త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress TVK Alliance | తమిళనాడులో రసవత్తర రాజకీయం: కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే చీఫ్ దళపతి విజయ్

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్ కీలక అడుగు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆయన.. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతును అధికారికంగా కోరారు. బీజేపీకి రాష్ట్రంలో ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న కాంగ్రెస్.. బుధవారం చెన్నైలో సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

J

National | Published On May 5, 2026, 11.10 pm IST

Congress TVK Alliance | తమిళనాడులో రసవత్తర రాజకీయం: కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే చీఫ్ దళపతి విజయ్
Advertisement

Congress TVK Alliance | త్రినేత్ర.న్యూస్ : దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి చెక్ పెడుతూ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) సంచలన విజయం నమోదు చేసిన టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీ అధినేత దళపతి విజయ్ సీఎం పీఠం దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గానూ ఆయన జాతీయ పార్టీ కాంగ్రెస్ మద్దతును కోరారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా వెల్లడించారు.

మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118 కాగా.. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీ లేకపోవడంతో రాష్ట్రంలో చర్చల పర్వం మొదలైంది.

కాంగ్రెస్ మద్దతు పక్కానేనా?

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బుధవారం ఉదయం చెన్నైలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రజల తీర్పు స్పష్టంగా "లౌకిక ప్రభుత్వం" వైపే ఉందని, అందువల్ల రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటాన్ని తాము ఏమాత్రం కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై రాష్ట్ర నాయకత్వానికే కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరికొన్ని చిన్న పార్టీలు కూడా కొత్త ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెరుంతలైవర్ కామరాజ్ స్ఫూర్తితో

తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గిరీష్ చోడంకర్ సైతం విజయ్ తమ మద్దతు కోరుతూ లేఖ రాసిన విషయాన్ని ధృవీకరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన అంతగా బాగోలేదని, రాష్ట్రంలో పూర్తిగా విజయ్ అనుకూల పవనాలు వీచాయని ఆయన అంగీకరించారు. యువత, మహిళలు భారీగా విజయ్‌కి ఓట్లు వేశారని, లౌకిక ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టారని చోడంకర్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని రక్షించే లౌకిక ప్రభుత్వానికే కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీజేపీ లేదా వారి అనుకూల శక్తులకు తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని పార్టీ వర్గాలు కుండబద్దలు కొట్టాయి. అలాగే, కాంగ్రెస్ దిగ్గజ నేత పెరుంతలైవర్ కామరాజ్ స్ఫూర్తితో తాను ముందుకు సాగుతున్నానని విజయ్ స్వయంగా చెప్పడం విశేషం.

విమర్శలను దాటుకుని.. ఒంటరిగా నిలబడి: విజయ్ భావోద్వేగం

ఎన్నికల ఫలితాల అనంతరం దళపతి విజయ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తొలిసారి స్పందించారు. అడుగడుగునా ఎదురైన అవరోధాలను అధిగమించి, తమ పార్టీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

"మేము పార్టీ పెట్టినప్పుడు ఎంతో మంది విమర్శించారు. తటస్థుల ముసుగులో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. కానీ వాటన్నింటినీ దాటుకుని, కేవలం ప్రజలనే నమ్ముకుని ఒంటరిగా నిలబడ్డాం. ఎవరి రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చామో.. ఆ మా ప్రజలు, మా తమిళనాడు ఒక తల్లిలా మమ్మల్ని ఆదరించారు. ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు" అని విజయ్ తమిళంలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

ఈ అద్భుతమైన విజయం కేవలం టీవీకే పార్టీది మాత్రమే కాదని, ఇది ప్రజాస్వామ్య విజయమని విజయ్ అభివర్ణించారు. ఎవరూ ఊహించని రాజకీయ విజయాన్ని అందించిన తమిళనాడు ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటానని, అడ్మినిస్ట్రేటర్లు, వర్చువల్ వారియర్స్ సహా పార్టీ శ్రేణులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
Advertisement