త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | కామాఖ్య-చర్లపల్లి మధ్య అమృత్‌ భారత్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అసోంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ.4,570కోట్లకుపైగా విలైవన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే, అసోంలోని కోక్రాజార్‌, ఈశాన్య ప్రాంతాల్లో రైలు కనెక్టివీని మెరుగుపరిచేందుకు మూడు కొత్త రైలు సర్వీసులను ప్రారంభించారు.

P

National | Published On Mar 13, 2026, 4.55 pm IST

PM Modi | కామాఖ్య-చర్లపల్లి మధ్య అమృత్‌ భారత్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
Advertisement

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అసోంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ.4,570కోట్లకుపైగా విలైవన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే, అసోంలోని కోక్రాజార్‌, ఈశాన్య ప్రాంతాల్లో రైలు కనెక్టివీని మెరుగుపరిచేందుకు మూడు కొత్త రైలు సర్వీసులను ప్రారంభించారు. ఇందులో కామాఖ్య-చర్లపల్లి మధ్య అమృత్‌ భారత్‌ రైలు (Kamakhya–Charlapalli Amrit Bharat Express)తో పాటు, గువాహటి-న్యూ జాల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్‌ (Guwahati–New Jalpaiguri Express), నారంగి-అగర్తలా (Narangi–Agartala Express) ఉన్నాయి. త్వరలో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రెండురోజుల పర్యటన కోసం అసోంకు చేరారు. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా కోక్రాజార్‌కు వెళ్లలేకపోయారు. దాంతో గువాహటి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులకు భూమిపూజ, శంకుస్థాపన చేశారు.

ప్రధాని ప్రారంభించిన కామాఖ్య-చర్లపల్లి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈశాన్య భారత్‌తో దక్షిణ భారత్‌ను నేరుగా రైల్వేమార్గంతో కలుపుతుంది. అలాగే, గువాహటి–న్యూ జల్పాయిగురి ఎక్స్‌ప్రెస్ అసోం-పశ్చిమ బెంగాల్‌ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. నారంగి, అగర్తలా ఎక్స్‌ప్రెస్‌ అసోం-త్రిపుర మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఈ రైలు సేవలు ప్రయాణికులు, వ్యాపారులు, పర్యాటకులకు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి. ఈ ప్రాజెక్టులతో బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌లోని కోక్రాజార్ జిల్లాలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. పర్యాటకం, వ్యవసాయ రంగానికి మార్కెట్‌కు డిమాండ్‌తో పాటు వైద్య సేవలు పొందే అవకాశం, గ్రామీణ రవాణా వ్యవస్థలు కూడా మెరుగుపడతాయని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రధాని మోదీ కోక్రాజార్ జిల్లాలోని బశ్‌బారి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న రైల్వే పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ (POH) వర్క్‌షాప్‌కు కూడా శంకుస్థాపన చేశారు. ఈ వర్క్‌షాప్ ఏర్పాటుతో రైల్వే నిర్వహణ మౌలిక వసతులు బలోపేతం కావడంతో పాటు రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. అదేవిధంగా రూ.3,200 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టనున్న అసోం మాలా 3.0 రహదారి మౌలిక వసతుల ప్రాజెక్టుకు కూడా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ చేశారు. ఈ పథకం కింద అసోం అంతటా 900 కిలోమీటర్లకుపైగా రహదారులు నిర్మించనున్నారు. దీంతో ద్వారా రాష్ట్రాల మధ్య రహదారి కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు జాతీయ రహదారులు, గ్రామీణ రహదారుల మధ్య అనుసంధానం బలపడుతుంది.

అలాగే బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (BTC) పరిధిలో చేపట్టనున్న ఆరు రహదారి ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో నాలుగు ఫ్లైఓవర్లు, రెండు వంతెనలు ఉండగా, ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.1,100 కోట్ల పెట్టుబడి ఖర్చు అవుతుంది. శనివారం ప్రధాని సిల్చార్‌లో రూ.23,550 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టులకు భూమిపూజ చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. ఇదిలా ఉండగా అసోంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది.

Advertisement
Advertisement