Fish | ఆరోగ్యానికి మేలు చేసే చేపలకు మార్కెట్‌లో భారీగానే డిమాండ్ ఉంటుంది. చేపల ధర తక్కువగా ఉండడంతో జనాలు కూడా బాగానే ఎగబడుతుంటారు. ఒక్కో రకం చేపలకు ఒక్కో రకం ధర ఉంటుంది. మొత్తంగా ఎలాంటి రకం చేపలను తీసుకున్నా గరిష్ఠంగా వాటి ధర కిలోకు రూ. 300 నుంచి రూ. 400 వరకు ఉంటుంది. కానీ ఈ చేప ధర మాత్రం రూ. 15 వేలు. చేప ధర పదిహేను వేల రూపాయాలు ఏంటని ఆశ్చర్యపోకండి. మీరు చదువుతున్నది అక్షర సత్యమే. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు నదిలో ఆదివారం ఉదయం గిరిజనులు చేపలు పట్టారు. గిరిజనుల వలకు ఓ భారీ చేప చిక్కింది. ఆ చేప బరువు ఏదో ఒకట్రెండు కిలోలు అనుకుంటే పొరపాటే. ఏకంగా 55 కిలోల బరువున్న ఈ చేప బలిమెల వద్ద వలలో పడినట్లు గిరిజనులు తెలిపారు. పెద్ద తలను కలిగి ఉన్న ఈ చేపను స్థానిక గిరిజనులు దోబీ రకం చేప అంటారు. మొత్తానికి ఈ భారీ చేపను కర్రకు కట్టుకుని, ఇద్దరు గిరిజనులు మోసుకుంటూ సీలేరు సంతకు వచ్చారు. ఇక సంతలో ఈ దోబీ రకం చేపను రూ. 15 వేలకు విక్రయించారు. ఈ చేపను చూసేందుకు మార్కెట్‌కు వచ్చిన వారంతా ఎగబడ్డారు.