వందేమాతరం తెలియని భారతీయుడు ఉండడు. వందేమాతరానికి ఉన్న చరిత్ర అటువంటిది. స్కూల్ పిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు అందరూ వందేమాతరం పాట వినబడగానే ఉప్పొంగిపోతారు. దీన్ని దేశ భక్తి గీతం అని పిలుస్తాం. నిజానికి మన జాతీయ గీతం జనగణమన అయినప్పటికీ దానితో పాటు వందేమాతరానికి కూడా సమాన గౌరవం ఇస్తాం. 1875 నవంబర్ 7న ఈ గీతాన్ని బంకిం చంద్ర ఛటర్జీ రచించారు. ఆ రోజే ఈ గీతం ఓ సాహిత్య పత్రికలో మొదటగా ప్రచురింపబడింది. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర అప్పటి నుంచి భారత స్వాతంత్ర పోరాటంలో వందేమాతరం పోషించిన పాత్ర అమోఘం. దాని చారిత్రక ప్రాముఖ్యత అనేది చాలా గొప్పది. అందుకే, వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో ఈ గీతంపై ప్రత్యేక చర్చను ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక చర్చ ద్వారా దేశభక్తి గీతమైన వందేమాతరానికి సంబంధించిన మనకు తెలియని చాలా విషయాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. వందేమాతరం చారిత్రక ప్రాముఖ్యత, దాని ఆవశ్యకతను ప్రధాని మోదీ తన ప్రసంగంలో సోమవారం ప్రసంగించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన చరణాలను తొలగించింది నవంబర్ నెలలో జరిగిన గీత వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 1937 లో జరిగిన ఫైజాబాద్ సెషన్‌లో కాంగ్రెస్ పార్టీ వందేమాతరం గీతం నుంచి కొన్ని ముఖ్యమైన చరణాలను తొలగించిందని ఆరోపించారు. కాంగ్రెస్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లనే దేశ విభజన పురుడు పోసుకుందని.. దేశ విభజనకు బీజాలు పడ్డాయని విమర్శించారు. జాతీయ గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని మండిపడ్డారు. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు, ఇతర మతాల వారి మనోభావాలను గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్న నేపథ్యంలో లోక్ సభలో ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రాజ్యసభలో చర్చ ప్రారంభించనున్న అమిత్ షా సోమవారం లోక్ సభలో చర్చ తర్వాత, మంగళవారం రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. లోక్ సభలో వందేమాతరం గీతంపై చర్చ కోసం 10 గంటల సమయాన్ని కేటాయించారు. అందులో ఎన్‌డీఏ మెంబర్స్ కోసం 3 గంటల సమయాన్ని కేటాయించారు.