త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganga Expressway | గంగా ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని.. జీవ‌రేఖ అవుతుంద‌ని వ్యాఖ్య‌లు..!

P

National | Published On Apr 29, 2026, 4.09 pm IST

Ganga Expressway | గంగా ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని.. జీవ‌రేఖ అవుతుంద‌ని వ్యాఖ్య‌లు..!
Advertisement

Ganga Expressway | ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు నిర్మించిన 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ మెగా ప్రాజెక్ట్‌ను రూ. 26,230 కోట్ల వ్యయంతో ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. పశ్చిమ, మధ్య, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాలను అనుసంధానించేలా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ 12 జిల్లాల మీదుగా సాగుతుంది. మీరట్, బులంద్‌షహర్, హాపూర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్‌పూర్, హార్డోయి, ఉనావో, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ జిల్లాలు ఈ మార్గంలో ఉన్నాయి. ఈ కనెక్టివిటీ ద్వారా రాష్ట్రంలో రహదారి మౌలిక సదుపాయాలకు కొత్త దిశ లభిస్తుందని ప్ర‌భుత్వం పేర్కొంది.

ఆరు గంట‌ల్లోనే ప్ర‌యాణం..

ప్రస్తుతం మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుండగా, కొత్త ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావ‌డంతో స‌మ‌యం సుమారు ఆరుగంట‌ల త‌గ్గ‌నుంది. ప్ర‌యాణ వేగం పుంజుకోవ‌డంతో రవాణా వ్యవస్థతో వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఇది గణనీయమైన లాభం చేకూర్చనుందని అంచనా. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా షాజహాన్‌పూర్ జిల్లాలో 3.5 కిలోమీటర్ల పొడవైన అత్యవసర విమానాల ల్యాండింగ్ ఫెసిలిటీ క‌ల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో వైమానిక దళం వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.

ఎక‌నామిక్ కారిడార్‌గా..

గంగా ఎక్స్‌ప్రెస్‌వేను కేవలం రహదారిగా కాకుండా ఓ ఎక‌నామిక్ కారిడార్‌గా అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. సుమారు 2,635 హెక్టార్ల భూమిలో సమగ్ర తయారీ కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్‌తో ప‌రిశ్రమలు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. అలాగే, ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, జేవార్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే, ఫరూఖాబాద్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే వంటి ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మార్గాలతో ఈ ప్రాజెక్ట్ అనుసంధానమవుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్ రవాణా వ్యవస్థ మరింత బలపడనుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

గంగా న‌ది త‌ర‌హాలోనే జీవ‌న‌రేఖ‌గా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గంగా నది ఎలా ఉత్తరప్రదేశ్‌కు జీవనాధారమో, ఈ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్ర అభివృద్ధికి కొత్త జీవనరేఖగా మారుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలోని ఆర్థిక అవకాశాలను విస్తరించడమే కాకుండా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)తో క‌నెక్టివిటీ పెరుగుతుంద‌న్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ విజయానికి రైతుల సహకారం కీలకమని పేర్కొన్నారు. సుమారు ఒక లక్ష మందికి పైగా రైతులు భూములు అందించారని, మొత్తం 18 వేల ఎకరాల భూమిని ఎక్స్‌ప్రెస్‌వే కోసం సేకరించామని తెలిపారు. అదనంగా 7 వేల ఎకరాలను పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్స్ అభివృద్ధికి కేటాయించినట్లు ఆయన వివ‌రించారు.

Advertisement
Advertisement