త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S400 | ఎస్‌-400 కోసం పాక్‌ గూఢచర్యం!

S400 | ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ మోహరించిన ఎస్‌-400 వాయు రక్షణ వ్యవస్థ పాకిస్థాన్‌కు ప్రధాన ముప్పుగా మారిందని పశ్చిమ వైమానిక దళ కమాండ్‌ మాజీ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ఎస్‌-400 వ్యవస్థల జాడ తెలుసుకునేందుకు 2025 మేలో పాకిస్థాన్‌ భారత్‌లోని గూఢచారులు, స్లీపర్‌ సెల్స్‌ను సైతం క్రియాశీలం చేసిందని తెలిపారు. ఇతర దేశాల ఉపగ్రహాల సాయంతోనూ ఆ వ్యవస్థల స్థానాన్ని గుర్తించేందుకు ప్రయత్నించిందన్నారు.

P

National | Published On Aug 28, 2026, 1.44 pm IST

S400 | ఎస్‌-400 కోసం పాక్‌ గూఢచర్యం!
Advertisement
  • జాడ తెలుసుకునేందుకు స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌
  • ఆపరేషన్‌ సిందూర్‌లో కీలక పాత్ర
  • ఇతర దేశాల నుంచి ఉపగ్రహ సమాచారం
  • వెల్లడించిన పశ్చిమ వైమానిక దళ మాజీ అధిపతి జితేంద్ర మిశ్రా

S400 | ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ మోహరించిన ఎస్‌-400 వాయు రక్షణ వ్యవస్థ పాకిస్థాన్‌కు ప్రధాన ముప్పుగా మారిందని పశ్చిమ వైమానిక దళ కమాండ్‌ మాజీ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ఎస్‌-400 వ్యవస్థల జాడ తెలుసుకునేందుకు 2025 మేలో పాకిస్థాన్‌ భారత్‌లోని గూఢచారులు, స్లీపర్‌ సెల్స్‌ను సైతం క్రియాశీలం చేసిందని తెలిపారు. ఇతర దేశాల ఉపగ్రహాల సాయంతోనూ ఆ వ్యవస్థల స్థానాన్ని గుర్తించేందుకు ప్రయత్నించిందన్నారు.

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఎస్‌-400 కారణంగా పాక్‌ యుద్ధ విమానాలు భారత సరిహద్దులకు 200 కిలోమీటర్ల పరిధిలోకి కూడా రాలేకపోయాయని మిశ్రా తెలిపారు. గగనతలంలోకి వచ్చిన పాక్‌ విమానాలను ఎస్‌-400 అడ్డుకుందని చెప్పారు. ఓ సందర్భంలో ఎస్‌-400 ఆపరేటర్‌ కాల్పులకు అనుమతి కోరగా తాను ఆదేశించానని.. 314 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని కూల్చివేసినట్లు వెల్లడించారు. ఇది సైనిక చరిత్రలో అత్యంత సుదూర వైమానిక లక్ష్య ఛేదనగా నిలిచిందని పేర్కొన్నారు. అత్యాధునిక రాడార్‌, గగనతల లక్ష్యాలను అడ్డుకునే సామర్థ్యాలతో ఎస్‌-400 పనిచేస్తుంది. భారత్‌-రష్యా మధ్య 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఐదు ఎస్‌-400 వ్యవస్థలను భారత్‌ కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే మూడు వ్యవస్థలు భారత వైమానిక దళంలో చేరగా.. నాలుగో వ్యవస్థను ఈ ఏడాది జూన్‌లో అందుకున్నారు.

ఆంక్షలు లేవు..

యుద్ధ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మిశ్రా తెలిపారు. సాధారణ పౌరులకు నష్టం కలగకుండా ఉగ్రవాదులు, వారికి మద్దతిచ్చే వారినే లక్ష్యంగా చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు. యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సైన్యానికి ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం సాయుధ దళాలకే ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాక్‌ సైన్యం పౌర ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, గురుద్వారాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత భారత్‌ ప్రతిస్పందించాలని నిర్ణయించిందన్నారు. తొలుత పాక్‌ భూభాగంలోని గ్రౌండ్‌ రాడార్లు, కమాండ్‌-కంట్రోల్‌ కేంద్రాలను ధ్వంసం చేసి.. ఆ దేశ వైమానిక కార్యకలాపాలను గుర్తించి సమన్వయం చేసే సామర్థ్యాన్ని భారత వైమానిక దళం దెబ్బతీసిందని వివరించారు.

మహిళా పైలట్లదీ కీలక పాత్ర

ఆపరేషన్‌ సిందూర్‌లో మహిళా యుద్ధ విమాన పైలట్లు కీలక పాత్ర పోషించారని మిశ్రా వెల్లడించారు. లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం ఉన్న మురిడ్కేపై దాడుల్లో వారు పాల్గొన్నారని తెలిపారు. మే 10న అదే పైలట్లు పాక్‌ వైమానిక స్థావరాలు, కమాండ్‌-కంట్రోల్‌ కేంద్రాలపై దాడులు నిర్వహించారని చెప్పారు.

Advertisement
Advertisement