Parliament Winter session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. పార్లమెంట్ ఉభయసభలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి. 15 రోజుల పాటు లోక్ సభ, రాజ్య సభలో సమావేశాలు జరిగాయి. ఈ 15 రోజులు సమావేశాలు వాడివేడిగా సాగాయి. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం 10 బిల్లులను ప్రవేశపెట్టింది. ఇందులో 8 బిల్లులకు సభ ఆమోదం లభించింది. జీ రామ్ జీ, శాంతి బిల్లులకు ఆమోదం ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులలో జీ రామ్ జీ బిల్లు ఒకటి. జాతీయ ఉపాధి హామీ పథకం అయిన ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కొత్త బిల్లులో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వీబీ జీ రామ్ జీ బిల్లుగా పేరు మార్చి ఏడాదికి ఇప్పటి వరకు ఉన్న 100 రోజుల పనికి బదులుగా 125 రోజుల ఉపాధిని కల్పించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ స్కీమ్‌కి ఉన్న మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఏంటని ప్రతిపక్షాలు రచ్చ రచ్చ చేశాయి. అయినా కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకుంది. దేశంలో అణు రంగాన్ని బలోపేతం చేసేందుకు అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం కోసం తీసుకొచ్చిన శాంతి బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. వందేమాతరం 150 ఏళ్ల వార్షికోత్సవంపై చర్చ వందేమాతరం గేయం 150 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సభ ప్రారంభంలోనే దీనిపై ప్రత్యేక చర్చ ప్రారంభించారు. వందేమాతరం ప్రాముఖ్యతను దేశానికి చాటి చెప్పారు. వందేమాతరానికి కూడా జనగణమనకు ఇచ్చిన గౌరవాన్ని ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక మళ్లీ పార్లమెంట్ సమావేశాలు వచ్చే సంవత్సరం బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రారంభం కానున్నాయి.