News Paper Reading | త్రినేత్ర.న్యూస్ : విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో వార్తా పత్రిక పఠనం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులకు పదజాలంపై అవగాహన పెరగడంతో పాటు పుస్తక పఠనం అలవాటు మెరుగుపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31న రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయంలో 10 నిమిషాల పాటు వార్తా పత్రికలను చదివించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పిల్లలకు కరెంట్ అఫైర్స్‌పై అవగాహన ఏర్పడుతుంది. దాంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏం జరుగుతుందనే దానిపై చర్చకు ఆస్కారం ఉంటుందని, తద్వారా సామాజిక అంశాలపై అవగాహన ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కచ్చితంగా రెండు న్యూస్ పేపర్లను విధిగా వేయించుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఒకటి ఇంగ్లీష్, మరొకటి హిందీ పత్రిక ఉండాలని తెలిపింది. ఇక గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కూడా కచ్చితంగా రెండు హిందీ పేపర్లను వేయించుకోవాలని ఆదేశించింది. ఈ ఖర్చులను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ భరిస్తుందని తెలిపింది. ప్రతి రోజు రెండు న్యూస్ పేపర్లలోని ఓ కొత్త ఐదు పదాలను గుర్తించి.. వాటికి అర్థం చెప్పేందుకు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని ఆదేశించింది. దీంతో విద్యార్థులకు భాషపై పట్టు వస్తుందని తెలిపింది. ఉదయం పూట ప్రార్థనా సమయంలో హిందీ, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లను విద్యార్థుల చేత గట్టిగా చదివి వినిపించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీంతో పాటు తరగతి గదుల్లో కూడా వార్తా పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్, జాతీయ, అంతర్జాతీయ, క్రీడలకు సంబంధించి వార్తలపై చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కార్యక్రమాలతో విద్యార్థుల్లో సామాజిక స్పృహ, జనరల్ నాలెడ్జ్ పెంపొందడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది.