త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | మోదీ స‌భ‌కు దూరంలో పేలుడు ప‌దార్థాలు సీజ్‌.. బెంగ‌ళూరులో ఘ‌ట‌న‌..!

P

National | Published On May 10, 2026, 5.18 pm IST

PM Modi | మోదీ స‌భ‌కు దూరంలో పేలుడు ప‌దార్థాలు సీజ్‌.. బెంగ‌ళూరులో ఘ‌ట‌న‌..!
Advertisement

PM Modi | బెంగళూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఆదివారం ఆయన పాల్గొననున్న కార్యక్రమాల ముందు నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద వ‌స్తువులు వెలుగులోకి రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కనకపుర రోడ్డులోని కాగలిపుర సమీపంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం పరిసరాల్లో భద్రతా సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఫుట్‌పాత్ పక్కన రెండు జెలటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. ఈ ప్రాంతం ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమ వేదికకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండ‌డం వెంటనే భ‌ద‌త్రా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.

అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో బాంబ్ స్క్వాడ్‌తో పాటు ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రాథమిక పరిశీలనలో అవి పేలుడు పదార్థాలుగా తేల‌డంతో పరిసరాలను పోలీసులు వెంటనే సీజ్ చేశారు. బెంగళూరు సెంట్రల్ రేంజ్ డీఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జెలటిన్ స్టిక్స్ లభించిన ప్రాంతం వేదికకు సమీపంలోనే ఉందని, అక్క‌డికి ఎలా వ‌చ్చాయ‌న్న కోణంలో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌న్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఇవి మైనింగ్ అవసరాల కోసం తీసుకువచ్చినవా.. లేక పర్యటనను లక్ష్యంగా చేసుకున్న కుట్రలో భాగమా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అరెస్టులు జరగలేదని అధికారులు తెలిపారు. ఈ పరిణామాల మధ్యనే ప్రధాని మోదీ తన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన హాజరై, కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణపై ప్ర‌సంగించారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. మోదీ టూర్ ప్ర‌శాంతంగా ముగియ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
Advertisement