త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ప్ర‌ధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చు రూ.762 కోట్లు : కేంద్రం

PM Modi | ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ (PM Modi) విదేశీ పర్యటనలకు (foreign trips) అయిన ఖర్చు వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

D

National | Published On Feb 14, 2026, 1.17 pm IST

PM Modi | ప్ర‌ధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చు రూ.762 కోట్లు : కేంద్రం
Advertisement

PM Modi | ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ (PM Modi) విదేశీ పర్యటనలకు (foreign trips) అయిన ఖర్చు వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ప్ర‌ధాని విదేశీ టూర్ల కోసం గ‌త ప‌దేళ్ల‌లో సుమారు రూ. 760 కోట్ల ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపింది. ఈ విష‌యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ లోక్‌స‌భ‌కు వెల్ల‌డించింది.

2015 నుంచి 2025 వ‌ర‌కు ప్ర‌ధాని మోదీ విదేశీ టూర్ల కోసం సుమారు రూ.762 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపింది. విదేశాంగ శాఖ లోక్‌స‌భ‌లో ఓ ప్ర‌శ్న‌కు లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చింది. ప్ర‌ధాని మోదీతో పాటు వెళ్లిన ప్ర‌తినిధుల స‌మాచారాన్ని కూడా పంచుకుంది. 2015లో ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌కు అయిన ఖ‌ర్చు రూ.91.53 కోట్లుగా తెలిపింది. 2016లో రూ.33.22 కోట్లు, 2017లో రూ.44.27 కోట్లు, 2018లో రూ.51.46 కోట్లు, 2019లో రూ.71.76 కోట్లు ఖ‌ర్చైంది. అయితే 2020లో క‌రోనా కార‌ణంగా ప్ర‌ధాని ఎలాంటి విదేశీ టూర్‌కూ వెళ్ల‌లేదు. 2021లో రూ.36.11కోట్లు, 2022లో రూ.55.82 కోట్లు, 2023లో రూ.93.63 కోట్లు, 2024లో రూ.109.51కోట్లు, 2025లో రూ.175.19 కోట్లు ఖ‌ర్చైన‌ట్లు వివ‌రించింది.

2014 నుంచి ప్ర‌ధానితో ప‌ర్య‌టించిన విదేశీ బృందంలో క‌నీసం 27 నుంచి 72 మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలిపింది. 2025లో ప్ర‌ధాని ఐదు దేశాల్లో ప‌ర్య‌టించారు. అప్పుడు భార‌త బృందంలో సుమారు 95 మంది ప్ర‌తినిధులు ఉన్న‌ట్లు వివ‌రించింది. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల స‌మ‌యంలో ప్ర‌ధానిని ఆ దేశం ఓ అతిథిగా ఆహ్వానిస్తుందని.. ప్ర‌థాని ఆతిథ్య ఖ‌ర్చు మొత్తం ఆ దేశ‌మే భ‌రిస్తుంద‌ని పేర్కొంది. కానీ ప్ర‌ధానితో పాటూ వెళ్లే ప్ర‌తినిధి బృందం, భ‌ద్ర‌తా ఏర్పాట్లు, మీడియా బృందం, లాజిస్టిక‌ల్ స‌పోర్టు ఖ‌ర్చుల‌న్నీ ఇండియానే భ‌రించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

గ‌త‌ ప్ర‌ధానుల ప‌ర్య‌ట‌న‌కు అయిన ఖ‌ర్చు వివ‌రాల‌ను కూడా ప్ర‌భుత్వం పంచుకుంది. 2011లో అప్ప‌టి ప్ర‌ధాని అమెరికా వెళ్లిన స‌మ‌యంలో 10.74 కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్లు పేర్కొంది. 2013లో ర‌ష్యా ట్రిప్‌కు 9.95 కోట్లు, 2011లో ఫ్రాన్స్‌కు వెళ్లిన‌ప్పుడు 8.33 కోట్లు, 2013లో జ‌ర్మ‌నీ వెళ్లిన‌ప్పుడు 6.02 కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్లు ప్ర‌భుత్వం లోక్‌స‌భ‌కు లిఖిత‌పూర్వంగా తెలిపింది.

Advertisement
Advertisement