త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG Paper Leak | నీట్ పేపర్ లీక్: పుణె టీచర్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు!

నీట్-యూజీ బయోలజీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్‌టీఏ నిపుణురాలిగా పనిచేసిన పుణెకు చెందిన టీచర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమె ఈ లీక్ ప్లాన్‌ను ఎలా అమలు చేసిందంటే..!

J

National | Published On May 16, 2026, 3.45 pm IST

NEET UG Paper Leak | నీట్ పేపర్ లీక్: పుణె టీచర్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు!
Advertisement
  • నీట్-యూజీ (NEET-UG) బయోలజీ పేపర్ లీక్ కేసులో పుణెకు చెందిన బాటనీ టీచర్‌ మనీషా గురునాథ్ మాంధారేను సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు.
  • ఈ స్కామ్‌లో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య ఈమెతో కలిపి 9కి చేరింది.
  • నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నియమించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లలో ఈమె కూడా ఒకరు కావడం గమనార్హం.
  • మరో నిందితురాలి సాయంతో విద్యార్థులకు వలవేసి, ఇంట్లోనే కోచింగ్ పేరిట ఈ దందా నడిపినట్లు విచారణలో తేలింది.

NEET UG Paper Leak | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్-యూజీ (NEET-UG) 2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బయోలజీ (Biology) ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన పుణెకు చెందిన ఓ బోటనీ (Botany) టీచర్‌ను ఢిల్లీలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ మెగా స్కామ్‌లో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

కంచే చేను మేసిన వైనం.. కోచింగ్ ముసుగులో లీక్

అరెస్టయిన టీచర్‌ను మనీషా గురునాథ్ మాంధారేగా గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమెను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా నియమించింది. అక్రమాలను అడ్డుకోవాల్సిన స్థానంలో ఉండి, ఆ అవకాశాన్ని వాడుకుని ఆమె అడ్డదారి తొక్కింది. గత ఏప్రిల్‌లో, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన మరో నిందితురాలు మనీషా వాగ్మారే ద్వారా పలువురు నీట్ విద్యార్థులను ఆమె సంప్రదించింది. 'కోచింగ్ క్లాసుల' పేరుతో వారిని తన ఇంటికి రప్పించుకుంది.

కోచింగ్ నెపంతో బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రశ్నలను విద్యార్థులకు చెప్పి, నోట్‌బుక్స్‌లో రాయించడంతో పాటు టెక్స్ట్‌బుక్స్‌లో మార్క్ చేయించింది. మే 3వ తేదీన జరిగిన అసలైన నీట్ పరీక్షలో ఆమె చెప్పిన ప్రశ్నలే దాదాపుగా రావడం గమనార్హం.

ముమ్మరంగా సోదాలు.. ఆరుగురు కస్టడీకి

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. కీలకమైన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, మొబైల్ ఫోన్లను సీజ్ చేసి విశ్లేషిస్తోంది. ఇప్పటివరకు పట్టుబడిన తొమ్మిది మంది నిందితులు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహిల్యానగర్‌లకు చెందినవారు. వీరిలో ఐదుగురు ఏడు రోజుల పోలీస్ కస్టడీలో ఉండగా, పుణెలో అరెస్టయిన ఇద్దరిని ఢిల్లీకి తరలిస్తున్నారు. మిగిలిన వారిని విచారిస్తున్నారు.

అసలు సూత్రధారి కూడా అరెస్ట్

లక్షల రూపాయలు వసూలు చేసి ఈ కుంభకోణానికి తెరతీసిన అసలు సూత్రధారి (కింగ్‌పిన్) పీవీ కులకర్ణిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన ఒక కెమిస్ట్రీ (Chemistry) లెక్చరర్. ఎన్‌టీఏ తరఫున ఎగ్జామినేషన్ ప్రాసెస్‌లో పాల్గొన్న కులకర్ణి చేతికి నీట్-యూజీ 2026 పేపర్లు ముందే చిక్కాయి. ఆయన కూడా మనీషా వాగ్మారేతో కలిసి పుణెలోని తన ఇంట్లో స్పెషల్ కోచింగ్ పేరుతో ఏప్రిల్ చివరి వారంలో కెమిస్ట్రీ ప్రశ్నలను, ఆన్సర్‌లతో సహా విద్యార్థులకు లీక్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

విద్యార్థులు రాసుకున్న ప్రశ్నలు, మే 3న జరిగిన పరీక్షలోని ప్రశ్నలతో అక్షరం పొల్లుపోకుండా సరిపోలాయని దర్యాప్తు సంస్థ వివరించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యావిభాగం ఫిర్యాదు మేరకు మే 12న సీబీఐ ఈ కేసును నమోదు చేసి దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ స్కామ్‌లో మరెంత మంది పెద్ద తలకాయలు ఉన్నాయన్న కోణంలో విచారణ సాగుతోంది.

Advertisement
Advertisement