త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smart Border Project | అభేద్యంగా సరిహద్దులు.. బార్డర్‌ దాటాలంటే శ‌త్రువుల‌కు తడిసిపోవాల్సిందే

Smart Border Project | పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లతో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును ఇకపై అభేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక స్మార్ట్‌ ఫెన్సింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నది. వచ్చే ఏడాదిలోగా ఈ సమగ్ర భద్రతా గ్రిడ్‌ ప్రణాళికను దశలవారీగా అమలు చేయనున్నారు. సరిహద్దు భద్రతా దళం (BSF)కు 24 గంటలూ నిఘా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ అధునాతన పరికరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నారు.

P

National | Published On May 31, 2026, 3.45 pm IST

Smart Border Project | అభేద్యంగా సరిహద్దులు.. బార్డర్‌ దాటాలంటే శ‌త్రువుల‌కు తడిసిపోవాల్సిందే
Advertisement
  • పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత
  • స్మార్ట్‌ ప్రాజెక్ట్‌ అమలు చేస్తున్న కేంద్రం
  • కీలక పాత్ర పోషించనున్న పది వ్యవస్థలు

Smart Border Project | పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లతో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును ఇకపై అభేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక స్మార్ట్‌ ఫెన్సింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నది. వచ్చే ఏడాదిలోగా ఈ సమగ్ర భద్రతా గ్రిడ్‌ ప్రణాళికను దశలవారీగా అమలు చేయనున్నారు. సరిహద్దు భద్రతా దళం (BSF)కు 24 గంటలూ నిఘా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ అధునాతన పరికరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా యాంటీ-డ్రోన్ పట్రోల్ వాహనాలు, ఆధునిక రాడార్లు, లాంగ్ రేంజ్ రీకానైసెన్స్ అండ్ ఆబ్జర్వేషన్ సిస్టమ్ (LOROS), ఫార్వర్డ్ లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు, థర్మల్ కెమెరాలు, సమగ్ర సమగ్రిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ (CIBMS), కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోలు, డ్రోన్ కమాండోలు వంటి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సరిహద్దులోని సున్నిత ప్రాంతాల్లో నిరంతర నిఘా మరింత సులభం కానుంది.

ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్ సిస్టమ్

ఈ వ్యవస్థను సరిహద్దులోని ‘కళ్ళు’గా చెప్పొచ్చు. అధిక పవర్‌ కలిగిన కెమెరాలు, లెన్స్‌లు, సెన్సార్లు కలిసి పని చేస్తాయి. పగలు స్పష్టమైన దృశ్యాలు అందిస్తే.. రాత్రివేళల్లో ఇన్‌ఫ్రారెడ్ సాంకేతికత ద్వారా వేడి ఆధారంగా మనుషులు, వాహనాలను గుర్తించగల సామర్థ్యం ఉంటుంది. దూరంగా కదులుతున్న చిన్న కదలికను కూడా పసిగట్టే సత్తా దీని సొంతం.

మల్టీ-సెన్సర్ ఫార్వర్డ్ లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ (FLIR) టెక్నాలజీ

ఇది ఒకే సమయంలో అనేక రకాల సెన్సార్లను కలిపి పని చేస్తుంది. థర్మల్ కెమెరాలు శరీర ఉష్ణోగ్రత ఆధారంగా మనుషులను గుర్తిస్తే, షార్ట్-వేవ్ ఇన్‌ఫ్రారెడ్ మబ్బులు, పొగమంచు, చీకటి వంటి పరిస్థితుల్లో కూడా స్పష్టత ఇస్తుంది. అంటే వాతావరణం ఎలా ఉన్నా నిఘా మాత్రం పక్కాగా ఉంటుంది.

సమగ్ర సరిహద్దు నిర్వహణ వ్యవస్థ

ఇది మొత్తం వ్యవస్థకు ‘మెదడు’ లాంటిది. సరిహద్దులో ఉన్న సెన్సార్లు, కెమెరాలు, రాడార్ల నుంచి వచ్చే సమాచారం అంతా ఒకే కంట్రోల్ రూమ్‌కి చేరుతుంది. అక్కడ ఏఐ బేస్డ్‌ సాఫ్ట్‌వేర్ ఆ డేటాను విశ్లేషించి అనుమానాస్పద కదలికలను వెంటనే గుర్తిస్తుంది. దీంతో జవాన్లు వెంటనే స్పందించగలుగుతారు. ఈ వ్యవస్థ జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని పాత కంచెలను కూడా ఈ సాంకేతికతకు అనుగుణంగా మార్చనున్నారు.

