త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyclone Arnab | అర్నాబ్‌ తుపాను ఎఫెక్ట్‌.. రైళ్ల‌ను ర‌ద్దు చేసిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

Cyclone Arnab | అర్నాబ్‌ తుపాను ప్రభావంతో రైలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్ల రాకపోకల్లో మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 27న బయలుదేరాల్సిన 10 రైళ్లు, అక్టోబర్‌ 28న బయలుదేరాల్సిన మరో రైలును రద్దు చేసింది.

P

Telangana | Published On Oct 27, 2026, 4.51 pm IST

Cyclone Arnab | అర్నాబ్‌ తుపాను ఎఫెక్ట్‌.. రైళ్ల‌ను ర‌ద్దు చేసిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..
Advertisement

Cyclone Arnab | అర్నాబ్‌ తుపాను ప్రభావంతో రైలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్ల రాకపోకల్లో మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 27న బయలుదేరాల్సిన 10 రైళ్లు, అక్టోబర్‌ 28న బయలుదేరాల్సిన మరో రైలును రద్దు చేసింది. నాగర్‌సోల్‌ నుంచి నర్సాపూర్ వెళ్లే 12788 నంబర్‌ రైలును పాక్షికంగా రద్దు చేసింది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. అక్టోబర్‌ 28న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వరంగల్‌, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ అక్టోబర్‌ 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అర్నబ్‌ తుపాను అక్టోబర్‌ 28 ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని దాటే అవకాశం ఉండటంతో ఆయా మార్గాల్లో రైళ్ల రద్దు, దారి మళ్లింపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.

భద్రతా ఏర్పాట్లపై జీఎం సమీక్ష

తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ, సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డాక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణన్‌, ఇతర అధికారులతో భద్రతా చర్యలు, ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాలు, వంతెనల వద్ద గస్తీ ఏర్పాట్లు, పెట్రోల్‌మెన్‌, వాచ్‌మెన్‌ల నియామకం, చెరువుల నీటిమట్టాల పరిస్థితిని పరిశీలించారు. కాజీపేట, డోర్నకల్‌ ప్రాంతాల్లో బండరాళ్లు, ఇసుక సంచులు, కంకర రేక్‌లతోపాటు ప్రమాద సహాయక రైళ్లు (ఏఆర్‌టీ), ప్రమాద సహాయక వైద్య పరికరాలు (ఏఆర్‌ఎంఈ) సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, ఆస్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆపరేటింగ్‌, ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కమర్షియల్‌, వైద్య విభాగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జనరల్‌ మేనేజర్‌ ఆదేశించారు. రైళ్ల రాకపోకలు, వంతెనల పరిస్థితి, ప్రమాదకర ప్రాంతాల్లో నీటిమట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

రద్దయిన రైళ్లివే..

అక్టోబర్‌ 27న సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్లే 12704 నంబర్‌ రైలు, సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ న్యూ వెళ్లే 17016 నంబర్‌ రైలు, హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే 12728 నంబర్‌ రైలు రద్దయ్యాయి. అలాగే మహబూబ్‌నగర్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే 12862, సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే 12740 నంబర్‌ రైళ్లు కూడా రద్దు చేశారు. లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్‌ వెళ్లే 12776, లింగంపల్లి నుంచి నరసాపురం వెళ్లే 17256, లింగంపల్లి నుంచి కాకినాడ పోర్ట్‌ వెళ్లే 12738 నంబర్‌ రైళ్లు రద్దయ్యాయి. హజ్రత్‌ నిజాముద్దీన్‌ (హెచ్‌.ఎస్‌. నాందేడ్‌) నుంచి సంబల్‌పూర్‌ వెళ్లే 20810 నంబర్‌ రైలు, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌ వెళ్లే 07037 నంబర్‌ రైలు కూడా మంగ‌ళ‌వారం న‌డువ‌ద‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పేర్కొంది. అక్టోబర్‌ 28న శ్రీకాకుళం రోడ్‌ నుంచి చర్లపల్లి వెళ్లాల్సిన 07038 నంబర్‌ రైలును రద్దు చేశారు. ఇక అక్టోబర్‌ 27న నాగర్‌సోల్‌ నుంచి నరసాపురం వెళ్లే 12788 నంబర్‌ రైలు చర్లపల్లి–నర్సాపూర్ మధ్య పాక్షికంగా ర‌ద్దు చేసింది.

ప్ర‌యాణానికి ముందే ప్ర‌ణాళిక అవ‌స‌ర‌మ‌ని..

తుపాను, భారీ వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, పునఃప్రణాళికకు సంబంధించిన వివరాలను రిజర్వేషన్‌ సమయంలో నమోదు చేసిన మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపించనున్నారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఐఆర్‌సీటీసీ, రైల్‌ వన్‌, ఎన్‌టీఈఎస్‌ అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లలో రైలు ప్రస్తుత స్టేట‌స్‌ని చెక్ చేసుకోవాల‌ని.. అవసరమైతే 139 నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు. రైళ్ల మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాతోపాటు దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ ([https://scr.indianrailways.gov.in/index.jsp?lang=0]()), ఎక్స్‌ (@SCRailwayIndia), ఫేస్‌బుక్‌ (South Central Railway-SCR), ఇన్‌స్టాగ్రామ్‌ (@scrailwayindia) ఖాతాల్లోనూ అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు ఎస్‌సీఆర్ సూచించింది. ప్రయాణికులు మరిన్ని వివరాల కోసం సమీప రైల్వే స్టేషన్‌ అధికారులను సంప్రదించాలని కోరింది.

Advertisement
Advertisement