త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nithya Raman | లాస్ ఏంజెలెస్ మేయ‌ర్‌గా నిత్యా రామ‌న్.. తొలి ఇండియ‌న్ అమెరిక‌న్‌గా రికార్డ్‌

Nithya Raman | భార‌త సంత‌తికి చెందిన నిత్యా రామ‌న్ (Nithya Raman) చ‌రిత్ర సృష్టించారు. అమెరికాలో రెండో అతిపెద్ద న‌గ‌ర‌మైన లాస్ ఏంజెలెస్ మేయ‌ర్‌గా (Los Angeles Mayor) ఎన్నిక‌య్యారు.

G

International | Published On Nov 6, 2026, 7.20 am IST

Nithya Raman | లాస్ ఏంజెలెస్ మేయ‌ర్‌గా నిత్యా రామ‌న్.. తొలి ఇండియ‌న్ అమెరిక‌న్‌గా రికార్డ్‌
Advertisement

Nithya Raman | త్రినేత్ర న్యూస్‌: భార‌త సంత‌తికి చెందిన నిత్యా రామ‌న్ (Nithya Raman) చ‌రిత్ర సృష్టించారు. అమెరికాలో రెండో అతిపెద్ద న‌గ‌ర‌మైన లాస్ ఏంజెలెస్ మేయ‌ర్‌గా (Los Angeles Mayor) ఎన్నిక‌య్యారు. రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి, ప్ర‌స్తుత మేయ‌ర్ క‌రేన్ బాస్‌ను (Karen Bass) మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో (US Midterm Elections) మ‌ట్టిక‌రిపించిన కేర‌ళ మూలాలున్న నిత్యా.. లాస్ ఏంజెలెస్‌కు తొలి భార‌త సంత‌తి మేయ‌ర్‌గా, రెండో మ‌హిళా మేయ‌ర్ రికార్డుల్లో నిలిచారు.

నిత్యా రామన్ 1981 జూలై 28న కేరళలో (Kerala) జన్మించారు. తండ్రి వెంకటరత్నం ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి.. తల్లి సుధ బ్యాంకు ఉద్యోగి. త‌న ఆరేండ్ల‌ వయసులోనే తల్లిదండ్రులతో కలిసి నిత్య అమెరికాకు వలస వెళ్లారు. బోస్టన్‌లో పెరిగిన ఆమె.. హార్వర్డ్‌ యూనివర్సిటీలో బ్యాచిలర్‌ డిగ్రీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT) నుంచి మాస్టర్స్‌ చేశారు. భర్త వాలీ చంద్రశేఖరన్‌ స్థానికంగా పేరొందిన టెలివిజన్‌ రచయిత, ప్రొడ్యూసర్‌. 2013లో లాస్‌ ఏంజెలెస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. వీరికి కర్ణ, కావేరి కవల పిల్లలున్నారు.

చదువు పూర్తయిన తర్వాత భారత్‌కు వచ్చి ఢిల్లీలో మురికివాడల ప్రజల కోసం, చెన్నైలో నగర పాలన మెరుగుపడటానికి 'ట్రాన్స్‌పరెంట్ చెన్నై' అనే సంస్థ ద్వారా పనిచేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి లాస్ ఏంజెల్స్‌లో నిరాశ్రయుల సమస్యలపై పనిచేశారు. హాలీవుడ్‌లో సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే నిత్య.. 2020లో లాస్‌ ఏంజెలెస్‌ సిటీ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ పదవిని చేపట్టిన తొలి సౌత్ ఏషియన్ మరియు తొలి ఆసియన్-అమెరికన్ మహిళగా రికార్డు సృష్టించారు. 2024 మార్చిలో ఆమె రెండోసారి సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. అందుబాటు ధరలో గృహాల లభ్యత, నిరాశ్రయులు, అద్దెదారుల హక్కులు, పౌరుల భద్రత, నగరంలో మెరుగైన సేవల కోసం కృషి చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా జ‌రిగిన లాస్ ఏంజెల్స్ మేయర్ ఎన్నికల్లో సిట్టింగ్ మేయర్ కరెన్ బాస్‌పై విజయం సాధించి, నగరానికి తొలి ఆసియన్-అమెరికన్ మేయర్‌గా నిలిచారు.

Advertisement
Advertisement