లేజర్ రేంజ్‌ఫైండర్

దూరాన్ని అత్యంత ఖచ్చితంగా కొలిచే ఈ పరికరంలో బిల్ట్ కంపాస్, జీపీఎస్ సౌకర్యం ఉంటుంది. కంట్రోల్ రూమ్, బంకర్ నుంచే రిమోట్‌గా ఆపరేట్ చేయవచ్చు. ఫైబర్ ఆప్టిక్ లింక్ ఉన్న ప్రాంతాల్లో ఇది కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. జీపీఎస్‌ కంపాస్ కలిపి ఉన్నందున ఒక లక్ష్యం ఎక్కడ ఉందో కోఆర్డినేట్స్‌తో సహా తెలుసుకోవచ్చు. ఇది దాడి, ఆపరేషన్ ప్లానింగ్‌లో కీలకపాత్ర పోషిస్తుంది.

యాంటీ-డ్రోన్ పెట్రోల్‌ వాహనం (ఇంద్రజాల్)

ఇది డ్రోన్‌లను ఎదుర్కొనే మొబైల్ యూనిట్. 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లు ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తుంది. 5 కిలోమీటర్ల లోపు వాటి సిగ్నల్స్‌ను హ్యాక్ చేసి నియంత్రించగలదు. మరింత దగ్గరగా వస్తే 2 కిలోమీటర్ల పరిధిలో చిన్న డ్రోన్‌లను గాల్లోనే అడ్డుకునే ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌లను విడుదల చేస్తుంది. అంటే ఇది ఒక ‘మూవింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటిదన్నమాట.

లాంగ్ రేంజ్ కాంప్లెక్స్ సర్వైలెన్స్ సిస్టమ్

ఇందులో పీటీజెడ్‌ కెమెరాలు, స్టాటిక్ కెమెరాలు, ఐఆర్‌ఐడీఎస్‌ వంటి ఇంటెలిజెంట్ సెన్సింగ్ వ్యవస్థలు ఉంటాయి. ఇది ముఖ్యంగా చొరబాట్లకు అవకాశం ఉన్న పాయింట్లను నిరంతరం గమనిస్తుంది. ఏదైనా కదలిక కనిపిస్తే వెంటనే అలర్ట్ పంపుతుంది.

యాంటీ-డ్రోన్ గన్ సిస్టమ్

ఇది ఒక రకమైన ఎలక్ట్రానిక్ ‘జామ్ గన్’ లాంటిది. డ్రోన్ కమ్యూనికేషన్ సిగ్నల్స్‌ను బ్లాక్ చేసి దాన్ని నేలపైకి దింపుతుంది. అలాగే, డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ట్రేస్ చేయగలదు. దాంతో డ్రోన్ దాడులను తక్షణమే ఆపవచ్చు.

ఏఐ రోబోలు, రాడార్లు

పర్వతాలు, నదులు, అడవులు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో మనుషుల కంటే రోబోలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇవి కెమెరాలు, సెన్సార్ల సహాయంతో నిత్యం కదలికలను గమనిస్తాయి. రాడార్లు అయితే వాయుమార్గంలో వస్తున్న వస్తువులను (వాహనాలు, డ్రోన్‌లు) దూరం నుంచే గుర్తిస్తాయి.

హ్యాండ్‌హెల్డ్ థర్మల్ ఇమేజర్

ఇది సైనికులు చేతిలో పట్టుకుని ఉపయోగించే చిన్న పరికరం. చీకట్లో కూడా మనుషుల శరీర వేడిని గుర్తించి వారిని స్పష్టంగా చూపిస్తుంది. అడవులు, రాత్రి గస్తీలో ఇది చాలా ఉపయోగకరం.

దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్

ఇది మహిళా కమాండోల ప్రత్యేక విభాగం. వీరు డ్రోన్ ఆపరేషన్‌లలో శిక్షణ పొందిన వారుంటారు. డ్రోన్‌లను ఎగరవేయడం మాత్రమే కాదు.. దాడి, రక్షణ, రాత్రి ఆపరేషన్లు, ఆర్‌ఎఫ్‌ జామింగ్, పేలోడ్ నిర్వహణ వంటి అంశాల్లో కూడా నైపుణ్యం కలిగి ఉంటారు. కైనెటిక్ ఇంటర్‌సెప్టర్ టెక్నాలజీ వంటి ఆధునిక శిక్షణ ఈ బృందానికి అందించారు. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ టెక్నాలజీ కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఇది ప్రత్యేకత సంతరించుకుంది.

Advertisement
Advertisement