త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా సుబ్ర‌మ‌ణి మోహ‌న‌.. నేరుగా అపెక్స్ కోర్టుకు వెళ్లిన రెండో మ‌హిళగా ఘ‌న‌త‌..!

Supreme Court | సీనియర్‌ న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహన సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామ‌క‌మ‌య్యారు. బార్ కౌన్సిల్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన దేశంలో రెండో మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు.

P

National | Published On Jun 1, 2026, 5.39 pm IST

Supreme Court | సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా సుబ్ర‌మ‌ణి మోహ‌న‌.. నేరుగా అపెక్స్ కోర్టుకు వెళ్లిన రెండో మ‌హిళగా ఘ‌న‌త‌..!
Advertisement

Supreme Court | సీనియర్‌ న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహన సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామ‌క‌మ‌య్యారు. బార్ కౌన్సిల్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన దేశంలో రెండో మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు. 2018లో జస్టిస్‌ ఇందు మల్హోత్రా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళ మోహన కావడం విశేషం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సేవలందిస్తున్న మహిళా న్యాయమూర్తులలో జస్టిస్ బీవీ నాగరత్నతో మోహన క‌లువ‌నున్నారు. 2021 ఆగస్టు 31 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ నాగరత్న 2027లో సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.

కీల‌క కేసుల్లో న్యాయ‌వాదిగా..

59 ఏళ్ల మోహన 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అప్పటి నుంచి న్యాయవాదిగా కొనసాగుతూ వస్తున్నారు. 2015లో ఆమెను సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌గా గుర్తించింది. భారత సాయుధ దళాల్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌, సీనియర్‌ సిటిజన్ల ఆస్తి హక్కులు, క‌ర్నాట‌క హిజాబ్‌ నిషేధం వంటి పలు కీలక కేసుల్లో ఆమె వాదనలు వినిపించారు. జ‌డ్జిగా ఆమె నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటివరకు నియమితులైన 12వ మహిళా న్యాయమూర్తి మోహన కావడం గమనార్హం. జస్టిస్‌ ఇందు మల్హోత్రా తర్వాత బార్‌ నుంచి నేరుగా పదోన్నతి పొందిన రెండో మహిళగా ఆమె నిలిచారు. ఆమె 2031 జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల చరిత్ర

1989లో జస్టిస్ ఎం ఫాతిమా బీబీ తొలి మహిళా న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో నియమితులయ్యారు. ఆమె హైకోర్టు న్యాయమూర్తిగా సేవల అనంతరం టాప్ కోర్టుకు పదోన్నతిపై వెళ్లారు. ఒక దశలో జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఆర్ భానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కలిసి సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్‌ ఇందు మల్హోత్రా 2018 ఏప్రిల్‌ 27న బార్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె 2021 మార్చిలో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం బార్‌ నుంచి నేరుగా పదోన్నతి పొందిన ఇతర న్యాయమూర్తుల్లో జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ కేవీ విశ్వ‌నాథ‌న్ ఉన్నారు.

సుప్రీంకోర్టుకు కొత్త‌గా ఐదుగురు న్యాయ‌మూర్తులు..

ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులుగా నియామ‌క‌మ‌య్యారు. దాంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరనుంది. మోహనతో పాటు బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్, పంజాబ్‌ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శీల్‌ నగు, మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్ స‌చ్‌దేవా, జమ్ము కశ్మీర్‌–లడఖ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ పల్లి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో ఈ ఐదుగురి పేర్లను సిఫారసు చేసింది. ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఓ న్యాయ‌మూర్తి స్థానం ఇంకా ఖాళీగానే ఉన్న‌ది.

Advertisement
Advertisement