TGSRTC | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ సందడి షురూ అయింది. ఇక ఏపీలోని తమ సొంతూర్లకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరం నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని రామచంద్రాపురం డిపో నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు రామచంద్రాపురం డిపో నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక బస్సులన్నీ ఆర్సీ పురం డిపో నుంచి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఏపీకి బయల్దేరనున్నాయి. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్టణం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడతో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఈ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు.. టీజీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. తదితర వివరాల కోసం 9959226149 నంబర్‌ను సంప్రదించొచ్చు.