త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hydrogen Train | నేడు దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

Hydrogen Train | భార‌తీయ‌ రైల్వేలో (Indian Railways) సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు (Hydrogen Train) పట్టాలెక్కనున్నది. ప‌ర్యావ‌ర‌ణ హిత ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో కీల‌క ముంద‌డుగుగా నిలువ‌నున్న ఈ రైలు సేవ‌ల‌ను హ‌ర్యానాలోని జింద్‌లో (Jind) ప్రధాని మోదీ (PM Modi) పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

G

National | Published On Jul 17, 2026, 7.44 am IST

Hydrogen Train | నేడు దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ
Advertisement

Hydrogen Train | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌తీయ‌ రైల్వేలో (Indian Railways) సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు (Hydrogen Train) పట్టాలెక్కనున్నది. ప‌ర్యావ‌ర‌ణ హిత ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో కీల‌క ముంద‌డుగుగా నిలువ‌నున్న ఈ రైలు సేవ‌ల‌ను హ‌ర్యానాలోని జింద్‌లో (Jind) ప్రధాని మోదీ (PM Modi) పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో హైడ్రోజన్ శక్తితో నడిచే ప్యాసింజర్ రైలును నడిపే దేశాల జాబితాలో భారత్ చేర‌నుంది. ఇప్ప‌టికే ఈత‌ర‌హా రైళ్లు జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, చైనా, అమెరికాలో న‌డుస్తున్నాయి.

హర్యానాలోని జింద్‌-సోనిపట్ (Jind and Sonipat) మార్గంలో ప‌రుగులు పెట్ట‌నున్న ఈ రైలును 10 బోగీల‌తో రూపొందించారు. దాదాపు 2600 మంది ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్తుంది. గంట‌కు 110 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లే సామ‌ర్ధ్యంతో దీనిని త‌యారుచేసిన‌ప్ప‌టికీ 75 కిలోమీట‌ర్ల‌కే ప‌రిమితం కానుంది. ప్రతిరోజు జింద్‌-సోనిప‌ట్ మ‌ధ్య రెండు ట్రిప్పులు న‌డువ‌నుంది. ఈ రైలు కోసం జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే కంప్రెస్డ్ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ని రైలులో నింపుతారు.

ఈ రైలు ప్ర‌త్యేక‌త ఏంటి..

సాధారణంగా రైళ్లు డీజిల్, విద్యుత్‌పై ఆధారపడి నడుస్తున్నాయి. అయితే, హైడ్రోజన్ రైళ్లు విద్యుత్, సంప్రదాయ ఇంధనాలకు బదులుగా హైడ్రోజన్‌ను (Hydrogen) ఉపయోగిస్తాయి. ఈ రైళ్లలో అమర్చిన ప్రత్యేక ఇంజిన్ వ్యవస్థ హైడ్రోజన్ నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి రైలును నడిపిస్తుంది. హైడ్రోజన్ ఇంధన కణాలు (Hydrogen Fuel Cell) ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగంతో భారీగా కార్బన్ ఉద్గారాలు వెలువడతాయి. ఇవి గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదలకు, భూతాపానికి ప్రధాన కారణాలుగా పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే డీజిల్ ఇంజిన్లు అత్యధిక కాలుష్యాన్ని సృష్టించే రవాణా సాధనాల్లో ఒకటిగా నిలిచాయి.

భారత రైల్వే ఇప్పటికే డీజిల్ రైళ్ల స్థానంలో ఎలక్ట్రిక్‌ లోకోమెటివ్‌లను ప్రవేశపెడుతోంది. అయితే, విద్యుత్ రైళ్లు కూడా పూర్తిగా కాలుష్య రహితం కావు. ఎందుకంటే వాటికి అవసరమైన విద్యుత్‌లో ఎక్కువ భాగం ఇప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచే వస్తోంది. బొగ్గు కూడా ఒక శిలాజ ఇంధనమే. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ రైళ్లు మరింత పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇవి కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా.. శక్తి వినియోగంలోనూ సమర్థవంతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ మార్గంలోనే ఎందుకు..?

భారత రైల్వేలో ఎక్కువ భాగం బ్రాడ్‌గేజ్ మార్గాలు ఇప్పటికే విద్యుద్దీకరించారు. అయితే విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం కష్టమైన, అధిక వ్యయం అయ్యే ప్రాంతాల్లో హైడ్రోజన్ సాంకేతికతను పరీక్షించాలని రైల్వే నిర్ణయించింది. జింద్‌లో ఇప్పటికే హైడ్రోజన్ ప్లాంట్ ఉండటం, మార్గం తక్కువ దూరంలో ఉండటం, రైలు వేగం పరిమితంగా ఉండటం వంటి కారణాలు ఈ మార్గాన్ని పైలట్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉంటుందని రైల్వేశాఖ భావించింది.

హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు అభివృద్ధి కోసం 2023-24 బడ్జెట్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ రూ.2,800 కోట్లు కేటాయించింది. ఈ నిధులను పరిశోధన, డిజైన్, పరీక్షలు, అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెము) రైళ్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అమర్చేందుకు రూ.111.83 కోట్ల విలువైన పైలట్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. ప్రస్తుతం హైడ్రోజన్ రైళ్ల నిర్వహణ వ్యయంపై స్పష్టత లేదు. ప్రారంభంలో ఎక్కువగా ఉండొచ్చని.. రైళ్ల సంఖ్య పెరిగే కొద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు.

ప్రపంచంలో హైడ్రోజన్‌ రైళ్లు..

హైడ్రోజన్ రైళ్ల సాంకేతిక విషయంలో ఇప్పటికే పలు దేశాలు ముందున్నాయి. తాజాగా ఆయా దేశాల సరసన భారత్‌ సైతం చేరబోతోంది. జర్మనీ 2016లో ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టింది. 2018 నుంచి ఆల్స్టమ్ కొరాడియా ఐలింట్ రైళ్లు వాణిజ్య సేవలు అందిస్తున్నాయి. అలాగే, చైనా నగర రవాణా, పర్యాటక అవసరాల కోసం హైడ్రోజన్ రైళ్లను ఉపయోగిస్తోంది. జపాన్‌ సురుమి లైన్ సహా పలు మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను పరీక్షించింది.

అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో ‘అరో’ పేరుతో హైడ్రోజన్ ప్రయాణికుల రైలు నడుస్తోంది. అలాగే, ఫ్రాన్స్, స్వీడన్, బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికతపై పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. భారత తొలి హైడ్రోజన్ రైలు కేవలం కొత్త రవాణా సాధనం మాత్రమే కాకుండా కాలుష్య రహిత ప్రయాణం వైపు వేస్తున్న కీలక అడుగుగా రైల్వే అధికారులు అభివర్ణించారు. భవిష్యత్‌లో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు పట్టాలెక్కితే.. పర్యావరణ పరిరక్షణలో భారత రైల్వే కొత్త దిశను చూపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement