త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padma Awards | ప‌ద్మ‌శ్రీ‌కి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా..?

Padma Awards | దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రకటించనున్నారు. జులై 31 వరకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. కళలు, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష సేవ చేసిన వారిని ఈ అవార్డులకు సిఫార‌సు చేయొచ్చు.

P

National | Published On Apr 29, 2026, 3.27 pm IST

Padma Awards | ప‌ద్మ‌శ్రీ‌కి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా..?
Advertisement

Padma Awards | దేశంలో అత్యున్నత పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌కు కేంద్రం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. వ‌చ్చే ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంట్రీల‌ను ఆహ్వానించింది. ఈ ప్ర‌క్రియ మార్చిలో మొద‌లై కాగా.. జులై 31తో ముగియ‌నుంది. అర్హత కలిగిన వ్యక్తుల సేవలను గుర్తించి సమాజానికి పరిచయం చేయడమే అవార్డుల కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అవార్డుల‌కు అర్హ‌త‌లు ఇవే..

ఈ పురస్కారాలకు జాతి, మతం, లింగం, వృత్తి వంటి ఏవైనా పరిమితులు లేవు. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర-సాంకేతిక రంగాలు, ప్రజా వ్యవహారాలు, సివిల్ సర్వీస్, వ్యాపారం, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ప్రత్యేక ప్రతిభ చూపిన అవార్డుల‌కు సిఫార‌సు చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా అర్హుత ఉండ‌దు. కానీ, శాస్త్రవేత్తలకు మాత్రం ప్రత్యేకంగా మినహాయింపు ఉంటుంది. దాంతో వారికి ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ద‌క్కింది.

సామాన్యులకూ ప్రాధాన్యం

పద్మ పురస్కారాలను కేవలం ప్రముఖులకు మాత్రమే కాకుండా, సమాజంలో ఎలాంటి గుర్తింపు లేకుండానే సేవ చేస్తున్న వారిని వెలుగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, దివ్యాంగులు, అణగారిన వర్గాల్లో పనిచేస్తున్న నిస్వార్థ సేవలు అందిస్తున్న వారిని గుర్తించాల‌ని పౌరులను కోరుతోంది. ప్రత్యేకంగా, ఎవరి సహాయం లేకుండానే వ్యక్తులు స్వయంగా కూడా నామినేషన్ చేసుకునే అవకాశం క‌ల్పిస్తోంది.

ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలంటే..

పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే స్వీకరిస్తారు. అభ్యర్థులు లేదా సిఫారసు చేసే వారు అధికారిక పోర్టల్ https://awards.gov.in లో వివరాలు న‌మోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు, ఆ వ్యక్తి చేసిన సేవలను వివ‌రిస్తూ గరిష్టంగా 800 పదాల్లో ఒక వివరణాత్మక నివేదిక (సిటేషన్) సమర్పించాలి. అందులో స‌ద‌రు వ్య‌క్తి చేస్తున్న కృషి ఏంటో స్ప‌ష్టంగా పేర్కొనాలి. మరిన్ని వివరాలు మరియు మార్గదర్శకాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ mha.gov.in, పద్మ అవార్డుల అధికారిక పోర్టల్ padmaawards.gov.inలో సంప్ర‌దించొచ్చు.

క‌మిటీతో సిఫార‌సుతోనే..

ఆన్‌లైన్ విధానంలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌ద్మ అవార్డుల క‌మిటీ ప‌రిశీలిస్తుంది. ఈ ఉన్న‌త‌స్థాయి క‌మిటీని ప్ర‌ధాన మంత్రి ఏర్పాటు చేస్తారు. ఇది కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో పనిచేస్తుంది. ఈ కమిటీ, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాల కోసం వచ్చిన నామినేషన్లను పరిశీలించి, అర్హులైన వారిని ఎంపిక చేసి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఆమోదం కోసం సిఫార‌సు చేస్తుంది. క‌మిటీకి చైర్మ‌న్‌గా కేబినెట్ సెక్ర‌ట‌రీ ఉంటారు. స‌భ్యులుగా హోం సెక్ర‌ట‌రీ, రాష్ట్ర‌ప‌తి సెక్ర‌ట‌రీతో పాటు నాలుగు నుంచి ఆరుగురు ప్ర‌ముఖ వ్య‌క్తులు స‌భ్యులుగా ఉంటారు. వారంతా ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి సిఫార‌సు చేస్తారు.

బాల పుర‌స్కారాల‌కు సైతం..

పద్మ అవార్డులతో పాటు చిన్నారుల ప్రతిభను గుర్తించేందుకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2027’కు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ధైర్యసాహసాలు, క్రీడలు, కళలు-సంస్కృతి, శాస్త్ర-సాంకేతికం, పర్యావరణం, సామాజిక సేవ వంటి రంగాల్లో ప్రతిభ చూపిన బాలలు ఈ అవార్డును అందిస్తుంది. అర్హ‌తల విష‌యానికి వ‌స్తే.. ద‌ర‌ఖాస్తుదారులు భార‌త పౌరులై ఉండాలి. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వ‌య‌సు ఉన్న వారు అర్హులు. చివ‌రి తేది జులై 31, awards.gov.in పోర్ట‌ల్‌లో పేర్లు న‌మోదు చేసుకోవ‌చ్చు.

Advertisement
Advertisement