త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EVM Tampering | బెంగాల్‌లో ‘టేపు’ల కలకలం: బీజేపీకి ఓటెయ్యకుండా ఈవీఎంల ట్యాంపరింగ్.. ఫాల్తాలో రీపోలింగ్!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ కలకలం రేపుతోంది. డైమండ్ హార్బర్ నియోజకవర్గ పరిధిలోని ఫాల్తాలో బీజేపీ అభ్యర్థి పేరు పక్కన ఉన్న ఈవీఎం బటన్‌ను టేపుతో మూసివేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించింది.

J

National | Published On Apr 29, 2026, 4.49 pm IST

EVM Tampering | బెంగాల్‌లో ‘టేపు’ల కలకలం: బీజేపీకి ఓటెయ్యకుండా ఈవీఎంల ట్యాంపరింగ్.. ఫాల్తాలో రీపోలింగ్!

సంక్షిప్త సారాంశం

దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్తాలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కంచుకోట అయిన ఇక్కడ, ఈవీఎంలలో బీజేపీ, సీపీఎం అభ్యర్థులకు ఓట్లు పడకుండా ఆ బటన్లకు టేపులు వేశారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఈ వీడియోలను ఎక్స్‌ (ట్విట్టర్)లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులే ఈ పని చేశారని బీజేపీ ఆరోపించగా, ఓటమి భయంతోనే బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని టీఎంసీ ఖండించింది. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం ఫాల్తాలోని ఆయా బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.

Advertisement

EVM Tampering | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోట అయిన దక్షిణ 24 పరగణాల జిల్లా 'ఫాల్తా' (Falta) నియోజకవర్గంలో ఈవీఎంల బటన్లకు సెల్లోఫేన్ టేపులు వేసిన ఘటనలు రాజకీయంగా కాక రేపుతున్నాయి. బీజేపీ, సీపీఎం అభ్యర్థులకు ఓటు వేయకుండా ఆ పార్టీల గుర్తులపై టేపులు అతికించిన వీడియోలు వైరల్ కావడంతో, ఎన్నికల సంఘం (EC) తక్షణమే స్పందించి ప్రభావిత బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది.

అసలేం జరిగిందంటే

ఫాల్తా.. డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. ఇక్కడ టీఎంసీ తరపున అభిషేక్ సన్నిహితుడు జహంగీర్ ఖాన్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి దేబాన్షు పాండా బరిలో ఉన్నారు. అయితే, పోలింగ్ రోజున పలు బూత్‌లలో బీజేపీ అభ్యర్థి గుర్తు (కమలం) పక్కన ఉన్న బటన్‌ను నొక్కకుండా ఉద్దేశపూర్వకంగా టేపులు వేశారని దేబాన్షు ఆరోపించారు. తనకు ఓట్లు పడకుండా అడ్డుకునేందుకే అధికార పార్టీ నేతలు ఈ కుట్రకు తెరలేపారని ఆయన మండిపడ్డారు.

ఇదేనా డైమండ్ హార్బర్ మోడల్?

ఈ వివాదంపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొన్ని వీడియోలను షేర్ చేశారు. ఫాల్తాలోని హరిన్‌దంగా హైస్కూల్‌లో ఉన్న బూత్ నంబర్ 144తో పాటు 170, 189 బూత్‌లలో కూడా ఇలాగే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. "బీజేపీకి ఓటు వేసే ఆప్షన్‌ను టేపులు వేసి బ్లాక్ చేశారు. ఇదేనా డైమండ్ హార్బర్ మోడల్? గతంలో అభిషేక్ బెనర్జీ ఎంపీగా గెలిచింది కూడా ఇదే ఫార్ములాతోనా?" అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభావితమైన బూత్‌లన్నింటిలో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

కొట్టిపారేసిన టీఎంసీ

బీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బెంగాల్‌లో ఘోరంగా ఓడిపోతున్నామనే భయంతోనే కమలం పార్టీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని టీఎంసీ అధికార ప్రతినిధి రిజు దత్తా మండిపడ్డారు. "ఈవీఎంలు మా చేతుల్లో ఉండవు, అవన్నీ ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటాయి. ఒకవేళ ట్యాంపరింగ్ జరిగితే అది మా తప్పు కాదు, ఈసీ వైఫల్యమే. ట్విట్టర్‌లో పోస్టులు పెట్టడం మాని, దమ్ముంటే మీ బాస్‌లకు చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చేయించండి" అని సవాల్ విసిరారు. మరోవైపు, కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని, బయటి రాష్ట్రాల నుంచి పోలీసు అబ్జర్వర్లను తీసుకొచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.

రంగంలోకి దిగిన ఈసీ.. మాంటేశ్వర్‌లోనూ కలకలం

ఫాల్తాలోనే కాకుండా పుర్బా బర్ధమాన్ జిల్లాలోని మాంటేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. బూత్ నంబర్ 35లో నాలుగో నంబర్ వద్ద ఉన్న టీఎంసీ అభ్యర్థి సిద్ధిఖుల్లా చౌదరి ఫొటో ఉన్న బటన్‌కు టేపు వేసినట్లు గుర్తించారు. దీంతో అక్కడ పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, అధికారుల పరిశీలన తర్వాత మళ్లీ ప్రారంభించారు.

మరోవైపు ఫాల్తా ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈవీఎం ట్యాంపరింగ్ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) మనోజ్ కుమార్ అగర్వాల్.. ఫాల్తాలో బటన్లను జామ్ చేసినట్లు తేలడంతో ప్రభావిత బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరింతగా నమోదైతే నియోజకవర్గం మొత్తం రీపోలింగ్ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఫాల్తాలో ప్రస్తుతం భారీ పోలీసు బందోబస్తు మధ్య పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన పార్టీ కార్యాలయంలోనే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement