త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఉల్లి, వెల్లుల్లిలో తామ‌సిక గుణాలున్నాయా? విచిత్ర పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం..!

Supreme Court | సుప్రీంకోర్టులో ప‌లు విచిత్ర‌మైన పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఉల్లిపాయ‌లు, వెల్లుల్లిలో నిజంగానే తామ‌సిక శ‌క్తి ఉందా? అనే అంశంతో పాటు మ‌రో నాలుగు అంశాల‌పై పిల్ దాఖ‌లు చేశారు. అయితే, వాటిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

P

National | Published On Mar 9, 2026, 3.40 pm IST

Supreme Court | ఉల్లి, వెల్లుల్లిలో తామ‌సిక గుణాలున్నాయా? విచిత్ర పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం..!
Advertisement

Supreme Court | సుప్రీంకోర్టులో ప‌లు విచిత్ర‌మైన పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఉల్లిపాయ‌లు, వెల్లుల్లిలో నిజంగానే తామ‌సిక గుణాలున్నాయా? అనే అంశంతో పాటు మ‌రో నాలుగు అంశాల‌పై పిల్ దాఖ‌లు చేశారు. అయితే, వాటిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అర్థం లేని పిటిష‌న్లు దాఖ‌లు చేయొద్దంటూ న్యాయ‌వాదికి మొట్టికాయ‌లు వేసింది. న్యాయ‌వాది దాఖ‌లు చేసిన ఐదు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాల‌ను సోమ‌వారం కోర్టు కొట్టివేసింది.

సీజేఐ జ‌స్టిస్ సూర్యకాంత్, జ‌స్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ధ‌ర్మాస‌నం ఆయా పిటిష‌న్ల‌ను విచారించింది. విచారణ సందర్భంగా న్యాయవాది సచిన్ గుప్తాపై సీజేఐ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ఈ పిటిషన్‌లన్నీ మీరు అర్ధరాత్రి తయారు చేస్తారా?” అని ప్రశ్నించారు. పిటిషన్ల‌పై స్పష్టత లేద‌ని, ఎలాంటి ఆధారాలు లేవ‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఉల్లిపాయలు, వెల్లుల్లి గురించి దాఖ‌లు చేసిన పిల్‌లో జైనా మ‌తానికి చెందిన వారంతా వీటిని తామ‌సిక ఆహారంగా భావిస్తార‌ని, వాటిని తిన‌ర‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ జైనా స‌మాజం మ‌నోభావాల‌ను ఎందుకు దెబ్బ‌తీయాల‌ని చూస్తున్నారంటూ ప్ర‌శ్నించారు.

దీనికి న్యాయ‌వాది స్పందిస్తూ ఇది స‌మాజంలో ఉన్న స‌మ‌స్యేన‌ని తెలిపారు. గుజరాత్‌లో ఆహారంలో ఉల్లిపాయలు వాడినందుకు ఓ వ్య‌క్తికి విడాకులు ఇచ్చిన ఘ‌ట‌న కూడా జ‌రిగింద‌ని తెలిపారు. న్యాయ‌వాదిపై సీజేఐ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇలాంటి అర్థం లేని పిటిష‌న్లు మ‌ళ్లీ తీసుకువ‌స్తే ఏం చేస్తామో చూస్తారంటూ తీవ్రంగా హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా స‌చిన్ గుప్తా దాఖ‌లు చేసిన మ‌రో నాలుగు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాల‌ను కోర్టు కొట్టివేసింది. మద్యం, పొగాకు ఉత్పత్తుల్లో హానికర పదార్థాల నియంత్రణ, ఆస్తుల తప్పనిసరి నమోదు, శాస్త్రీయ భాషల ప్రకటనకు మార్గదర్శకాలు వంటి డిమాండ్ల పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. వాటిలో పేర్కొన్న అంశాలు స‌రిగా లేవ‌ని, చ‌ట్ట‌ప‌రంగా ఆధారాలు లేవ‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. పిటిష‌న్లు దాఖ‌లు చేసింది న్యాయ‌వాది కాక‌పోయి ఉంటే భారీ జ‌రిమానా విధించేవార‌మ‌ని సీజేఐ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement