త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nithya Raman | లాస్ ఏంజెల్స్ మేయ‌ర్‌గా తిరువ‌నంత‌పురం బిడ్డ‌.. శ‌శిథ‌రూర్ హ‌ర్షం

Nithya Raman | లాస్ ఏంజెల్స్ మేయ‌ర్‌గా కొచ్చికి చెందిన నిత్యా రామ‌న్ (Nithya Raman) గెలుపొంద‌డంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో భార‌త్‌లోని మేయ‌ర్ల‌కు ఉన్న ప‌రిమిత అధికారాల‌పై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

D

National | Published On Nov 6, 2026, 12.19 pm IST

Nithya Raman | లాస్ ఏంజెల్స్ మేయ‌ర్‌గా తిరువ‌నంత‌పురం బిడ్డ‌.. శ‌శిథ‌రూర్ హ‌ర్షం
Advertisement

Nithya Raman | త్రినేత్ర న్యూస్ : అమెరికా ఎన్నిక‌ల్లో భార‌తీయులు త‌మ స‌త్తా చాటుతున్నారు. భార‌త మూలాలున్న‌ జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) ఇప్ప‌టికే అమెరికాలోనే అతిపెద్ద న‌గ‌ర‌మైన న్యూయార్క్‌కు మేయ‌ర్‌గా ఎన్నికైన విష‌యం తెలిసిందే. తాజాగా అక్క‌డ జ‌రిగిన మిడ్ ట‌ర్మ్ ఎన్నిక‌ల్లో లాస్ ఏంజెల్స్ మేయ‌ర్‌గా (Los Angeles Mayor) కొచ్చికి చెందిన నిత్యా రామ‌న్ (Nithya Raman) గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఆమె గెలుపుపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో నిత్యా రామ‌న్ విజ‌యంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ (Shashi Tharoor) స్పందించారు. తిరువ‌నంత‌పురం కుమార్తె ఇప్పుడు లాస్ ఏంజెల్స్ మేయ‌ర్ అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. తిరువనంతపురం ముద్దుబిడ్డ నిత్యా రామన్ లాస్ ఏంజెల్స్ కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు అంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో న్యూయార్క్‌కు చెందిన జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికాలోని రెండు అతిపెద్ద న‌గ‌రాలు భార‌త సంత‌తి వ్య‌క్తుల చేతుల్లో న‌డ‌వ‌బోతున్నాయి అని పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో భార‌త్‌లోని మేయ‌ర్ల‌కు (Indian Mayors) ఉన్న ప‌రిమిత అధికారాల‌పై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బ్రిటీష్ కాలం నాటి వ్యవస్థ కారణంగా మన దేశంలోని మేయర్‌లు అధికారాలు, బడ్జెట్ లేక నిస్స‌హాయులుగా మిగిలిపోయార‌ని వ్యాఖ్యానించారు. పేరుకే మేయ‌ర్ల‌ని.. త‌మ న‌గ‌రాల‌ను వారు స‌మ‌ర్థ‌వంతంగా అభివృద్ధి ప‌థంలో న‌డిపించ‌లేక‌పోతున్నార‌ని చెప్పుకొచ్చారు. కానీ అమెరికాలో మాత్రం మేయ‌ర్లుగా ఎన్నికైన వారికి అద్భుతంగా ప‌ని చేసే అవ‌కాశాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ఎవ‌రీ నిత్యా రామ‌న్..?

నిత్యా రామన్ 1981 జూలై 28న కేరళలో (Kerala) జన్మించారు. త‌న ఆరో ఏట కుటుంబంతో క‌లిసి అమెరికాకు వ‌ల‌స వెళ్లారు. బోస్టన్‌లో పెరిగిన ఆమె.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుండి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. చదువు పూర్తయిన తర్వాత భారత్‌కు వచ్చి ఢిల్లీలో మురికివాడల ప్రజల కోసం, చెన్నైలో నగర పాలన మెరుగుపడటానికి 'ట్రాన్స్‌పరెంట్ చెన్నై' అనే సంస్థ ద్వారా పనిచేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి లాస్ ఏంజెల్స్‌లో నిరాశ్రయుల సమస్యలపై పనిచేశారు. ఆమె భర్త వాలీ చంద్రశేఖరన్‌ స్థానికంగా పేరొందిన టెలివిజన్‌ రచయిత, ప్రొడ్యూసర్‌. 2013లో లాస్‌ ఏంజెలెస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. వీరికి కర్ణ, కావేరి కవల పిల్లలున్నారు.

2020లో లాస్ ఏంజెల్స్ సిటీ కౌన్సిల్‌కు తొలిసారిగా ఎన్నికైన నిత్యా రామన్.. ఆ పదవిని చేపట్టిన తొలి సౌత్ ఏషియన్, తొలి ఆసియన్-అమెరికన్ మహిళగా రికార్డు సృష్టించారు. 2024లో ఆమె మరోసారి కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇప్పుడు మేయ‌ర్ ప‌ద‌వికి పోటీ ప‌డి చారిత్రాత్మ‌క విజ‌యం సాధించారు. సిట్టింగ్ మేయర్ కరెన్ బాస్‌పై విజయం సాధించి, నగరానికి తొలి ఆసియన్-అమెరికన్ మేయర్‌గా నిలిచారు. నిత్యా రామన్ 52.70 శాతం ఓట్లు సాధించగా, కరెన్ బాస్ 47.30 శాతం ఓట్లు పొందారు.

Also Read..

వైద్యం పేరుతో డాక్ట‌ర్‌ను ఇంటికి పిలిచి.. నిలువునా దోచుకున్న న‌టులు

జ‌నాల‌పైకి దూసుకెళ్లిన ట్ర‌క్కు.. ఏడుగురు మృతి

కూతూరును కాపాండేందుకు చెరువులోకి దిగిన తండ్రి.. నీట మునిగి ఇద్ద‌రూ మృతి

Advertisement
Advertisement