త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | టికెట్ లేద‌ని ప‌రిహారం నిరాక‌రించ‌డం కుద‌ర‌దు : సుప్రీంకోర్టు

Supreme Court | రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్ర‌యాణికుడి వ‌ద్ద రైలు టికెట్ దొర‌క‌లేద‌నే ఒక్క కార‌ణంతో బాధితుడి కుటుంబానికి ప‌రిహారం నిరాక‌రించ‌డం కుద‌ర‌ద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో గ‌తంలో రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యున‌ల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల‌ను కొట్టివేసింది. 2015లో రైలు నుంచి జారిప‌డి చ‌నిపోయిన ప్రయాణికుడి భార్య‌కు రూ.8ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది.

P

National | Published On Jul 17, 2026, 6.51 pm IST

Supreme Court | టికెట్ లేద‌ని ప‌రిహారం నిరాక‌రించ‌డం కుద‌ర‌దు : సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్ర‌యాణికుడి వ‌ద్ద రైలు టికెట్ దొర‌క‌లేద‌నే ఒక్క కార‌ణంతో బాధితుడి కుటుంబానికి ప‌రిహారం నిరాక‌రించ‌డం కుద‌ర‌ద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో గ‌తంలో రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యున‌ల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల‌ను కొట్టివేసింది. 2015లో రైలు నుంచి జారిప‌డి చ‌నిపోయిన ప్రయాణికుడి భార్య‌కు రూ.8ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసులో ప్రమాదం త‌ర్వాత మృతుడి వద్ద రైలు టికెట్ క‌నిపించ‌క‌పోవ‌డంతో అత‌న్ని ప్ర‌యాణికుడిగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని ఆర్‌సీటీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు ప‌రిహారం ఇచ్చేందుకు నిరాక‌రించాయి.

త‌ప్పుప‌ట్టిన సుప్రీం..

ఈ నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. రైల్వే చట్టం సంక్షేమ ల‌క్ష్యంతోనే రూపొందించార‌ని, దాన్ని సంకుచితంగా కాకుండా విశాల దృక్పథంతో వ్యాఖ్యానించాలని స్పష్టం చేసింది. రైల్వే చట్టంలోని సెక్షన్ 124ఏ ‘నో-ఫాల్ట్ లయబిలిటీ’ సూత్రంపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం వివరించింది. బాధితులకు నిర్లక్ష్యాన్ని నిరూపించాల్సిన అవసరం లేకుండానే త్వరితగతిన పరిహారం అందించడమే ఈ నిబంధన ఉద్దేశమని తెలిపింది. టికెట్ లేకపోవడం ప్రయాణికుడి హోదాను రద్దు చేయదని పేర్కొంది. బాధితుల తరఫున మొద‌ట అఫిడవిట్ ద్వారా తమ వాదనను సమర్పించవచ్చని, ఆ వాదనను తప్పుబట్టే బాధ్యత అనంతరం రైల్వే శాఖపైనే ఉంటుందని స్పష్టం చేసింది.

కేసు వివ‌రాలు ఇవీ..

కేసు వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఘ‌ట‌న 2015 నవంబర్‌లో జరిగింది. రాయ్‌పూర్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న చంద్రకాంత్ ఠక్కర్ అహ్మదాబాద్–హౌరా మెయిల్ రైలులో ప్ర‌యాణిస్తున్నారు. అయితే, జారి కిందప‌డిపోవ‌డంతో మృతి చెందాడు. ప్రమాదం అనంతరం టికెట్ ఉన్న బ్యాగు కనిపించకుండా పోయింది. అడ్వకేట్ శ్వేతా ప్రియదర్శిని ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నాలుగు వారాల్లోగా లతకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్ణీత గడువులో చెల్లించకపోతే పిటిషన్ దాఖలైన తేదీ నుంచి 8 శాతం వార్షిక వడ్డీతో సహా చెల్లించాలని స్పష్టం చేసింది.

రైల్వే భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న‌

రైల్వే భద్రత అంశంపై కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రైళ్లలో రద్దీ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. భద్రత, ర‌ద్దీ నియంత్రణకు సంబంధించి నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలులో సవాళ్లు ఉన్నాయని వ్యాఖ్యానించింది. రైల్వేల్లో సిబ్బంది సంఖ్యను పెంచితే భద్రత మెరుగుపడడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపింది. అయితే, ప్రమాదాలకు రైల్వేశాఖదే పూర్తిగా బాధ్య‌త‌న‌డం స‌రైంది కాద‌ని అభిప్రాయపడింది. ప్రయాణికులు సైతం తమ భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. కదులుతున్న రైలును ఎక్కేందుకు, దిగేందుకు చేసే ప్రయత్నాలు ప్రాణాలకు ముప్పును తీసుకువ‌స్తాయ‌ని.. ఆచరణాత్మక అంశాల కంటే ప్రాణ రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ పదంపై అభ్యంతరం

రైల్వే మాన్యువల్‌లో ఉపయోగిస్తున్న ‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ అనే పదంపైనా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదం వర్గ వివక్షను సూచించేలా ఉందని అభిప్రాయపడింది. అందువల్ల ప్రయాణికుడిని కాకుండా కోచ్‌ను సూచించే విధంగా ‘సెకండ్ క్లాస్ కోచ్’ అనే పదాన్ని ఉపయోగించాలని సూచించింది. ఇది రాజ్యాంగంలోని సమానత్వం, గౌరవం వంటి విలువలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది.

Advertisement
Advertisement