త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pax-Silica | ‘పాక్స్ సిలికా’లో చేరిన భారత్‌.. వ్యూహత్మక ఒప్పందంపై సంతకాలు..

Pax-Silica | ‘పాక్స్‌ సిలికా’ పేరుతో అమెరికా ప్రారంభించిన వ్యూహాత్మక కార్యక్రమంలో భారత్‌ సైతం చేరింది. ఈ ఒప్పందంపై భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్, అమెరికా ప్రతినిధి జేకబ్ హెల్‌బర్గ్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో సంతకాలు జరిగాయి.

P

National | Published On Feb 20, 2026, 3.00 pm IST

Pax-Silica | ‘పాక్స్ సిలికా’లో చేరిన భారత్‌.. వ్యూహత్మక ఒప్పందంపై సంతకాలు..
Advertisement

Pax-Silica | ‘పాక్స్‌ సిలికా’ పేరుతో అమెరికా ప్రారంభించిన వ్యూహాత్మక కార్యక్రమంలో భారత్‌ సైతం చేరింది. ఈ ఒప్పందంపై భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్, అమెరికా ప్రతినిధి జేకబ్ హెల్‌బర్గ్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రభుత్వంలోని మంత్రి జేకబ్‌ హెల్‌బర్గ్‌ మాట్లాడుతూ పాక్స్ సిలికా అనేది భవిష్యత్తు నిర్మించే వారిదేనని, స్వేచ్ఛాయుత దేశాలు కలిసివచ్చినప్పుడు ఆ శక్తి మరింత పెరుగుతుందన్నారు. ఏఐ భవిష్యత్‌లో అత్యంత ప్రభావవంతమైన శక్తిగా మారుతుందని, ఆర్థిక, జాతీయ భద్రత కోసం బలమైన సరఫరా గొలుసులు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.

పాక్స్‌ సిలికా అంటే..?

పాక్స్ సిలికా (Pax Silica) అనేది అమెరికా నేతృత్వంలో డిసెంబర్ 2025లో ప్రారంభించిన ఒక వ్యూహాత్మక అంతర్జాతీయ కూటమి. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కీలక ఖనిజాల (Critical Minerals) సరఫరా గొలుసును సురక్షితం చేయడం.. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం, విశ్వసనీయ భాగస్వాములతో సురక్షితమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దీని ఉద్దేశం. ఇందులో ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, యుఏఈ, సింగపూర్, ఇజ్రాయెల్, ఖతార్, గ్రీస్ దేశాలు సంతకాలు చేశాయి. కెనడా, యూరోపియన్ యూనియన్, నెదర్లాండ్స్, తైవాన్ దేశాలు భాగస్వాములుగా చేరాయి. తాజాగా భారత్‌ సైతం అధికారికంగా ఈ కూటమిలో చేరింది. కూటమిలో భారత్‌ చేరడం ఎంతో కీలకమని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. సెర్జియో గోర్‌ మాట్లాడుతూ ‘స్వేచ్ఛ, శక్తి, విజయం’ వైపు తీసుకెళ్లే భాగస్వామ్యం అని పేర్కొన్నారు. భవిష్యత్తు సాంకేతికత బెంగళూరు, సిలికాన్ వ్యాలీలో అభివృద్ధి చెందుతుందా? పర్యవేక్షణలో ఉన్న దేశాల్లోనూ అన్నది ఈ భాగస్వామ్యంతో తేలుతుందని తెలిపారు. జేకబ్ హెల్‌బర్గ్ మాట్లాడుతూ అనేక దేశాలు ప్రస్తుతం ఆర్థిక ఒత్తిళ్లు, బ్లాక్‌మెయిల్స్‌ను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ‘ఆర్థిక భద్రతే జాతీయ భద్రత’ అని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక, సరఫరా గొలుసులను బలోపేతం చేసి.. దేశాల సుసంపన్నతను పెంచడమే కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.

భారత్‌కు ఈ ఒప్పందం ఎందుకు కీలకం?

ఈ ఒప్పందం వల్ల భారత్‌కు పలు ప్రయోజనాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఏఐ పరిశోధన, ఆవిష్కరణల్లో సహకారం లభిస్తుంది. ఆర్థిక భద్రత ఉంటుంది. సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కీలక ఖనిజాలు, చిప్ సరఫరాకు భద్రత లభిస్తుంది. వ్యూహాత్మక ముందంజతో పాటు అమెరికా, మిత్రదేశాలతో బలమైన సంబంధాలు ఉంటాయి. ప్రపంచ సాంకేతిక విషయంలో భారత్‌ పాత్ర పెరుగుతుంది. భారత్–అమెరికా పాక్స్ సిలికా ఒప్పందంపై సంతకాల తర్వాత కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ.. 1947 నుంచే ఈ స్ఫూర్తి కొనసాగింటే.. భారత్‌ ఎంత వేగంగా అభివృద్ధి సాధించేదో ఊహించవచ్చన్నారు. అది 2014 నుంచి అయినా పర్వాలేదు.. ఇప్పుడు మీ తరం ఈ వృద్ధి రేటు ప్రయోజనాలను పొందుతుందన్నారు.

Advertisement
Advertisement