త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | స‌ర్‌లో పేరు గల్లంతైనా నో ప్రాబ్లమ్‌.. ఫామ్‌-6పై ఈసీ క్లారిటీ!

SIR | కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల‌కు భారీ ఊర‌ట క‌ల్పించింది. గత ఓటరు జాబితాలో పేరుండి.. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) అనంతరం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం ఫామ్‌-6 సమర్పించవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది.

P

National | Published On Nov 15, 2026, 12.47 pm IST

SIR | స‌ర్‌లో పేరు గల్లంతైనా నో ప్రాబ్లమ్‌.. ఫామ్‌-6పై ఈసీ క్లారిటీ!
Advertisement

SIR | కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల‌కు భారీ ఊర‌ట క‌ల్పించింది. గత ఓటరు జాబితాలో పేరుండి.. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) అనంతరం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం ఫామ్‌-6 సమర్పించవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. ఇప్పటికే ఓటరుగా నమోదైనప్పటికీ మరోసారి దరఖాస్తు చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

ఫామ్‌-6 సమర్పిస్తే చర్యలు ఉండవా?

ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్‌ 31 కింద చర్యలు తీసుకుంటారేమోనని కొందరు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఈసీ స్పష్టతనిచ్చింది. కేవలం ఫామ్‌-6 సమర్పించినంత మాత్రాన ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని తెలిపింది. అయితే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, సంబంధిత వ్యక్తి మరో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండ‌కూడ‌ద‌ని, మరో అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు జాబితాలోనూ పేరు ఉండొద్దు. ఫామ్‌-6తో సమర్పించే డిక్లరేషన్‌ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది.

మరో అవకాశం

ఓటరు జాబితాలో పేర్లు చేరని ఏఎస్‌డీడీ (ASDD -గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్‌) కేటగిరీ ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చాలన్న సుప్రీంకోర్టు సూచననూ ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు స‌ర్ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు నవంబర్ 6 ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ నివాస ప్రాంతం ఆధారంగా ఎన్యుమరేషన్‌ ఫారం (అనుబంధం-A) సమర్పించేందుకు అవకాశం కల్పించింది.

ఫారం ఎలా, ఎక్కడ సమర్పించాలి?

గతంలో ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పించని, నివాసం మారని ఓటర్లు సంతకం చేసిన ఫారాన్ని స‌మ‌ర్పించేందుకు అవ‌కాశం ఉంది. గతంలో ఎందుకు ఫారం ఇవ్వలేకపోయారో వివరిస్తూ అనుబంధం-బీలో ప్రకటన జత చేయాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సదుపాయాలను ఈసీ అందుబాటులోకి తెచ్చింది. ఆఫ్‌లైన్ విధానంలో సంబంధిత ఎన్నికల నమోదు అధికారి (ERO), సహాయ ఎన్నికల నమోదు అధికారి (ARO), బూత్‌ స్థాయి అధికారి (BLO)కి ఫారం అందించాలి. ఓటర్లు స్వయంగా లేదంటే కుటుంబ సభ్యుల ద్వారా ఫారం స‌మ‌ర్పించేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఆన్‌లైన్ విధానంలో ECINET పోర్టల్‌ ద్వారా ఈ-సైన్‌తో ఫారం సమర్పించే వెసులుబాటు కల్పించారు.
గతంలో ఫారం ఎందుకు సమర్పించలేదో అనుబంధం-బీలో తప్పనిసరిగా వివ‌రించాల్సి ఉంటుంది.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు

అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరుకూ తుది ఓటరు జాబితాలో చోటు దక్కకుండా పోకూడదన్నదే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. అదే సమయంలో ఒక వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నమోదుకాకుండా చర్యలు తీసుకోనుంది. అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చడంతోపాటు డూప్లికేట్‌ నమోదులను నివారించేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఈసీ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Advertisement
Advertisement