త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. ర‌ణ‌రంగంగా ఎల్‌పీయూ క్యాంప‌స్‌

LPU Punjab | పంజాబ్‌లోని ప్రముఖ లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్ ర‌ణ‌రంగంగా మారింది. లేడీస్ హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై నిర్మాణ కార్మికులు సామూహిక అత్యాచానికి పాల్ప‌డ్డార‌న్న వ‌దంతులపై విద్యార్థులు భ‌గ్గుమ‌న్నారు.

S

National | Published On Sep 27, 2026, 1.07 pm IST

LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. ర‌ణ‌రంగంగా ఎల్‌పీయూ క్యాంప‌స్‌
Advertisement
  • భ‌వ‌నాల‌కు నిప్పు పెట్టిన విద్యార్థులు
  • శ‌నివారం రాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు
  • పుకార్లు ఒట్టియేన‌న్న ఎస్పీ గౌర‌వ్ తూరా

LPU Punjab | త్రినేత్ర న్యూస్: పంజాబ్‌లోని ప్రముఖ లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్ ర‌ణ‌రంగంగా మారింది. లేడీస్ హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై నిర్మాణ కార్మికులు సామూహిక అత్యాచానికి పాల్ప‌డ్డార‌న్న వ‌దంతులపై విద్యార్థులు భ‌గ్గుమ‌న్నారు. ఆపై బాధిత విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని పుకార్లు రావ‌డంతో వారు చేపట్టిన నిర‌స‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి. క్యాంప‌స్ భ‌వ‌నాల‌కు నిప్పు పెట్ట‌డంతో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణ ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు భారీ ఎత్తున గుమిగూడి పెద్ద‌పెట్టున‌ నినాదాలు చేస్తూ క్యాంపస్‌లో విధ్వంసం సృష్టించారు.

భవనాలకు నిప్పు..

యూనివ‌ర్సిటీ క్యాంపస్‌లోని గ్లాస్ కిటికీలు, పూల కుండీలను విద్యార్థులు ప‌గుల‌గొట్టారు. క్యాంపస్ ఆవ‌ర‌ణ‌లోని కొన్ని భ‌వ‌నాల‌ భాగాలకు నిప్పుపెట్టారు. అనంత‌రం క్యాంప‌స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వేలాది మంది విద్యార్థులు జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో అక్క‌డ‌ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఎలాంటి అత్యాచారం జ‌ర‌గ‌లేదు: ఎస్పీ

ఈ ఘటనపై కపుర్థలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) గౌరవ్ తూరా స్పందించారు. సామూహిక అత్యాచారం జరిగినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే క్యాంపస్‌లోని అగ్రికల్చర్‌ విభాగం సమీపంలో ఐదు రోజుల క్రితం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అత్యాచారం జరగడంతోనే ఆమె మృతి చెందిందని వస్తున్న వదంతులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న మహిళ, నిందితుడి వివరాలు కూడా నిర్ధారణ కాలేదు. సోషల్‌ మీడియాలో కొందరు వర్సిటీలోని ఓ ఉద్యోగిపై ఆరోపణలు చేసినప్పటికీ వాటిని ధ్రువీకరించలేదు. గత రాత్రి జాతీయ రహదారి దిగ్బంధం సమాచారం అందగానే సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను అదుపులోకి తెచ్చాం. విద్యార్థులు, వర్సిటీ యాజమాన్యం మధ్య ఏదో పొరపాటుగా భావిస్తున్నాం. దీనిపై విద్యార్థుల సంఘాలతో చర్చలు జరిపి స్పష్టత తెస్తాం. ఆస్తి నష్టంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ గౌర‌వ్ తూరా పేర్కొన్నారు.

శాంతియుత వాతావ‌ర‌ణానికి స‌హ‌క‌రించాలి: వ‌ర్సిటీ అధికారులు

కాగా ఈ ఘటనపై ఆదివారం యూనివర్సిటీ అధికారులు స్పందించారు. క్యాంపస్‌లో విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవాలు. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. విద్యార్థులు ఎలాంటి నిరసనల్లో పాల్గొనవద్దు. క్యాంపస్‌లో శాంతియుత వాతావరణానికి సహకరించాలి అని ఎల్‌పీయూ రిజిస్ట్రార్‌ మోనికా గులాటి విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement