త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | కేంద్ర మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌ధాని మోదీ అత్యున్న‌త స్థాయి స‌మావేశం

PM Modi | ప్రధాని న‌రేంద్ర మోదీ ఆదివారం రాత్రి దేశ భద్రత‌, వ్యూహాత్మక అంశాలపై అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశానికి అధ్యక్షత వహించారు. పశ్చిమ ఆసియాలో తాజా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

S

National | Published On Mar 2, 2026, 8.37 am IST

PM Modi | కేంద్ర మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌ధాని మోదీ అత్యున్న‌త స్థాయి స‌మావేశం
Advertisement

PM Modi | ప్రధాని న‌రేంద్ర మోదీ ఆదివారం రాత్రి దేశ భద్రత‌, వ్యూహాత్మక అంశాలపై అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశానికి అధ్యక్షత వహించారు. పశ్చిమ ఆసియాలో తాజా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖ‌మేనీ హతమవడంతో ఏర్పడిన పరిస్థితులపై సమగ్ర సమీక్ష చేయడమే ఈ సమావేశం ఉద్దేశ్యమని విశ్వ‌స‌నీయ‌ వర్గాలు తెలిపాయి. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరి పర్యటన ముగించుకుని రాత్రి సుమారు 9.30 గంటలకు ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధాని ఈ సమావేశాన్ని నిర్వహించారు.

భార‌తీయుల భ‌ద్ర‌త‌పై చ‌ర్చ‌..?

ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీలు పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ ఆసియాలోని పరిస్థితులు భారత్‌పై చూపే ప్రభావాలపై ఉన్నతాధికారులు వివరించినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో నివసిస్తున్న భారతీయుల భద్రత, అక్కడ చిక్కుకుపోయిన వారి పరిస్థితి, ఇక‌పై పరిస్థితి మరింత దిగజారితే చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు స‌మాచారం.

చ‌మురు స‌ర‌ఫ‌రాపై..?

ప్రస్తుతం పశ్చిమ ఆసియా గగనతలం దాదాపు మూసేశారు. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో దుబాయ్, దోహా తదితర విమానాశ్రయాల్లో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. సోషల్ మీడియాలో సహాయం కోరుతూ పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయా ప్రాంతాల‌లోని భార‌త‌ పౌరులతో నిరంతరం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని, హెల్ప్‌లైన్లు ప్రారంభించామని తెలిపింది. మ‌రోవైపు ఇరాన్ అధికారులు హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో భారత చమురు రవాణాపై ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు విశ్వ‌స‌నీయ వర్గాలు తెలిపాయి. ఈ జలసంధి భారత చమురు దిగుమతులకు కీలక మార్గంగా ఉంది.

త‌దుప‌రి చ‌ర్య‌లు..

ఇరాన్‌లో సుమారు 10వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో 40వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. గల్ఫ్, పశ్చిమ ఆసియాలో మొత్తం భారతీయుల సంఖ్య సుమారు 90 ల‌క్ష‌లుగా ఉంది. గతంలో కూడా పశ్చిమ ఆసియా సహా పలు యుద్ధ ప్రాంతాల నుంచి భారత్ విజయవంతంగా వేలాది పౌరులను తరలించిన అనుభవం ఉంది. అయితే ప్ర‌ధాని మోదీ నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో ముఖ్యంగా ప్రాంతీయ స్థిరత్వం, చమురు సరఫరాలు, భారతీయుల భద్రత అనే ఈ మూడు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని, వీటిపైనే భార‌త ప్ర‌భుత్వం త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Advertisement
Advertisement