త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | భార‌త్ ధ‌ర్మ‌శాల కాదు.. ఇక్క‌డ నివ‌సించే హ‌క్కు దేశ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ఉంది : అమిత్ షా

Amit Shah | భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మశాల (Dharamshala) కాదని ఇక్కడ జీవించే హక్కు కేవలం దేశ పౌరులకు మాత్రమే ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. త్వ‌రలోనే దేశాన్ని పూర్తిగా 'చొరబాట్ల రహిత' దేశంగా మారుస్తామని చెప్పారు.

D

National | Published On Aug 26, 2026, 10.48 am IST

Amit Shah | భార‌త్ ధ‌ర్మ‌శాల కాదు.. ఇక్క‌డ నివ‌సించే హ‌క్కు దేశ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ఉంది : అమిత్ షా
Advertisement

Amit Shah | త్రినేత్ర‌.న్యూస్ : భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మశాల (Dharamshala) కాదని ఇక్కడ జీవించే హక్కు కేవలం దేశ పౌరులకు మాత్రమే ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. అక్ర‌మ చొర‌బాట్ల‌ను (illegal infiltrators) ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యానికి పటిష్ఠ అంతర్గత భద్రతే పునాది అని తెలిపారు. చొరబాట్లు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, భవిష్యత్‌ భద్రతా సవాళ్లపై ఇప్పటి నుంచే ముందస్తు వ్యూహాలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీ (New Delhi)లో జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో జాతీయ భద్రతా సదస్సు (National Security Strategy Conference) ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

ముప్పు రాకముందే చర్యలు

అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేయనంత వరకూ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించలేమని ఈ సంద‌ర్భంగా అమిత్ షా తేల్చి చెప్పారు. చొరబాట్లు, ఉగ్రవాదం, న‌క్స‌లిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అశాంతి, కొత్తగా తలెత్తుతున్న భద్రతా ముప్పులపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెప్పారు. గత ప్రభుత్వాలు నక్సలిజం, ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి వంటి స‌మ‌స్య‌లు తీవ్ర‌రూపం దాల్చ‌డానికి ముందే ఊహించి ఉంటే.. దేశం దశాబ్దాల పాటు భ‌ద్ర‌తా స‌వాళ్ల‌ను ఎదుర్కొనే ప‌రిస్థితి వ‌చ్చి ఉండేది కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం గతంలో దేశ భద్రతను కుదిపేసిన మూడు ప్రధాన హాట్‌స్పాట్‌ల సమస్యలను విజయవంతంగా ఎదుర్కొని అధిగ‌మించింద‌ని చెప్పారు. రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర దళాల స‌మ‌న్వ‌యం, కృషితోనే ఇది సాధ్య‌మైంద‌ని ప్రశంసించారు.

చొరబాట్ల రహిత దేశంగా భార‌త్‌

త్వ‌రలోనే దేశాన్ని పూర్తిగా 'చొరబాట్ల రహిత' దేశంగా మారుస్తామని షా స్ప‌ష్టం చేశారు. గత ఎనిమిది నెలల కాలంలో దేశంలోని అన్ని భూ సరిహద్దు రాష్ట్రాలను స్వయంగా సందర్శించినట్లు చెప్పారు. సరిహద్దు రక్షణ కోసం నాలుగు అంచెల విధానంతో కూడిన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. "భార‌త్ ధర్మశాల కాదు. దేశ పౌరులకు మాత్రమే ఇక్కడ నివసించే హక్కు ఉంది" అని షా స్ప‌ష్టం చేశారు. అక్రమ చొరబాట్లు జాతీయ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి, జనాభా సమతుల్యతకు పెను ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేద‌ని తేల్చి చెప్పారు. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఇప్పటి నుంచే గుర్తించాలని అమిత్‌ షా తెలిపారు. అవి పెద్ద సంక్షోభాలుగా మారకముందే తిప్పికొట్టే వ్యూహాలు ర‌చించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

డ్ర‌గ్స్ ర‌హిత భార‌త్‌..

యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై షా తీవ్రంగా స్పందించారు. మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్రాల‌న్నీ 'నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026-2029'ను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ రహిత భారత్‌ను సాకారం చేయడానికి 'త్రీ-డీ (Detect, Disrupt and Destroy)' వ్యూహాన్ని అనుస‌రించాల‌ని సూచించారు. నేరాలను ముందే అరికట్టడంలో సాంకేతిక పాత్ర కీలమని ఉద్ఘాటించారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం..

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిషేధం తర్వాత చేపట్టిన చర్యలు కేంద్ర-రాష్ట్రాల సమన్వయానికి చక్కటి ఉదాహరణ అని షా పేర్కొన్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పూర్తిగా అంతం చేయడానికి 'ప్రహార్' (PRAHAR) వ్యూహాన్ని కేవలం పత్రాలకే పరిమితం చేయకుండా, దైనందిన భద్రతా కార్య‌క‌లాపాల్లో భాగం చేయాలని పిలుపునిచ్చారు. సమగ్ర భద్రతా విధానం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరతలు, ఇంధన వనరుల అభద్రత, సప్లై చైన్ అంతరాయాలు, పెరుగుతున్న తీవ్రవాద ధోరణులు దృష్టిలో ఉంచుకునే భద్రతా విధానాలను రూపొందించాలని ఆయన సూచించారు.

Also Read..

న‌టికి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ రాహుల్ గాంధీ.. బ్రో వెయిట్ అంటూ కంగ‌న కౌంట‌ర్‌

ఇస్లాంలో ఏది అవ‌స‌ర‌మో.. ఏది కాదో నిర్ణ‌యించ‌డానికి మీరెవ‌రు?: ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ

ముందు ప‌దో త‌ర‌గ‌తి పాస‌వ్వండి.. బీహార్ సీఎం, విప‌క్ష నేత‌కు ప్ర‌శాంత్ కిషోర్ స‌వాల్‌

Advertisement
Advertisement