త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Swati Maliwal | మోదీ లీడ‌ర్‌షిప్‌ను న‌మ్మి బీజేపీలో చేరా.. రాజ్య‌స‌భ స‌భ్యురాలు స్వాతి మ‌లివాల్‌

రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌పై దాడి చేయించార‌ని, బెదిరింపుల‌కు గురి చేశార‌ని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీ వైఖరే తన పార్టీ మార్పు నిర్ణయానికి కారణమని స్ప‌ష్టం చేశారు.

P

National | Published On Apr 25, 2026, 4.05 pm IST

Swati Maliwal | మోదీ లీడ‌ర్‌షిప్‌ను న‌మ్మి బీజేపీలో చేరా.. రాజ్య‌స‌భ స‌భ్యురాలు స్వాతి మ‌లివాల్‌
Advertisement

Swati Maliwal | రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీపై, ఆ పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె శ‌నివారం ఓ జాతీయ మీడియా చానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన‌ట్లు పేర్కొంది. నిర్మాణాత్మక రాజకీయాల్లో ఆసక్తి ఉన్నవారు బీజేపీలో చేరాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ '2006 నుంచే కేజ్రీవాల్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఆయన ప్రతి ఉద్యమానికి మద్దతుగా నిలిచాను. త‌న‌పై ఆయ‌న ఇంట్లోనే కొంతమంది గూండాలతో దాడి చేయించారు. దానిపై మాట్లాడినందుకు బెదిరింపులు వ‌చ్చాయి. ఎఫ్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. రెండేళ్ల పాటు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వ‌లేదు. ఇది చాలా అవమానకరం. కేజ్రీవాల్ మహిళా వ్యతిరేకి' అని స్వాతిమ‌లివాల్ ఆరోపించారు.

పంజాబ్ పాలనపై కూడా మాలివాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడి ప్రభుత్వాన్ని రిమోట్‌గా నడుపుతోందని, రాష్ట్రాన్ని వ్యక్తిగత ఏటీఎంలా వాడుకుంటోందని ఆరోపించారు. ఇసుక దందా, డ్రగ్స్ సమస్యలు పెరిగాయని, ప్రశ్నించిన నేత‌ల‌పై కేసులు నమోదు చేస్తున్నారని విమ‌ర్శించారు. కేజ్రీవాల్ అవినీతి, గూండాగిరి రాజకీయాలకు పేరుపొందార‌న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ అభివృద్ధికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి నిర్ణయాలను ప్రశంసించారు.

ఇంకా మాట్లాడుతూ.. 'నన్నెవరూ భయపెట్టలేరు. దేశంలోని ఏ ఏజెన్సీ కూడా నన్ను బెదిరించలేదు' అని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రజలు మహిళలకు అవమానాన్ని సహించరని అన్నారు. పార్టీ ప్రస్తుత పరిస్థితికి బయటివారు కారణం కాదని, కేజ్రీవాల్‌తో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ గత జీవనశైలిని గుర్తుచేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఖర్చులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాలివాల్ విమర్శించారు. పంజాబ్‌ను కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. తాను బీజేపీలో చేరే నిర్ణయం చాలా ఆలోచించి తీసుకున్నానని మాలివాల్ తెలిపారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీ వైఖరి తనకు న‌చ్చ‌లేద‌ని, మహిళల హక్కుల కోసం పోరాడిన తనకు ఆ పార్టీ విధానం ఆమోద‌యోగ్యంగా లేద‌న్నారు.

Advertisement
Advertisement