త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్

అధికారం పోయేసరికి కేటీఆర్, హరీష్ రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ పాలన దేశానికే ఆదర్శమన్నారు.

J

Telangana | Published On May 31, 2026, 9.30 pm IST

Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
Advertisement

Mallu Ravi | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమిని వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని, ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే మతిస్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

దేశానికే ఆదర్శంగా 'తెలంగాణ మోడల్'

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పాలన (Governance) అందిస్తోందని మల్లు రవి కితాబిచ్చారు. ఏ రకంగా చూసినా రేవంత్ పాలన ఆదర్శనీయంగా ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పక్క రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులు కూడా ఆశ్చర్యపోతున్నాయని, రాబోయే రోజుల్లో రేవంత్ మార్క్ 'తెలంగాణ మోడల్' దేశం మొత్తానికి ఆదర్శంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

స్వేచ్ఛ ఇస్తే.. కూల్చేస్తామంటారా?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ప్రతిపక్షాలకు కనీస ప్రజాస్వామిక హక్కులు కూడా లేకుండా చేశారని మల్లు రవి గుర్తుచేశారు. "గత పదేళ్లు మేం ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పట్లో మమ్మల్ని కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రానివ్వలేదు. అడుగడుగునా అరెస్టులు, నిర్బంధాలతో అణచివేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తూ ప్రతిపక్షాలకు పూర్తి స్వేచ్ఛ (Freedom) ఇచ్చింది. అయితే, కేటీఆర్, హరీష్ రావులు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు" అని ఆయన మండిపడ్డారు.

ప్రజలు అధికారం దూరం చేసినా బుద్ధి తెచ్చుకోకుండా.. ప్రభుత్వాన్ని 'కూల్చేస్తాం.. పేల్చేస్తాం' అంటూ అరాచక, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వారి అహంకారానికి నిదర్శనమని మల్లు రవి విమర్శించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

Advertisement

తాజావార్తలు

Advertisement