త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railways | రైళ్ల‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి

Indian Railways | రైళ్ల‌లో రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను కచ్చితంగా నిలిపివేయాలని (switch off the charging points In Train) రైల్వే బోర్డు (Railway Board) అన్ని జోన్ల‌కు క‌ఠిన ఆదేశాలు జారీ చేసింది.

D

National | Published On Oct 28, 2026, 11.59 am IST

Indian Railways | రైళ్ల‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి
Advertisement

Indian Railways | త్రినేత్ర న్యూస్ : రైళ్ల‌లో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌..! రైలు ప్రయాణంలో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకునే విషయంలో భారతీయ రైల్వే కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రి స‌మ‌యంలో ఛార్జింగ్ పాయింట్ల‌ను క‌చ్చితంగా నిలిపివేయాల‌ని రైల్వే బోర్డు అన్ని జోన్ల‌కు క‌ఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవ‌లే ముంబై ట్రైన్‌లో ప‌వ‌ర్ బ్యాంక్ పేలి (Power Bank Explosion) పొగ వ్యాపించ‌డంతో తీవ్ర గంద‌ర‌గోళం త‌లెత్తిన‌ విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే రైల్వే బోర్డు భద్రతా చర్యల‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అన్ని జోన్లను ఆదేశించింది.

ఈ మేర‌కు అన్ని జోన్ల‌కు రైల్వే బోర్డు అక్టోబ‌ర్ 26న లేఖ పంపింది. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను కచ్చితంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిబంధ‌న‌లో ఎలాంటి మిన‌హాయింపులు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు రైళ్ల‌లోని అన్ని కోచ్‌ల‌లో నిర్ణీత స‌మ‌యంలో ఛార్జింగ్ పాయింట్ల‌ను ఆఫ్ చేసేలా సిబ్బందికి త‌గిన సూచ‌న‌లు, శిక్ష‌ణ ఇవ్వాల‌ని జోన‌ల్ అధికారుల‌ను ఆదేశించింది. అంతేకాదు, ఛార్జింగ్ పాయింట్లు నిర్ణీత స‌మ‌యంలో ఆఫ్ అవుతున్నాయో లేదో ప‌రిశీలించేందుకు అధికారులు, సూప‌ర్‌వైజ‌ర్లు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని పేర్కొంది. భ‌ద్ర‌త విష‌యంలో అధికారులు అల‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించింది.

కొత్తేమీ కాదు..

రైల్వే ఛార్జింగ్ నిబంధ‌న‌లు కొత్తేమీ కాదు. ఇవి 2014 నుంచే అమ‌ల్లో ఉన్నాయి. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సిఫారసు మేరకు.. బెంగళూరు - హజూర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. ఆ త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల్లో రైళ్ల‌లో అగ్నిప్ర‌మాదాలు జ‌రిగాయి. ఆయా ప్ర‌మాదాల‌కు షార్ట్ స‌ర్క్యూటే కార‌ణ‌మ‌ని ద‌ర్యాప్తులో తేలింది. దీంతో 2021లో కూడా మ‌రోసారి ఈ రూల్స్‌ను క‌ఠిన‌త‌రం చేయాల‌ని రైల్వే శాఖ అన్ని జోన్ల‌కు గ‌ట్టి ఆదేశాలు పంపింది.

ఏసీ కోచ్‌లో పేలిన ప‌వ‌ర్ బ్యాంక్‌

తాజాగా ముంబై-హౌరా రైల్లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు రాత్రిపూట పవర్ బ్యాంక్‌ను ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోయాడు. అది ఓవర్‌హీట్ అయి అర్ధరాత్రి దాటిన తర్వాత పేల‌డంతో ఏసీ బోగీలో నుంచి దట్టమైన పొగ వ్యాపించింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో పాత నిబంధ‌న‌ల‌ను మ‌ళ్లీ క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించింది.

ప్ర‌యాణికుల‌కు కీల‌క సూచ‌న‌లు..

ఈ సంద‌ర్భంగా రైల్వే బోర్డు ప్ర‌యాణికుల‌కు కీల‌క సూచ‌నలు కూడా చేసింది. వ‌రుస ప్ర‌మాదాల నేప‌థ్యంలో ప్ర‌యాణికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, రైల్వే నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌ని సూచించింది. రాత్రి ప్ర‌యాణానికి ముందే త‌మ ఫోన్లు, ఇత‌ర ముఖ్య‌మైన ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను ఛార్జ్ చేసుకోవాల‌ని పేర్కొంది. అదేవిధంగా న‌కిలీ, త‌క్కువ నాణ్య‌త గ‌ల ఛార్జ‌ర్లు, దెబ్బతిన్న కేబుళ్లను రైళ్ల‌లో ఉప‌యోగించొద్ద‌ని కోరింది. అంతేకాదు, అనుమ‌తించిన స‌మ‌యాల్లో కూడా ఛార్జింగ్ పెట్టిన‌ప్పుడు ఫోన్ కానీ, ల్యాప్‌టాప్ కానీ, ప‌వ‌ర్ బ్యాంక్‌లు గానీ హీటెక్కి పొగ‌, కాలిన వాస‌న వ‌చ్చినా వెంట‌నే ఛార్జింగ్ తీసేయాల‌ని సూచించింది. ఈ విష‌యంపై రైల్వే సిబ్బందికి సమాచారం అందించాలని విజ్ఞ‌ప్తి చేసింది.

Also Read..

అర్న‌బ్ బీభ‌త్సం.. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలం

రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి పొంగులేటి

హెచ్‌యూఎల్‌ షేర్‌హోల్డర్లకు రూ.19 డివిడెండ్‌.. రికార్డు తేదీ ఇదే..

Advertisement
Advertisement