త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TCS Nashik BPO Harassment | “ఇలాంటివి మామూలే”: టీసీఎస్ నాసిక్ బీపీవోలో వేధింపులపై హెచ్‌ఆర్ నిర్లక్ష్యం.. మత మార్పిడి కుట్రలో 8 మంది అరెస్ట్

నాసిక్‌లోని టీసీఎస్ అనుబంధ బీపీవోలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత మార్పిడి యత్నాలకు సంబంధించిన వ్యవహారం సంచలనంగా మారింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలితో "ఇలాంటివి జరుగుతుంటాయి" అంటూ హెచ్‌ఆర్, ఆపరేషన్స్ హెడ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నాసిక్ పోలీసులు వెల్లడించారు.

J

National | Published On Apr 16, 2026, 9.23 pm IST

TCS Nashik BPO Harassment | “ఇలాంటివి మామూలే”: టీసీఎస్ నాసిక్ బీపీవోలో వేధింపులపై హెచ్‌ఆర్ నిర్లక్ష్యం.. మత మార్పిడి కుట్రలో 8 మంది అరెస్ట్

సంక్షిప్త సారాంశం

నాసిక్‌లోని టీసీఎస్ (TCS) అనుబంధ బీపీవో సంస్థలో మహిళా ఉద్యోగులపై వేధింపులు, మత మార్పిడి యత్నాలపై ఏకంగా 9 కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలిని నిరుత్సాహపరుస్తూ "ఇలాంటివి జరుగుతుంటాయి (these things happen)" అని హెచ్‌ఆర్, ఆపరేషన్స్ హెడ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఏడుగురు పురుషులు, ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.. టీసీఎస్ సీవోవో (COO) ఆరతి సుబ్రమణ్యన్ ఆధ్వర్యంలో అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ ముఠాకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, విదేశీ నిధుల రాకపై ఏటీఎస్ (ATS), ఎన్ఐఏ (NIA) తదితర సంస్థలు ఆరా తీస్తున్నాయి.

Advertisement

TCS Nashik BPO Harassment | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అనుబంధ బీపీవో (BPO) యూనిట్‌లో చోటుచేసుకున్న లైంగిక, మానసిక వేధింపులు, మత మార్పిడి కుట్రల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. తోటి మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు కీచకులు పాల్పడిన ఈ అకృత్యాలపై నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ సంచలన విషయాలు వెల్లడించారు.

"ఇలాంటివి జరుగుతుంటాయి.."

ఈ కేసులో ఇద్దరు మహిళా ఉద్యోగుల పాత్ర తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సంస్థలోని ఆపరేషన్స్ హెడ్, హెచ్‌ఆర్ (HR) మేనేజర్ నిదా ఖాన్.. నిందితులకు వత్తాసు పలికినట్లు పోలీసుల విచారణలో తేలింది. వేధింపులు, మత మార్పిడి యత్నాలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక బాధితురాలిని వారు నిరుత్సాహపరిచారు. ఫిర్యాదు చేయవద్దని అడ్డుకుంటూ.. "ఇలాంటివి జరుగుతుంటాయి (these things happen)" అంటూ అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు పోలీస్ కమిషనర్ వివరించారు.

పక్కా ప్లాన్‌తో వేధింపులు

సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆఫీసులో ఏడుగురు పురుష అనుమానితులు ఒక సమన్వయంతో, పక్కా ప్రణాళికతో మహిళా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేశారు. వీరంతా తమ అధికారాలను ఉపయోగించుకుని సహోద్యోగులను ఇబ్బందులకు గురిచేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 9 కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు తమపై సీనియర్లు మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా.. ఒక పురుష ఉద్యోగి తనపై మత మార్పిడి యత్నాలు, కార్యాలయంలో వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేశారు. నాసిక్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు పురుషులు, ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. మహిళా ఆపరేషన్స్ మేనేజర్‌కు ఏప్రిల్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ పరారీలో ఉంది. అరెస్టయిన పురుష నిందితుల్లో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, రజా మెమన్, షారుఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ, షారుఖ్ షేక్ ఉన్నారు.

ఉగ్రవాద కోణంపై ఎన్ఐఏ ఆరా

ఈ వ్యవహారం వెనుక ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా? విదేశీ నిధులు ఏమైనా అందుతున్నాయా? అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ (SID), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ల సహాయంతో విచారణ కొనసాగుతోందని కమిషనర్ కర్ణిక్ తెలిపారు. తగిన ఆధారాలు లభించాకే ఒక నిర్ధారణకు వస్తామన్నారు. ఈ సంఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు మహిళా డిప్యూటీ కమిషనర్, ఇతర మహిళా అధికారులతో కూడిన బృందాన్ని కార్యాలయానికి పంపారు. వారు కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించిన తర్వాత మరింత మంది బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారు.

విచారణకు ఆదేశించిన టాటా సన్స్

ఈ ఆరోపణలపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది "తీవ్ర ఆందోళన కలిగించే, కలచివేసే విషయం" అని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలను నిర్ధారించడానికి, బాధ్యులను గుర్తించడానికి టీసీఎస్ సీవోవో (TCS COO) ఆరతి సుబ్రమణ్యన్ ఆధ్వర్యంలో సమగ్ర అంతర్గత విచారణ జరుగుతోందని ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement