త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Visa Rules | భార‌తీయ వీసాల ప్ర‌క్రియ మ‌రింత సుల‌భ‌త‌రం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు

India Visa Rules | భార‌తీయ వీసాల ప్ర‌క్రియ‌ను (India Visa Rules) మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తూ కేంద్ర హోంశాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కేటగిరీల సంఖ్యను 13 నుంచి 9కి, ఉప-కేటగిరీలను 49 నుంచి 23కి తగ్గించింది. మొత్తం 23 ఉప-కేటగిరీల వీసా దరఖాస్తు ఫారాలలో నింపాల్సిన కాలమ్‌లను దాదాపు 70% వరకు తగ్గించారు.

D

National | Published On Nov 12, 2026, 2.27 pm IST

India Visa Rules | భార‌తీయ వీసాల ప్ర‌క్రియ మ‌రింత సుల‌భ‌త‌రం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు
Advertisement

India Visa Rules | త్రినేత్ర న్యూస్ : భార‌త్‌ను సంద‌ర్శించాల‌నుకునే విదేశీ పౌరుల‌కు (foreign nationals) కేంద్రం భారీ ఊర‌ట క‌ల్పించింది. భార‌తీయ వీసాల ప్ర‌క్రియ‌ను (India Visa Rules) మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తూ కేంద్ర హోంశాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కేటగిరీల సంఖ్యను 13 నుంచి 9కి, ఉప-కేటగిరీలను 49 నుంచి 23కి తగ్గించింది. మొత్తం 23 ఉప-కేటగిరీల వీసా దరఖాస్తు ఫారాలలో నింపాల్సిన కాలమ్‌లను దాదాపు 70% వరకు తగ్గించారు. ప్రస్తుతం 172 దేశాల పౌరులకు భారత్‌ ఇ-వీసా సౌకర్యం అందుబాటులో ఉంది. ఇందులో 13 ఉప కేటగిరీల కింద దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తున్నారు. కొత్త విధానంలో వల్ల దరఖాస్తుదారులకు సమయం ఆదా అవ్వడంతో పాటు ప్రక్రియ వేగవంతం అవుతుంద‌ని హోం శాఖ భావిస్తోంది.

కొత్త విధానంలో వ్యాపార, దౌత్య, వ‌ర్క్‌, జర్నలిస్ట్, వైద్య, అధికారిక, విద్యార్థి, విజిట‌ర్‌, ఇతర అనే తొమ్మిది ప్రధాన వీసా కేటగిరీలు ఉంటాయి. టూరిస్ట్ వీసా పేరును విజిటర్ వీసాగా మార్చారు. పర్యాటకంతో పాటు మరికొన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక సందర్శన అవసరాలను ఈ కేట‌గిరీ కింద‌కు చేర్చారు. దీన్ని V-1, V-2 అనే రెండు ఉప కేటగిరీలుగా విభజించారు. సాధారణ పర్యాటకంతో పాటు స్వల్పకాలిక వ్యాపార సమావేశాలు, వైద్య సంప్ర‌దింపులు, వెల్‌నెస్ రిట్రీట్‌లు, భారతీయ కళలు లేదా భాషా కోర్సుల కోసం V-1 వీసా వినియోగించవచ్చు. ఈ వీసాను 30 రోజుల స్వ‌ల్ప కాలానికి మంజూరు చేస్తారు.

ఇక దీర్ఘ‌కాలిక ప్ర‌యాణం కోసం V-2 వీసాను ఇస్తారు. అవసరాన్ని బట్టి ఒకటి, ఐదు లేదా పదేళ్ల కాలపరిమితితో ఈ వీసా జారీ చేస్తారు. V-1 కింద అనుమతించిన కార్యకలాపాలతో పాటు పర్వతారోహణకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. పర్వతారోహణ కోసం ఆరు నెలల కాలపరిమితితో బహుళ ప్రవేశాల వీసా మంజూరు చేస్తారు.

'హీల్ ఇన్ ఇండియా' (Heal in India) కార్యక్రమంలో భాగంగా సాధారణ వైద్య చికిత్స కోసం M-1, ఆయుష్ (AYUSH) చికిత్సల కోసం M-3 వీసాలను ఒక సంవత్సరం మల్టిపుల్ ఎంట్రీ సదుపాయంతో అందిస్తారు. దీనివల్ల తదుపరి పరీక్షలు (follow-ups) లేదా దశలవారీ చికిత్సల కోసం రోగులు మళ్లీ మళ్లీ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక M-1, M-3 వీసాలు పొందిన వారి వెంట వచ్చే సహాయకుల కోసం M-2, M-4 వీసాలు అందుబాటులో ఉంటాయి.

వ్యాపార వీసాను కూడా B-1, B-2 అనే రెండు భాగాలుగా విభ‌జించారు. B-1 వీసా దీర్ఘకాలిక, లైసెన్స్‌ ఆధారిత వ్యాపార కార్యకలాపాల కోసం ఉద్దేశించారు. కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో స్వల్పకాలిక వ్యాపారాలు నిర్వ‌హించే వారికి B-2 వీసాలు జారీ చేస్తారు. ఇందులో ప్రొడక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, క్రీడలు, కళలు (Performative Arts), ఫిల్మ్ షూటింగ్‌ల వంటివి ఉంటాయి.

విదేశీ విద్యార్థుల కోసం విద్యార్థి వీసా (Student Visa) విభాగాన్ని ప్రధానంగా S-1, S-2 అనే రెండు ఉప విభాగాలుగా ఏకీకృతం చేశారు. పాఠశాల, డిగ్రీ, పీజీ విద్య కోసం S-1 వీసాలు ఇస్తారు. భారతీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ (PhD) చేసే స్కాలర్లు, పరిశోధన విద్యార్థులు, విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇంటర్న్‌షిప్ (Internships), స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ (Exchange programmes) కార్యక్రమాల కోసం వచ్చే వారికి S-2 వీసా అవ‌కాశం క‌ల్పించారు. స్టడీ ఇన్ ఇండియా (Study in India) పోర్టల్ ద్వారా ప్రవేశం పొందిన వారికి కోర్సు కాలపరిమితి లేదా గరిష్టంగా 5 సంవత్సరాల వరకు మల్టిపుల్ ఎంట్రీ (Multiple-entry) సౌకర్యంతో కూడిన e-S1 వీసా లభిస్తుంది.

Also Read..

విదేశీ విడాకులు భార‌త్‌లో చెల్ల‌వు.. ఎన్నారైల‌కు సుప్రీం బిగ్ షాక్‌

2027 ఎన్నిక‌ల్లో బీజేపీకి శాశ్వ‌త ఓట‌మి త‌ప్ప‌దు : అఖిలేష్ యాద‌వ్‌

బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంగేజ్‌మెంట్ - ప్రియురాలికి ప్ర‌పోజ్ చేసిన శివ‌కుమార్‌

Advertisement
Advertisement