త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala case | అరాచ‌క‌త్వానికి తావు లేదు.. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు..!

Sabarimala case | శబరిమల కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత సంస్థల నిర్వహణ అనేది నియంత్రణలతో ఉండాలని, రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.

P

National | Published On Apr 28, 2026, 3.37 pm IST

Sabarimala case | అరాచ‌క‌త్వానికి తావు లేదు.. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు..!
Advertisement

Sabarimala case | శబరిమల కేసులో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో మ‌రోసారి విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒక మత సంస్థను నిర్వహించే హక్కు అంటే.. అది కచ్చితంగా అరాచకత్వమేన‌ని అర్థం కాదని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి సంస్థకు తన పని తీరుకు అనుగుణంగా నియమాలు, ప్రమాణాలు ఉండాల్సిందేనని పేర్కొంది. సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని రాజ్యాంగ బెంచ్ ఈ కేసును విచారించింది. ఈ బెంచ్‌లో న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఎంఎం సుందరేశ్, అహ్సానుద్దీన్ అమానుల్లా త‌దిత‌రులు ఉన్నారు.

అదే అస‌లు ప్ర‌శ్న‌..

విచారణ సందర్భంగా జ‌స్టిస్ అమానుల్లా మాట్లాడుతూ "నిర్వహణ హక్కు అంటే ఎటువంటి వ్యవస్థ ఉండకూడదని కాదు. ప్రతిదానికీ ఒక ప్రక్రియ, నియమాలు ఉండాలి" అని అన్నారు. "అది దర్గా అయినా, ఆలయం అయినా ఆ సంస్థకు సంబంధించిన కొన్ని అంతర్లీన అంశాలు ఉంటాయి. అక్కడ ఒక నిర్దిష్టమైన ఆరాధనా విధానం, కార్యకలాపాల క్రమం ఉంటాయి. వీటిని నియంత్రించడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఎవరికి తోచినట్లు వారు వ్యవహరించడం సాధ్యం కాదు. అలాగే, అలాగే నియంత్రణ లేకుండా ఎప్పుడూ తలుపులు తెరిచి ఉంచడం కూడా సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. అసలు నిర్వహణ బాధ్యత ఎవరికి అన్నదే ప్రధాన ప్రశ్నగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, మతపరమైన నియమాలు రాజ్యాంగ పరిధిని దాటకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియమాలు అవసరమే కానీ అవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని న్యాయమూర్తి అమానుల్లా పేర్కొన్నారు.

వ్య‌క్తిగ‌త అభిప్రాయాల ఆధారంగా ఉండొద్దు..

వివక్షకు ఏ రూపంలోనూ స్థానం లేదని, ప్రతి సంస్థకు తన ప్రమాణాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా ఉండకూడదని చెప్పారు. ఈ సందర్భంగా హజ్రత్ ఖ్వాజా నిజాముద్దీన్ అవలియా దర్గా వారసుడు పిర్జాదా సయ్యద్ అల్తమాష్ నిజామీ తరఫున న్యాయవాది నిజాం పాషా వాదనలు వినిపించారు. ఆ దర్గా ఒక పవిత్ర స్థల‌మ‌ని, సూఫీ సంప్రదాయంలో దానికి ప్రత్యేక గౌరవం ఉందని తెలిపారు. భారతదేశంలో చిష్తియా, ఖాద్రియా, నక్స్బందియా, సుహ్రవర్దియా వంటి ప్రధాన సూఫీ సంప్రదాయాలు ఉన్నాయని వివరించారు. ఇకపోతే, గతంలో మతాచారాలు తప్పనిసరి లేదా కాదో నిర్ణయించడం న్యాయస్థానాలకు క్లిష్టమని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్య‌క్తం చేసింది. 2018 సెప్టెంబర్‌లో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ 4:1 మెజారిటీతో శబరిమల ఆలయంలో ప‌ది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ ఆచారం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం, మత స్వేచ్ఛకు సంబంధించిన విస్తృత అంశాలపై తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్ విచారణ కొన‌సాగిస్తోంది.

Advertisement
Advertisement