త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pressure Cooker | కొత్త కుక్క‌ర్‌లో అన్నం స‌రిగా ఉడ‌క‌లేదు.. స‌ద‌రు డీల‌ర్‌, స్టోర్‌కు రూ. 16,755 జ‌రిమానా

Pressure Cooker | కొత్త‌గా కొనుగోలు చేసిన ప్రెష‌ర్ కుక్క‌ర్‌( Pressure Cooker ) లో అన్నం, ప‌ప్పు స‌రిగా ఉడ‌క‌డం లేద‌ని ఓ మ‌హిళ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను వినియోగ‌దారుల క‌మిష‌న్ విచారించి స‌ద‌రు స్టోర్‌, డీల‌ర్‌తో పాటు మ్యానుఫ్యాక్చ‌ర‌ర్ కంపెనీకి రూ. 16,755 జ‌రిమానా విధించింది.

S

National | Published On Nov 13, 2026, 3.40 pm IST

Pressure Cooker | కొత్త కుక్క‌ర్‌లో అన్నం స‌రిగా ఉడ‌క‌లేదు.. స‌ద‌రు డీల‌ర్‌, స్టోర్‌కు రూ. 16,755 జ‌రిమానా
Advertisement

Pressure Cooker | త్రినేత్ర న్యూస్ : కొత్త‌గా కొనుగోలు చేసిన ప్రెష‌ర్ కుక్క‌ర్‌( Pressure Cooker ) లో అన్నం, ప‌ప్పు స‌రిగా ఉడ‌క‌డం లేద‌ని ఓ మ‌హిళ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను వినియోగ‌దారుల క‌మిష‌న్ విచారించి స‌ద‌రు స్టోర్‌, డీల‌ర్‌తో పాటు మ్యానుఫ్యాక్చ‌ర‌ర్ కంపెనీకి రూ. 16,755 జ‌రిమానా విధించింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. విశాఖ‌ప‌ట్నం జిల్లాకు చెందిన ఓ మ‌హిళ నాలుగు లీట‌ర్ల సామ‌ర్థ్యం గ‌ల డీప్ పాన్ ప్రెష‌ర్ కుక్క‌ర్‌ను రూ. 1755కు కొనుగోలు చేసింది. ఈ న‌గ‌దును యూపీఐ ద్వారా ఆమె చెల్లించింది. అయితే కొన్న మొద‌టి రోజే మూడు, నాలుగు విజిల్స్ వ‌చ్చినా అన్నం సగం మాత్ర‌మే ఉడికింది. మ‌రుస‌టి రోజు ప‌ప్పు వండినా కూడా అదే స‌మ‌స్య ఎదురైంది. దీంతో బాధిత మ‌హిళ ఆ కుక్క‌ర్‌ను తీసుకొని తాను కొనుగోలు చేసిన స్టోర్‌కు వెళ్లింది. అక్క‌డి సిబ్బంది నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇస్తూ.. కంపెనీ స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లాల‌ని ఆదేశించారు. త‌న వ‌య‌సు, శారీర‌క ఇబ్బందుల కార‌ణంగా స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని ఆమె చెప్పింది. దీంతో రిపేర్ చేసిస్తామ‌ని చెప్పి.. స‌ర్వీస్ బిల్లు జారీ చేశారు. కానీ బాధితురాలు మాత్రం త‌న‌కు కొత్త కుక్క‌ర్ ఇవ్వాల‌ని కోరింది. డీల‌ర్ ఆమె ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించాడు. చేసేదేమీ లేక బాధిత మ‌హిళ విశాఖ‌ప‌ట్నం జిల్లా వినియోగ‌దారుల క‌మిష‌న‌ర్ ఫోరానికి ఫిర్యాదు చేసింది.

విచార‌ణ అనంత‌రం.. స్టోర్, డీలర్, మ్యానుఫ్యాక్చ‌ర‌ర్‌ల‌లో ఎవరూ కూడా వారంటీ నిబంధనలను కమిషన్ ముందు సమర్పించలేదని కమిషన్ ఎత్తిచూపింది. కుక్కర్‌ను మార్చాలని తాము డీలర్‌కు సూచించినప్పటికీ, డీలర్ ఆ ఆదేశాలను పాటించలేదని కంపెనీ తర్వాత కమిషన్‌కు తెలిపింది. మొత్తానికి వినియోగ‌దారుల క‌మిష‌న్ కీల‌క తీర్పు ఇచ్చింది. కుక్క‌ర్ ధ‌ర రూ. 1755తో పాటు పిటిష‌న్ ఖ‌ర్చుల నిమిత్తం రూ. 3 వేలు, స‌ర్వీసులో లోపానికి గానూ రూ. 12 వేలు ప‌రిహారం చెల్లించాల‌ని క‌మిష‌న్ తీర్పు ఇచ్చింది. ఇక‌ కమిషన్ పనితీరుపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గానూ అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థకు అదనంగా రూ. 21,000 జరిమానా చెల్లించాలని స్టోర్ మరియు డీలర్‌ను కమిషన్ ఆదేశించింది.

Advertisement
Advertisement