పార్టీ ఓడిపోయినప్పుడు గెలిపించిన నాయకుడిని, గుర్తును వదిలేసి వెళ్లడం మీ నైతిక బలహీనతను చూపుతోంది" అని ఆమె రెబల్ ఎంపీలను విమర్శించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సాగరికా ఘోష్, కీర్తి ఆజాద్ తదితరులు స్పీకర్ ఓం బిర్లా నివాసానికి చేరుకున్నారు.

Advertisement
Advertisement