త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee | నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయ‌..!

P

National | Published On May 5, 2026, 5.06 pm IST

Mamata Banerjee | నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయ‌..!
Advertisement
  • ప్ర‌జాస్వామ్యాన్ని వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది
  • బీజేపీ కాదు.. ఈసీయే అస‌లు ప్ర‌త్య‌ర్థి
  • ఎన్నిక‌ల్లో వందసీట్ల‌ను దొంగిలించారు
  • ఇలాంటి బీజేపీ ప్ర‌భుత్వాన్ని చూడ‌లేదు
  • బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న ప్రెస్‌మీట్‌

Mamata Banerjee | ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి. వ‌రుస‌గా మూడుసార్లు అధికారంలో కొన‌సాగిన మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ నాలుగోసారి ఓట‌మిపాలైంది. అయితే, ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై దీదీ మంగ‌ళ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె తాము ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ట్లు అంగీక‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీకి ప్ర‌జాతీర్పును దొంగిలించింద‌ని ఆరోపించారు. రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి రాజీనామా చేయ‌బోన‌ని తేల్చి చెప్పారు. తాను ఓడిపోలేద‌ని, కాబ‌ట్టి రాజీనామా చేయ‌న‌న్నారు. తాను రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్ల‌న‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వంద సీట్ల‌ను తొల‌గించార‌ని ఆరోపించార‌న్న‌ మ‌మ‌త కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఎన్నిక‌ల సంఘంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని మండిప‌డ్డారు. న్యాయవ్యవస్థ సరిగా లేకపోతే, ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తే.. ప్రభుత్వం ఒకే పార్టీ పాలన కోరుకుంటే ప్రపంచానికి తప్పు సందేశం వెళ్తుందన్నారు. ఎన్నికల సంఘం ‘నాస్టీ గేమ్స్’ ఆడుతోందని ఆరోపించిన ఆమె.. అసలు ప్రత్యర్థి బీజేపీ కాదని, ఎన్నికల సంఘమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం వల్లే ఎన్నికల ప్రక్రియ ప్రభావితమైందని ఆమె ఆరోపించారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్‌తో పాటు తాజాగా బెంగాల్‌లోనూ ఎన్నికలు ప్రభావితమయ్యాయన్నారు. భ‌వానీపూర్ నియోజకవర్గంలో తనను ఉద్దేశపూర్వకంగా ఓడించారని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేసి బీజేపీ విజయం సాధించిందని ఆరోపించారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

అలాగే కౌంటింగ్ కేంద్రంలో తనపై దౌర్జన్యం జరిగిందని ఆరోపించారు. తనపై పోలింగ్ కేంద్రంలో దాడి జరిగిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. త‌న‌ను కడుపు, వెన్నుపైన త‌న్నార‌ని.. సీసీటీవి ప‌ని చేయ‌లేద‌ని, కౌంటింగ్ కేంద్రం నుంచి త‌న‌ను బయటకు నెట్టేశార‌ని.. ఒక మహిళగా త‌న‌ను అవ‌మానించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర బలగాల తీరుపై సైతం దీదీ విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని చూశామ‌ని, గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి పరిస్థితి చూడలేదని వ్యాఖ్యానించారు. పార్టీ వ్యూహంపై వివరాలు వెల్ల‌డించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. ఇండియా కూటమి నేతలు తనతో సంప్రదింపులు జరిపారని, వారికి తనకు మద్దతు ఉందని మమతా తెలిపారు. అదే సమయంలో టీఎంసీ తరఫున ఐదుగురు ఎంపీలతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన ప్రాంతాలకు ఈ బృందం వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తుందని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement