త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder Case | చేతబడి అనుమానంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య.. మైన‌ర్ స‌హా ఏడుగురు నిందితులు అరెస్ట్

Murder Case | రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మహ్మద్‌ మహబూబ్‌ అలీ (53)ని హత్య చేసిన కేసును ఫలక్‌నుమా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులతో పాటు ఓ మైనర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు కత్తులు, బాకులు, రెండు యాక్టివా వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

P

Hyderabad | Published On Sep 4, 2026, 6.57 pm IST

Murder Case | చేతబడి అనుమానంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య.. మైన‌ర్ స‌హా ఏడుగురు నిందితులు అరెస్ట్
Advertisement

Murder Case | రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మహ్మద్‌ మహబూబ్‌ అలీ (53)ని హత్య చేసిన కేసును ఫలక్‌నుమా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులతో పాటు ఓ మైనర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు కత్తులు, బాకులు, రెండు యాక్టివా వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వట్టేపల్లిలోని ఫాతిమానగర్‌కు చెందిన మహబూబ్‌ అలీ ఆగస్టు 30న రాత్రి 9.30 గంటలకు ఆల్మాస్‌ హోటల్‌ ఎదురుగా ఉండగా.. రెండు యాక్టివాలపై వచ్చిన నిందితులు ఆయనను అడ్డుకున్నారు. కత్తులు, బాకులతో తల, ఛాతీ, చేతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహబూబ్‌ అలీని ప్రిన్సెస్‌ ఎస్రా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహ్మద్‌ షానవాజ్‌ ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

అనారోగ్యానికి చేతబడే కారణమని..

ప్రధాన నిందితుడు మీర్జా మోహిన్‌ బైగ్‌ తన తల్లి తాహిరా బేగం అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. అయితే, ఆమె అనారోగ్యానికి మహబూబ్‌ అలీ చేత‌బ‌డి చేశాడ‌ని నిందితుడు భావించాడు. తన మేనమామ మహ్మద్‌ ఖలీల్‌ మృతికి కూడా మహబూబ్‌ అలీ చేసిన చేతబడే కారణమని అనుమానించాడు. ఈ విషయాన్ని బావమరిది మహ్మద్‌ ఇమ్రాన్‌ అహ్మద్‌కు చెప్పగా.. అత‌ని హత్యకు సహకరిస్తానని, బెయిల్‌ ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో మిగిలిన వారితో కలిసి హత్యకు ప్లాన్ వేశారు. ఆగస్టు 30న మహబూబ్‌ అలీ ఆల్మాస్‌ హోటల్‌ వద్ద ఉన్నాడని తెలుసుకున్న నిందితులు అయాన్‌ దర్బార్‌ హోటల్‌ వద్ద సమావేశమై కత్తులు, బాకులు సమకూర్చుకున్నారు. అనంతరం అక్కడికి చేరుకుని మహబూబ్‌ అలీని హతమార్చారు.

హ‌త్య‌లో పాల్గొన్న మీర్జా మోహిన్‌ బైగ్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌ అహ్మద్‌, మహ్మద్‌ నసీర్‌, షేక్‌ అక్రమ్‌, మహ్మద్‌ అబ్రార్‌ అలీ, మహ్మద్‌ సమీ అలియాస్‌ షట్టర్‌తో పాటు ఓ మైనర్ బాలుడిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు వివ‌రించారు. చేతబడులు మూఢనమ్మకాలేనని, వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రాజేంద్రనగర్‌ జోన్‌ డీసీపీ ఎస్ శ్రీనివాస్‌ తెలిపారు. ఇలాంటి నమ్మకాలతో హింసకు పాల్పడొద్దని, ఏదైనా సమస్య ఉంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు. కేసును ఛేదించిన ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్ ఎం అప్పల నాయుడు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ జకీర్‌ హుస్సేన్‌, క్రైమ్‌ టీమ్‌ను డీసీపీ, ఫలక్‌నుమా ఏసీపీ ఎంఎ జావీద్‌ను అభినందించారు.

Advertisement
Advertisement