Tummala Nageshwar Rao | ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి
Tummala Nageshwar Rao | కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
ఆయిల్ పామ్ గెలల ధర రూ. 25000గా నిర్ణయించండి
పెద్దవాగు పునరుద్ధరణకు నిధులు విడుదల చేయండి
భద్రాచలం – ఏలూరు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించండి
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు సహకరించాలి
సదరన్ కౌన్సిల్ సమావేశం వేదికగా మంత్రి తుమ్మల విజ్ఞప్తులు
Tummala Nageshwar Rao | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణ తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనతో మిగిలిన అంశాల పరిష్కారం, అంతర్రాష్ట్ర సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.
సమావేశానికి హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలు కీలక అంశాలపై లేఖల ద్వారా విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేయడం, పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా నిధులు అందించడం, ఆయిల్‌పామ్ రైతులకు కనీస హామీ ధర కల్పించడం, భద్రాచలం–ఏలూరు అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం వంటి అంశాలపై మంత్రి వారిని కల్సి విజ్ఞప్తి చేశారు.
భద్రాచలం పరిసర ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భద్రాచలం పట్టణానికి భౌగోళికంగా, పరిపాలనాపరంగా అత్యంత సమీపంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. యాటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల పరిధిలోని 19 రెవెన్యూ గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగి విలీనం చేయాలని కోరారు. ఈ గ్రామాల మొత్తం భౌగోళిక విస్తీర్ణం 11,122.01 ఎకరాలుగా లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ గ్రామాలు తెలంగాణ భూభాగాల మధ్య, గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల మధ్య ఒక ప్రత్యేక భౌగోళిక పరిస్థితిలో ఉండటంతో ప్రజలకు పరిపాలనా సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం సుమారు 282 కిలోమీటర్ల దూరంలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల రవాణాలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల కారణంగా గిరిజన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులకు సమీపంలో, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో పోలీసు, భద్రతా వ్యవస్థల మధ్య సమన్వయానికి కూడా ప్రస్తుత భౌగోళిక పరిస్థితి సమస్యగా మారుతోందని మంత్రి తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో ఉండగా, ఆలయానికి సంబంధించిన గణనీయమైన భూములు పురుషోత్తపట్నంలో ఉండటం వల్ల ఆలయ పరిపాలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.
ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను జోక్యం చేసుకొని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడిన భౌగోళిక అసమానతను సరిదిద్దేలా ఐదు గ్రామ పంచాయతీలను, వాటి పరిధిలోని 19 రెవెన్యూ గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కోరారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా మంత్రి విజ్ఞప్తి చేశారు.
పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణకు ఏపీ వాటా నిధులు ఇవ్వాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్ద ఉన్న పెద్దవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు 2024 జూలై 18న కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో శాశ్వత పునరుద్ధరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా నిధులను వెంటనే అందించాలని మంత్రి తుమ్మల కోరారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 16,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుండగా, అందులో 13,640 ఎకరాలు ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని, ప్రాజెక్టు దెబ్బతిన్న వెంటనే తెలంగాణ ప్రభుత్వం రింగ్‌బండ్ నిర్మాణం సహా తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టి రెండు రాష్ట్రాల ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకుందని తెలిపారు. అయితే శాశ్వత పునరుద్ధరణకు రూ.92.20 కోట్లు అంచనా వేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లోనే 85.25 శాతం ఆయకట్టు ఉన్నందున, శాశ్వత పునరుద్ధరణ వ్యయాన్ని నిష్పత్తి ప్రాతిపదికన పంచుకొని అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ణయం పెండింగ్‌లో ఉందని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆయిల్‌పామ్ రైతులకు టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధర
ఆయిల్‌పామ్ సాగు రైతుల ఆదాయ భద్రత కోసం ఆయిల్ పామ్ గెలల (FFBs) టన్నుకు కనీస హామీ ధర రూ.25,000గా నిర్ణయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
ఆయిల్‌పామ్ సాగులో ప్రారంభ పెట్టుబడి అధికంగా ఉండటంతో పాటు పంటకు ఆదాయం రావడానికి ఎక్కువ కాలం పడుతుందని, అంతర్జాతీయ క్రూడ్ పామ్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రముఖ ఆయిల్‌పామ్ సాగు రాష్ట్రంగా ఉండగా, తెలంగాణలోనూ జాతీయ ఎడిబుల్ ఆయిల్స్ మిషన్–ఆయిల్‌పామ్ (NMEO-OP) కింద సాగు విస్తీర్ణం వేగంగా పెరుగుతోందని పేర్కొన్నారు.
రూ.25 వేల కనీస హామీ ధరతో పాటు సాగు వ్యయానికి అనుసంధానమైన కాలానుగుణ సవరణ విధానం అమలైతే రైతులకు స్థిరమైన, గిట్టుబాటు ఆదాయం లభించడంతో పాటు అంతర్జాతీయ ధరల ఒడిదుడుకుల నుంచి రక్షణ లభిస్తుందని, దేశంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు రైతుల్లో విశ్వాసం పెరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ఆయిల్‌పామ్ సాగు రాష్ట్రాల సమన్వయంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును కోరారు.
భద్రాచలం–ఏలూరు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలి
తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు వరకు చింతలపూడి, దమ్మపేట మీదుగా వెళ్లే రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి, మంజూరు చేసేలా కేంద్ర రహదారులు–రవాణా శాఖపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒత్తిడి తేవాలని మంత్రి తుమ్మల ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు.
సుమారు 160–165 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ అంతర్రాష్ట్ర రహదారి మార్గం ప్రధానంగా మారుమూల, గిరిజన ప్రాంతాల గుండా సాగుతుందని, మార్కెట్లు, వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలకు మెరుగైన ప్రాప్యత కల్పిస్తుందని తెలిపారు. ఈ రహదారిలో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో ఆ రాష్ట్రానికి కూడా ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
భద్రాచలం వద్ద NH-30ను, ఏలూరు వద్ద NH-16ను అనుసంధానించే కీలక మార్గంగా ఈ రహదారి ఉపయోగపడుతుందని, అశ్వారావుపేట–జీలుగుమిల్లి ప్రాంతంలోని జాతీయ రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య రవాణా, ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ రహదారి హోదా, మంజూరుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Auto Drivers Strike | కమీషన్ల దోపిడీ.. పెరిగిన ధరల భారం
- ●Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ
- ●Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్
- ●Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?
- ●Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు
- ●DK Shivakumar | 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలి : డీకే శివకుమార్

Telangana Auto Drivers Strike | కమీషన్ల దోపిడీ.. పెరిగిన ధరల భారం

Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ

Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్

Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?




