త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | తమిళనాడులో విజయ్ పార్టీ గెలవడంపై స్పందించిన పవన్ కళ్యాణ్

తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకున్నారు. ప్రముఖ కథానాయకుడు, యువకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి అధిక స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారన్నారు.

J

National | Published On May 4, 2026, 5.48 pm IST

Pawan Kalyan | తమిళనాడులో విజయ్ పార్టీ గెలవడంపై స్పందించిన పవన్ కళ్యాణ్
Advertisement
  • బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం

Pawan Kalyan | త్రినేత్ర.న్యూస్ : ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్నారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని స్పష్టం చేశారు.

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు. అసోమ్, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న బీజెపీని, ఆ పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష సర్వదా శ్లాఘనీయం. పశ్చిమ బెంగాల్ వాసుల నమ్మకాన్ని ప్రోదిచేసుకోడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చిందన్నారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో రాష్ట్రంలో బీజేపీ పాలన ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే పశ్చిమ బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందన్న గట్టి విశ్వాసంతో ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి, అమిత్ షాకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కి, బీజేపీ పశ్చిమ బెంగాల్ నేత సువేందు అధికారికి, ఈ విజయంలో భాగస్వాములైన బీజేపీ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

అసోమ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి మరోమారు విజయాన్ని దక్కించుకున్న బీజేపీ నేత, అసోమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మకి, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి విజయాన్ని మళ్లీ అందించిన ముఖ్యమంత్రి రంగసామికి అభినందనలు తెలిపారు.

తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకున్నారు. ప్రముఖ కథానాయకుడు, యువకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి అధిక స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారన్నారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన విజయ్ ని మనసారా అభినందిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పోరాటం బలమైనదే. అదే విధంగా కేరళలో కూడా మార్పునే మెజారిటీ ఓటర్లు కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన యూడీఎఫ్ నాయకత్వానికి, నాయకులకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement